annamayya district Latest News
-
గుర్తు తెలియని వ్యక్తి మృతి
మదనపల్లె : మదనపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి సచివాలయం రోడ్డు పక్కన ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి అతిగా మద్యం తాగి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు ముదురు నీలపుచుక్కల చొక్కా ధరించారు. ఆయన వయస్సు సుమారు 40–45 మధ్య ఉంది. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జీఎంఆర్ పాలిటెక్నిక్‌లో జాబ్‌మేళా మదనపల్లె సిటీ : స్థానిక జీఎంఆర్ పాలిటెక్నిక్‌లో బుధవారం స్కిల్ డెవలప్మెంట్, సిడాప్, జిల్లా ఉపాధి కల్పనాశాఖ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించాయి. నాలుగు కంపెనీ ప్రతినిధులు హాజరై 11 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు ప్లేస్మెంట్ ఆఫీసర్ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఓబులేసు, సిబ్బంది పాల్గొన్నారు. దొంగ అరెస్టు ఓబులవారిపల్లె : మంగంపేట జాతీయ రహదారిపై ఇనుప వస్తువులను చోరీ చేసిన గొల్ల జగదీష్ బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ పి.మహేష్ తెలిపారు. మంగంపేట జాతీయ రహదారిపై చెన్నకేశవస్వామి ఆలయం సమీపంలో పల్వ రైజింగ్ మిల్లులో ఉపయోగించే రోలర్ బుష్ రాడ్లను సంచిలో తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. వాటి విలువ రూ.44వేలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
కురబలకోట : విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందిన విచారకర సంఘటన బుధవారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కనసానివారిపల్లెకు చెందిన రైతు గాండ్లపెంట రెడ్డెప్పరెడ్డి (45) బుధవారం కమతంపల్లెకు చెందిన ఓ రైతు పొలం దున్నడానికి మల్లేలగడ్డ వద్దకు ట్రాక్టర్ తీసుకెళ్లాడు. అక్కడ పొలం దున్నుతుండగా ట్రాక్టర్ మడక తగిలిచిన్నపాటి విద్యుత్తు స్తంభం పడిపోయింది. విద్యుత్తు ఉందని గమనించకుండా కింద పడిన తీగ పైకి లాగి కట్టాలని చెట్టెక్కాడు. లాగే క్రమంలో పైన విద్యుత్ లైన్‌కు తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడికి భార్య శకుంతల, కమారులు హితేష్‌రెడ్డి, రుత్విక్ రెడ్డి ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం రోధించిన తీరు అందరినీ కలచివేసింది. ఎస్ఐ దిలీప్‌కుమార్, ట్రాన్స్‌కో డీఈ గంగాధర్, ఏడి సురేంద్ర నాయక్, ఏఈ శంకర్రెడి్డ్ సంఘటనా స్థలం పరిశీలించారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబం -
అధికారుల నిర్లక్ష్యంతోనే ఇసుక గొడవ
ప్రొద్దుటూరు : అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామం వద్ద టీడీపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులకు దారి తీసిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గురివిరెడ్డి ఇసుక దందాకు అడ్డే లేకుండా పోయింది. పెన్నా నది ఒడ్డునే గ్రామం ఉండడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఈయన అక్రమ రవాణా దందా కొనసాగిస్తున్నారు. ప్రొద్దుటూరుకు ఇసుకను తరలించి అమ్మడం రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినా గ్రామానికి అలా వెళ్లి ఇలా మొక్కుబడిగా తిరిగి రావడం పరిపాటిగా మారింది. ఇది ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయుడు గురివిరెడ్డి పెన్నానదిలో చెక్ పోస్టు తరహాలో గేట్ ఏర్పాటు చేశాడు. బండికి, ట్రాక్టర్‌కు ఇసుక తీసుకెళ్లాలంటే ధర నిర్ణయించి.. ఆ మొత్తం చెల్లిస్తేనే బండి లేదా ట్రాక్టర్‌ను పెన్నానదిలోకి అనుమతిస్తానని ఖరాఖండిగా చెబుతున్నారు. బుధవారం గ్రామంలోని టీడీపీ వర్గీయులే పరస్పర వాగ్వాదానికి దిగడంతో విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. గతంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దారు గంగిరెడ్డి భాస్కర్‌రెడ్డి జీపును అడ్డుకుని ‘నా జోలికి వస్తే నీ జీపు కాలుస్తా’ అని గురివిరెడ్డి హెచ్చరించిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. పోలీసులు, అధికారుల్లోనూ.. ఆయన ఆగడాలను అడ్డుకునేవారే లేకుండాపోయారు. -
డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జిల్లాల అండర్–14 క్రికెట్ పోటీల్లో తొలి దశ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో బుధవారం బ్యాటింగ్‌కు దిగిన విజయనగరం జట్టు 70.5 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని బాబా 42, జస్టిన్ 29 పరుగులు చేశారు. శ్రీకాకుళం బౌలర్లు సాత్విక్ 4, వివేక్‌నంద 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీకాకుళం జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. జట్టులోని కృష్ణ కౌశల్ 37, జోషిత్ 17 పరుగులు చేశారు. విజయనగరం బౌలర్ సాత్విక్ 2 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీకాకుళం జట్టు 336 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీకాకుళం జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కృష్ణా జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం.. కేఎస్ఆర్ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో 80 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన కృష్ణా జట్టు 80.2 ఓవర్లలో 249 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని భానుచంద్ యాదవ్ 78 పరుగులు, భానుచైతన్య 36 పరుగులు చేశారు. గుంటూరు బౌలర్లు గోపీచంద్ 4, అబ్దుల్ 2, ఖాదర్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జట్టులోని కౌషిక్ 69, రామ్‌చరణ 60 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో గుంటూరు జట్టు 152 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణా జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. నెల్లూరుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కేఓఆర్ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో 108 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 54.5 ఓవర్లలో 190 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని ఆదినారాయణరెడ్డి 83 పరుగులు, రోహిత్ రాయల్ 20 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్లు లీలావికాస్ 3, సాకేత్ 5, సుశాంత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 52.4 ఓవర్లలో 175 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని కిన్ను కిషాల్ 67, సాయియశ్వంత్ 53 పరుగులు చేశారు. అనంత బౌలర్లు కిరణ్‌కుమార్ 4, లిఖిత్ 3, దేవస్కందారెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంత జట్టు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. -
గంజాయి స్వాధీనం – ఒకరి అరెస్టు
ఓబులవారిపల్లె : గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు రైల్వేకోడూరు సీఐ వేంకటేశ్వర్లు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. పక్కా సమాచారంతో మండలంలోని ఎల్లాయపల్లె ఎంపీడీఓ మల్రెడ్డి, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఎస్ఐ మహేష్ ఎల్లాయపల్లె క్రాస్ రోడ్డు వద్ద బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఎల్లాయపల్లె దళితవాడ సమీపంలోని మిరపతోటలో నరసయ్య గంజాయి పెంచి సంచిలో దాచి ఉంచారు. అతడిని అరెస్టు చేసి రూ.15 వేల విలువగల 750 గ్రాములు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాలలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్, ఉపేంద్ర, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు. -
అటవీ పరిధిలో స్మగ్లర్ల అరెస్టు
కడప అర్బన్ : బద్వేల్ అటవీ ప్రాంతం పరిధిలో ఏడుగురు స్మగ్లర్లను అటవీ అధికారులు అరెస్టు చేశారు. కడప డీఫ్ఓ కార్యాలయంలో విలేకరులకు డీఎఫ్ఓ వినీత్‌కుమార్ వివరాలు వెల్లడించారు. బద్వేల్ అటవీ రేంజ్‌లోని బ్రాహ్మణపల్లి సెక్షన్, బోయినపల్లి బీట్ పరిధిలో వన్యప్రాణి పెంగోలిన్(అలుగు)ను తరలిస్తున్న సమాచారం అందిందని తెలిపారు. దాడులు చేసి గోపవరం మండలానికి చెందిన రామిరెడ్డి, పాలెంకు చెందిన రాగి శ్రీను, బద్వేల్ మండలం లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన పాలగిరి పెంచలయ్య, నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామానికి చెందిన లెక్కల శివారెడ్డి, మర్రిపాడుకు చెందిన వెంకటాద్రి, వింజమూరుకు చెందిన ఓంకారం బాబులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి అలుగు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం దుంగలు పట్టివేత బ్రాహ్మణపల్లి బీట్ పరిధిలో ఎర్రచందనం రవాణా చేస్తున్న కాశినాయన మండలం నారాయణపల్లె గ్రామానికి చెందిన రాంబాబు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామానికి చెందిన తురక సుబ్బరాయుడులను అరెస్టు చేసి వారి నుంచి 109 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి అరెస్ట్ చేయడంలో కృషిచేసిన అధికారులు బి.స్వామి వివేకానంద, కె.వెంకటశేషయ్య, ఎస్ఎస్.ఖాజావలి, ఎం.పుష్పరాజ్, సి.విజయలక్ష్మి, ఎం.సువర్ణకుమార్, పి.రాజేష్‌రెడ్డి, ఎల్.లక్ష్మీనరసమ్మ, ఎస్డీ. మునాఫ్, ఎస్.అక్బర్షరీఫ్, సిబ్బందిని డీఎఫ్ఓ వినీత్‌కుమార్ అభినందించారు. స్వాధీనం చేసుకున్న పెంగోలిన్(అలుగు)కు వెటర్నరీ డాక్టర్ చే పరీక్షలు చేయించి, అటవీ ప్రదేశంలోనే సురక్షితంగా వదిలివేస్తామని డీఎఫ్ఓ తెలిపారు. -
వ్యక్తిపై పురపాలక సిబ్బంది దాడి
విలువైన వస్తువులు ధ్వంసంమదనపల్లె : పట్టణంలోని ఓ వ్యక్తి ఇంటిపై పురపాలక సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఇంట్లో విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుడి వివరాల మేరకు.. పట్టణంలోని ఇందిరా నగర్‌కు చెందిన ముబారక్ మున్సిపల్ వర్కర్ యూనియన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదే పట్టణానికి చెరందిన పాల్ బాలాజీతో ముబారక్‌కు ఆర్థిక లావాదేవీలున్నాయి. ఇటీవల పాల్ బాలాజీ తన ఇంటిని నెహ్రూ బజార్‌లోని అలంకార్ వస్త్ర దుకాణం యజమాని శ్రీనివాస్‌కు విక్రయించాడు. మంగళవారం అకస్మాత్తుగా ముబారక్ అక్కడికి వచ్చి ఇంటిని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. స్థానికులు యజమాని శ్రీనివాస్‌కు తెలుపగా.. ఎందుకు ఇంటిని ధ్వంసం చేస్తున్నావని ప్రశ్నించాడు. పాల్ బాలాజీ తనకు డబ్బులివ్వాల్సి ఉందని, ఈ ఇల్లు అతడిదే కాబట్టి ధ్వంసం చేస్తున్నానని ముబారక్ చెప్పారు. ఆ ఇల్లు తనదంటూ శ్రీనివాస్ చెప్పినా వినకుండా ఇంట్లో గ్రానైట్, ఇంటి ఎదుట అమర్చిన అద్దాలు, నీటి పైపులు ధ్వంసం చేశాడు. ఈ దౌర్జన్యాన్ని శ్రీనివాస్ వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తే.. నన్ను ఎవరూ ఏమీ చేసుకోలేరంటూ దౌర్జన్యం చేశాడు. దీంతో శ్రీనివాస్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ముబారక్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో తనకు రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చాంద్‌బాషా తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే షాజహాన్‌బాషా జోక్యం చేసుకుని, పోలీసులతో మాట్లాడి రాజీప్రయత్నాలు చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. -
●మంచి రోజులు వస్తాయి...
