ఆకు కూరల సాగుతో ఎంతో మంది రైతులు తక్కువ కాలంలో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే దీనికి పెట్టుబడి, శ్రమ కూడా చాలా తక్కువ. విత్తిన నెల రోజుల్లో రైతన్న చేతికి డబ్బు అందించే పంటల్లో ప్రధానమైనవి ఆకు కూరలేనంటే అతిశయోక్తి కాదు. అతి తక్కువ నీటితో ఈ తోటలను సాగు చేయవచ్చు.
కొద్ది విస్తీర్ణంలో పంట వేసుకుంటే వాటరింగ్ కేన్ల (నీటిని తుంపరగా పోసే డబ్బాలు)తో కూడా నీటిని అందించొచ్చు. తోట కూరల్లో ఏడెనిమిది రకాలు ఉన్నాయి. వీటిలో ఆర్‌ఎన్, ఏ-1, కో-1, పూసా చోటీ చౌలై, పూసాబడి చౌలై, పూసా కీర్తి, పూసా కిరణ్, పూసాలాల్, ఔలై, అర్కసుగుణ, అర్కఅరుణ (ఎర్ర తోటకూర) రకాలు ఎంపిక చేసుకోవచ్చు. నాటిన 25 రోజులకే కోసి విక్రయించే వీలున్న సిరికూర రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు.
సస్యరక్షణ చర్యలు...
తోట కూరకు తెల్ల మచ్చ తెగులు, ఆకులను తినే గొంగళి పురుగుల బెడద ఉంటుంది.
తెల్ల మచ్చ తెగులు ఆశిస్తే ఆకుల అడుగు భాగాన తెల్లని బుడిపెలు ఏర్పడుతాయి.
పైభాగంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పండుబారి ఆకులు ఎండిపోతాయి.
తెల్ల మచ్చల నివారణకు గాను లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా క్లోరోథలోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి.
గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మలాథీన్ కలిపి స్ప్రే చేయాలి.
ఆకు కూరలకు సాధ్యమైనంత వరకు వేప సంబంధ మందులతోనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
తప్పని పరిస్థితుల్లో మాత్రమే తక్కువ విషపూరితమైన మందులను వినియోగించాలి.
ముందు చల్లే ముందు ఆకులను కోసుకోవాలి.
పురుగు మందు పిచికారీ చేసిన నాలుగైదు రోజుల వరకు కూర కోయకూడదు.
విత్తే విధానం...
తోటకూర సాగుకు ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం.
నీరు నిలిచే బంకమట్టి ఇసుక నేలలు పనికి రావు.
విత్తనాలు అలికే ముందు నేలను 4-5 సార్లు బాగా దున్నాలి.
ఆఖరి దుక్కిలో ఎకరానికి 6 టన్నుల పశువుల ఎరువు వేసి దున్నుకోవాలి.
అనంతరం చదను మళ్లు చేసుకోవాలి.
సన్నటి ఇసుకతో విత్తనాలు కలిపి మళ్లలో వెదజల్లాలి.
నారు పెంచి మొక్కల్ని కూడా నాటుకోవచ్చు.
విత్తనం చల్లే విధానంలో ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం.
నారు నాటే పద్ధతిలో అయితే కిలో విత్తనం సరిపోతుంది.
కలుపు నివారణ కోసం విత్తనం చల్లిన ఒకటి రెండు రోజుల తర్వాత వ్యవసాయ అధికారుల సూచన మేరకు గడ్డి మందుల పిచికారీ చేయాలి.
ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు ఎకరాకు 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌నిచ్చె ఎరువులను వేసి కలియదున్నాలి.
కత్తిరింపుల ద్వార ఆకు కోసుకొనే రకాలకు 30 కిలోల నత్రజని మూడు భాగాలు చేసి కత్తిరింపు తరువాత ఒక భాగం వేసి నీరు పెట్టాలి.
కట్టం తక్కువ.. లాభాలెక్కువ!
Published Wed, Nov 12 2014 12:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement