'తమిళనాడుకు మనకు ఇంత తేడానా?'
అమృత్‌సర్: 'తమిళనాడులో 6,323 మద్యం దుకాణాలున్నాయి. తద్వారా ఏటా రూ.26,188కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. అలాంటిది మద్యం వినియోగంలో దేశంలోనే టాప్ అయిన పంజాబ్‌లో ఎంత ఆదాయం రావాలి? గవర్నమెంట్ లెక్కల ప్రకారం పంజాబ్‌లో 12,500 మద్యం షాపులున్నాయి. కానీ ఆదాయం మాత్రం రూ.5,610 కోట్లేనట!
తమిళనాడుకు, మనకు ఇంత తేడానా? లెక్కల్లోకిరాని ఆ ప్రభుత్వ సొమ్మంతా ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబానికి చెందిన బొక్కసంలోకి చేరుతోంది. ఒక్క మద్యమేకాదు, ట్రన్స్‌పోర్ట్, టూరిజం.. ప్రభుత్వ రంగాలన్నింటినీ బాదల్ కుటుంబం లూటీచేస్తోంది' అంటూ సీఎం కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ. అమృత్‌సర్(ఈస్ట్) స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తోన్న సిద్దూ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గడిచిన పదేళ్లుగా సీఎం బాదల్, ఆయన కుటుంబీకులు పంజాబ్ ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్, టూరిజం శాఖలను లూటీ చేస్తున్నారన్న సిద్దూ ఆ మేరకు గణాంకాలను మీడియాకు వివరించారు. పదేళ్ల కిందట బాదల్ కుటుంబానికి 50 బస్సులు ఉండగా, నేడు వాటి సంఖ్య 650కి పెరిగిందని, అదే సమయంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని తెలిపారు. ప్రభుత్వ హోటళ్లు, హైవేలకు సమీపంలోని ప్రభుత్వ స్థలాలను సీఎం బాదల్.. తక్కువ ధరకే తన కుటుంబసభ్యులకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్పటికే లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటిచేసిన బాదల్‌కు పంజాబ్‌లో అందరికంటే ధనవంతులుగా ఎదగాలన్న లక్ష్యం తప్ప మరో ఆలోచన లేదని విమర్శించారు.
పంజాబ్ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ ఎజెండాతో ముందుకు వెళుతున్నదన్న సిద్దూ.. విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక తనకు లేదని.. బేషరతుగానే కాంగ్రెస్ పార్టీలోకి చేరానని విలేకరులు అడిగిన ప్రశ్నకు సిద్దూ బదులిచ్చారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 4న పోలింగ్ జరగనుంది.