కూటమి సర్కార్ నిర్లక్ష్యం, అధికారపార్టీ నేతల ఆగడాలపై వివరిస్తూ వచ్చిన కేడర్‌కు మంచి రోజులు వస్తాయి, ఓపిక పట్టాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. దౌర్జన్యాలకు జడిసే పరిస్థితి లేదని, వ్యవస్థ తన పని తాను చేసుకెళ్లాలని సూచించారు. ఎప్పుడూ కాలం ఓకేలా ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. పక్షం రోజుల క్రితం పెద్దదండ్లూరు గ్రామ వైఎస్సార్సీపీ నేత హనుమంతరెడ్డిపై దాడి జరిగిందని, మళ్లీ బుధవారం హత్యాయత్నం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని పలువురు మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ ప్రమేయంతో హత్యాయత్నానికి గురైన హనుమంతరెడ్డికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు తోడ్పాటునందించాలని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిని ఫోన్లో ఆదేశించారు. అలాగే ఆరుగాలం శ్రమించినా పంటలు గిట్టుబాటు కాలేదని పలువురు రైతులు వివరించడంతో మనోస్థైర్యం కోల్పోవద్దు, మంచిరోజులు రానున్నాయని భరోసా కల్పించారు. -
గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం
మదనపల్లె : పట్టణంలోని మోతీ నగర్లో బుధవారం సాయంత్రం గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. స్థానికుల వివరాల మేరకు.. మోతీనగర్‌లో నివాసమున్న సురేష్ ఇంటిలో గ్యాస్ లీకేజీ కావడంతో అగ్నిప్రమాదం జరిగింది. మంటలతోపాటు ఇళ్లంతా పొగలు నిండిపోవడంతో యజమాని అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. ఫైర్ ఆఫీసర్ శివప్ప చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంటిలో పొగను పీల్చి తీవ్ర అస్వస్థతకు గురైన క్రిష్ణమ్మ(55)ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాదంలో రూ.5లక్షల నష్టం వాటిల్లగా, మరో రూ.8 లక్షల ఆస్తిని అగ్నిమాపక అధికారులు కాపాడినట్లు యజమాని సురేష్ తెలిపారు. అనంతరం స్థానికులకు గ్యాస్ వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సారా ఊట ధ్వంసం మదనపల్లె : మండలంలోని నారమాకులతండా గ్రామంలో బుధవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తయారీకి సిద్ధంగా ఉంచిన వేయి లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు. అనంతరం ఎస్ఐ చంద్రమోహన్, గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సారా తయారీ, విక్రయించడం, రవాణా చేయడం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పిచ్చిగుంట్లపల్లెలో ఘర్షణ వీరబల్లి : చెత్త దిబ్బ విషయంలో ఇరు వర్గాల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. మండలంలోని తాడిగుంటపల్లి పంచాయతీ పిచ్చిగుంటపల్లిలో తాటిగుంటపల్లి మాజీ సర్పంచి రామచంద్రారెడ్డి వెళ్తుండగా అదేగ్రామానికి చెందిన ముద్రగడ ఈశ్వరమ్మ, పార్వతి చెత్త దిబ్బ విషయమై తమ గోడు విన్నవించారు. దీంతో అదే గ్రామానికి చెందిన రామచంద్ర కుమారులు సంజీవ, నాగేంద్ర, రెడ్డమ్మ, బయ్యమ్మ అనే నలుగురు రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఈశ్వరమ్మ, పార్వతిలకు గాయాలయ్యాయి. వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అయ్యప్పల బండి.. ఆగడం లేదండి !
జయంతి రైలుకు రైల్వే శాఖ ఇచ్చిన హాల్టింగ్ అయ్యప్ప భక్తులు ఆశలను నీరుగార్చేలా చేసిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఉభయ జిల్లాలో ఉంటున్న కేరళ రాష్ట్రానికి చెందినవారు, జిల్లా నుంచి సేలం, కేరళ ప్రాంతాలకు వెళ్లే వ్యాపారులకు ఇదొక్క రైలే దిక్కు. పలు స్టేషన్లలో ఇది ఆగక పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి. రేణిగుంట, ఇటు కడప, రైల్వే కోడూరు, ఎర్రగుంట్లకు వెళ్లే అయ్యప్ప భక్తులు రైలు ఎక్కాల్సి వస్తోంది. నవంబరు 2 నుంచి రాజంపేట హాల్టింగ్ ఎత్తివేత రాజంపేట : ఉభయ వైఎస్సార్ జిల్లాల నుంచి శబరిమలైకు లక్షకు మందికిపైగా అయ్యప్ప స్వామి భక్తులు వెళుతున్నారు. ఎక్కువమంది సామాన్య, మధ్య తరగతికి చెందిన అయ్యప్ప భక్తులు రైలు ద్వారా శబరిమలైకు వెళుతుంటారు. అయ్యప్పల రైలు బండిగా జయంతి రైలుకు పేరుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి వెళ్లే అయ్యప్ప భక్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడేంది. అయితే ఇటీవల రైల్వే అధికారులు ఉభయ జిల్లాల పరిధిలోని ఎర్రగుంట్ల, కడప, కోడూరులోనూ హాల్టింగ్ ఇచ్చారు. నవంబరు 2వ తేదీ నుంచి పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం రాజంపేటలో జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఆగడం లేదని బుధవారం దక్షిణ మధ్య రైల్వే నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు, కొండాపురం, నందలూరు, రాజంపేట, కమలాపురం స్టేషన్లలోనూ ఆగని పరిస్థితి. దీంతో ఇతర రప్రాంతాల స్టేషన్లకు వెళ్లి ప్రయాణికులు రైలు ఎక్కాల్సి వస్తోంది. అయ్యప్పల సీజన్లోనే హాల్టింగ్ ఎత్తివేయడంతో అయ్యప్పస్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము రైల్వేకోడూరు, రేణిగుంట, కడపకు వెళ్లి ఎక్కాలంటే ఇబ్బందిపడాల్సి వస్తుందంటున్నారు. -
శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
పీలేరు రూరల్: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు డీఎం కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ భక్తుల కోరిక మేరకు కావల్సిన రూట్లలో, కావల్సిన రోజులు అద్దెకు బస్సులు పంపుతామని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఎలాంటి ఆర్టీఓ పన్నులు లేవని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోం చేసుకోవాలని కోరారు. కేజీబీవీ ఉద్యోగాల మెరిట్ లిస్ట్ విడుదల రాయచోటి (జగదాంబసెంటర్): కేజీబీవీ పాఠశాలల్లో టీచింగ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ కోఆర్డినేటర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫై చేయబడిన సర్టిఫికెట్ల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితా 1:3 విధానంలో సిద్ధం చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల జాబితాను వెబ్సైట్ https:// deoannamayya.blogspot.com/ లో పొందుపరిచామని తెలిపారు. అభ్యంతరాలు ఉంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో తెలపాలన్నారు. అనంతరం ఈ లిస్టును ఫైనల్ లిస్టుగా ప్రకటించి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కార్యాలయంలో ప్రజా దర్బార్ రాయచోటి టౌన్: పట్టణంలో మంత్రి మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి తన కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో నెలలుగా పరిష్కారానికి నోచుకొని సమస్యలను వెంటనే పరిష్కారం చేసేందుకు ప్రజాదర్బార్ ఉపయోగపడుతుందని చెప్పారు. తాగునీరు, రోడ్లు వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. -
ఘనంగా ఉరుసు ఉత్సవం
కలకడ : మండలంలోని కలకడ ఇందిరమ్మ కాలనీలోని మాసుంవలియా షహీద్ స్వాముల దర్గా వద్ద ఉరుసు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. దర్గా పెద్ద అన్వర్ బాషా ఆధ్వర్యంలో కలిచెర్లకు చెందిన యూసఫ్ హుసైనీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉమర్ దరాజ్, కర్ణాటకు చెందిన తహసీన్ తాజ్ ఖవ్వాలీ పాటలతో అలరించారు. వివిధ మండలాల నుంచి ముస్లింలు హాజరై వీక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నదానం చేశారు. మల్లయ్యకొండకు రూ.5.94 లక్షల ఆదాయం తంబళ్లపల్లె : మల్లయ్యకొండపై వెలసిన భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో హుండీలను బుధవారం లెక్కించారు. రూ.5,94,257 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ శశికుమార్, ఈఓ మునిరాజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరప్ప, మల్లికార్జున, శంకర, కొండకిట్ట పాల్గొన్నారు. సారా ఊట ధ్వంసం పీలేరు : వాల్మీకిపురం మండలం ఎగువమేకలవారిపల్లెలో తయారీకి సిద్ధంగా ఉంచిన 2300 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసినట్లు సీఐ ప్రసాద్‌బాబు తెలిపారు. అనంతరం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఏఆర్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు రూటా ప్రాంతీయ సదస్సు
మదనపల్లె సిటీ: రాష్ట్ర ఉర్దూ టీచర్ల సంఘం (రూటా) ప్రాంతీయ సదస్సును గురువారం స్థానిక ఉర్దూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఏ.షాజహాన్, జిల్లా ప్రతినిధులు సిబాతుర్ రహ్మాన్, ఇస్మాయిల్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశ అనంతరం సంఘం ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లాలోని ఉర్దూ ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరారు. నవోదయ ప్రవేశాలకు గడువు పొడిగింపురాయచోటి (జగదాంబసెంటర్): నవోదయ ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు మదనపల్లె మండలం వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ టి.వేలాయుధన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ –2025కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 9వ తేదీ వరకు గడువు పొడిగించారని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చదువుతూ 9వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతూ ఉండాలన్నారు. వివరాలకు 8919956395, 7013201138 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి గుర్రంకొండ: దేవాలయాల వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథం రాజు అన్నారు. బుధవారం ఆయన గుర్రంకొండలో పర్యటించారు. ఈసందర్భంగా రెండు రోజుల క్రితం చోరీ జరిగిన శ్రీ వోనీ ఆంజినేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ, శ్రీసిద్ధేశ్వరస్వామి ఆలయాలను కూడా సందర్శించారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతూ గుర్రంకొండలో వరుసగా దేవాలయాల్లో చోరీలు జరుగుతుండడం బాధకరమన్నారు. చోరీలు జరిగిన ఆలయాలకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేయించామన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేదిలేదన్నారు. ఆయన వెంట ఈఓ బాలకృష్ణ, అర్చకులు కిరణ్‌కుమార్‌శర్మ, మండల బీజేపీ అధ్యక్షుడు రామాంజులు ఉన్నారు. -
దివ్యకాంతుల దీపావళి
మదనపల్లె సిటీ: జిల్లాలో దీపావళి సందడి నెలకొంది. కొత్త దుస్తులు, టపాకాయలు, లక్ష్మిపూజకు కావాల్సిన సరంజామ కొనుగోలు చేసే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. ఏటా ఆశ్వయుజమానం అమావాస్య నాడు దీపావళి పండుగ చేసుకోవడం అనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏట దీపావళి గురువారం మధ్యాహ్నం 2.47కు ప్రారంభమై శుక్రవారం సాయంత్రం 4.50 వరకు ఉంటుంది. 31వతేదీ సాయంత్రం దీపావళి ధనలక్ష్మి పూజ చేయుటకు శుభప్రదంగా ఉంటుంది. పూజ, వస్త్ర దుకాణాలు కిటకిట: జిల్లా వ్యాప్తంగా పండుగ శోభ నిండింది. ఈ నేపథ్యంలో మదనపల్లె, రాయచోటి, రాజంపూట, పీలేరు, వాల్మీకిపురం, రైల్వేకోడూరులతో పాటు పలు మండల కేంద్రాలోల దుకాణాలోల జనం కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకంగా పండుగ కోసం పూజా సామగ్రి కొనుగోలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక వస్త్ర దుకాణాలోల సందడి నెలకొంది. జోరుగా బాణసంచా విక్రయాలు ఈసారి దీపావళి పండుగ వేళ బాణసంచా దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో జనం టపాసులు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పూల ధరలకు రెక్కలు: దీపావళి పండుగను పురస్కరించుకుని పూలమార్కెట్లు కిటకిటలాడాయి. మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండు, మున్సిపల్ కార్యాలయం, చిత్తూరు బస్టాండు, శ్రీకృష్ణదేవరాయ సర్కిల్, నీరుగట్టువారిపల్లె ప్రాంతాల్లో అరటి, మామిడి ఆకుల అమ్మకాలు ఊపందుకున్నారు. పూల మార్కెట్లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది. పూలు ధరలకు రెక్కలొచ్చాయి. మల్లెపూలు కిలో రూ.800 పలికాయి. దీంతో పాటు బంతి,చామంతి,రోజా పూలు ధరలు రెట్టింతలయ్యాయి. దుకాణాల్లో పూజల కోసం బూడిదగుమ్మడికాయల అమ్మకాలు ఊపందుకున్నాయి. మట్టి దీపాలు, ప్రమిదలతో పాటు క్యాండిల్స్ దీపాలు అమ్మకాలు జోరుగా సాగాయి. విజయానికి ప్రతీకచీకటిని తరిమి వెలుగులు తెచ్చే పండుగ దీపావళి. విజయానికి ప్రతీక. పల్లె నుంచి నగరాల వరకూ ఇంటింటా పిండివంటల ఘుమఘుమలు, నూతనవస్త్రాల రెపరెపలు, చెవులు చిల్లు పడేలా బాణసంచాల ధ్వనులు, ఆ బాలగోపాలం ఆనంద డోలికల్లో తేలియాడే పండుగే ఈ దీపావళి. జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగ శోభ సంతరించుకుంది. పూజ సామగ్రి, వస్త్ర దుకాణాలు కిటకిట పూల ధరలకు రెక్కలు జోరుగా బాణ సంచా విక్రయాలు దీపలక్ష్మీ నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం సర్వతమోవహం.దీపేన సాధ్యతే సర్వమ్ దీపలక్ష్మి నమోస్తుతే. సకల జ్ఞానానికి బ్రహ్మ అధిపతి. దీపం సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం.అది సకల తమో గుణాలనూ హరిస్తుంది. ఏ ఇంటిలో దీపాలు సమృద్దిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని వేదాలు చెబుతున్నాయి. దీపావళి రోజు సాయంసంధ్యాకాలంలో లక్ష్మి కోట ముందు మొదట దీపాలు వెలిగించి, మహాలక్ష్మిని అష్టోత్తరాలతో పూజించి నివేదిస్తే పుణ్యం లభిస్తుంది. –శివకుమార్‌శర్మ, వేదపండితులు, మదనపల్లె -
No Headline
అభిమాన నాయకుడితో మాట్లాడాలని కార్యకర్తలు... పంట నష్టాల గురించి చెప్పుకోవాలని రైతులు.. ఓ సారి కలిసి కష్టాలు పంచుకోవాలని ప్రజలు.. రాష్ట్ర నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చారు. వెరసి పులివెందులలోని భాకరాపేట క్యాంపు కార్యాలయం జనసంద్రమైంది. ఆయనా అంతే.. ప్రతి ఒక్కర్నీ ప్రేమగా పలకరించారు. ఆత్మీయ కరచాలనం చేశారు.. భుజంపై చేయి వేసి గుండె నిండా ధైర్యమిచ్చారు. కష్టాలు తాత్కాలికమేనని.. మళ్లీ మంచి రోజులొస్తాయని కొండంత భరోసా ఇచ్చారు. తన కోసం శ్రమకోర్చి వచ్చిన ప్రజలతో మాజీ సీఎం వైఎస్ జగన్ మమేకమైన తీరిది. ● నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ పలకరింపు ● కష్టాలు తాత్కాలికమేనంటూ రైతులకు భరోసా ● సమీప బంధువులతో ముచ్చట ● నూతన జంటలకు ఆశీర్వాదం ● పులివెందుల క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయం రోజంతా సందడిగా మారింది. తనను కలవడానికి వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు మాజీ నేతలతో పలువిషయాలు చర్చించారు. అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రతీ కార్యకర్తకు ఆయా నేతలు అండగా నిలవాలని ఆదేశించారు. బంధువులతో సమావేశం... వయోభారంతో ఉన్న పెద్దనాన్న వైఎస్ ప్రకాష్‌రెడ్డి ఇంటికి వెళ్లి మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఆరోగ్య సమస్యలు తెలుసుకొని తగు సూచనలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్ మనోహర రెడ్డి, వైఎస్ మధురెడ్డి తదితరులతోపాటు ఇతర బంధువుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మరో సమీప బంధువు శ్రీధర్‌రెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి, శ్రీనిజ జంటను ఆశీర్వదించారు. అలాగే దొండ్లవాగు వైఎస్సార్సీపీ నాయకుడు విద్యానందరెడ్డి సోదరి వివాహం కాగా, ఆయన ఇంటికి వెళ్లి నూతన జంట మాధురీ, నరేంద్రరెడ్డిలను ఆశీర్వదించారు. అక్కడే ఉన్న వారి బంధువర్గాన్ని పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎస్బీ అంజాద్ బాషా, డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సాయినాథశర్మ తదితరులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా నేతలకు తగు సూచనలు చేస్తూ పార్టీ ఉన్నతికి కృషి చేయాలని ఆదేశించారు. కష్టకాలంలో పార్టీకోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందని వివరించారు. -
రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి
మదనపల్లె: పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణాలు నాణ్యతతో, వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మదనపల్లె మండలంలోని వైఎస్సార్ కాలనీ, బాబూకాలనీలోని సీసీ రోడ్డు పనులను కలెక్టర్, ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్డు నిర్మాణం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎప్పటిలోగా పూర్తిచేయాలి? నిధుల కేటాయింపు, పనులనాణ్యత తదితర అంశాలపై అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే వినతిమేరకు పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నుంచి సీటీఎం రోడ్డు వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ఈవీఎం గోడౌన్‌పై నిరంతరం నిఘా ఉండాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రాయచోటి: ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ వద్ద 24–7 ప్రకారం నిరంతరం నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాయచోటి పట్టణం మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును బుధవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బీయూలు, సీయూలు, వివిధ ఫ్యాట్లను, అక్కడ భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులను అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె మధుసూదన్ రావు, ఆర్డీఓ ఏ శ్రీనివాసులు, తహసీల్దార్ పుల్లారెడ్డి, కలెక్టర్ సెక్షన్ సూపరిటెండెంట్ నరసింహకుమార్, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 19 కరువు మండలాలు అన్నమయ్య జిల్లాలో వర్షాభావ పర్థితులను పరిగణలోకి తీసుకొని 19 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించినట్లు కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, టి సుండుపల్లి, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లి, తంబళ్లపల్లి, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురబలకోట, పెద్దతిప్ప సముద్రం, బి కొత్తకోట, మదనపల్లి, నిమ్మనపల్లి మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శం
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి రాయచోటి అర్బన్: మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శమని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజనశాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక డైట్ సబాభవనంలో ఇటీవల సహారా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీపరీక్షల విజేతలకు బుధవారం ఆయన నగదు, ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గం, ప్రేమ, శాంతి సహనం, సత్యంతో జీవితం గడపాలంటూ ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యాభివృద్ధికి సంబంధించిన పోటీపరీక్షలు నిర్వహించడం వలన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను, నైపుణ్యాన్ని వెలికితీయవచ్చునన్నారు. సహారా వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఆప్తాబ్ మాట్లాడుతూ రాయచోటి ప్రాంతంలోని యువతకు ఉపాధి కోసం ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని మంత్రిని కోరారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఒక ఆడిటోరియం నిర్మింపచేసి సభలు, సమావేశాల ఏర్పాటుకు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ కన్వీనర్ మహమ్మద్అలీ, ఫౌండర్ జిలాన్, ఉపాధ్యక్షుడు మొగల్ ఇలియాస్ బేగ్, సభ్యులు ఆరీఫ్, మౌలానా, సుబాన్, ఫర్జాన్, నిజాంఖాన్,నాసర్, ఇమ్రాన్, రఫాయత్, మహబూబ్‌బాష, ఉపాధ్యా యుడు అస్పాదుల్లా తదితరులు పాల్గొన్నారు. -
సనాతన ధర్మం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
రాయచోటి అర్బన్ : సనాతన ధర్మం పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొన్ని పార్టీలు వివాదాలకు తెరతీస్తున్నాయని పలు సంఘాల నేతలు, వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి పట్టణంలోని దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్) కార్యాలయంలో సమాజానికి ఏది అవసరం? సనాతన ధర్మమా? లౌకికవాద రాజ్యాంగమా? అంశంపై మంగళవారం చర్చాగోష్టి జరిగింది. డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి మండెం సుధీర్ కుమార్ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ పేరిట వివాదాలను రేకెత్తించి, రాజకీయలబ్ధి పొందాలనుకునే నాయకులకు తగు రీతిలో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాజ్యాంగంలో సనాతన ధర్మం ప్రస్తావన లేదని, లౌకిక వాదంతో సమానత్వాన్ని మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు ఉద్భోదించారని పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ సనాతన ధర్మానికి వక్రబాష్యం చెబుతూ హిందూ మతాన్ని కొన్ని పార్టీల నాయకులు అప్రతిష్ఠ పాలు చేస్తున్నారని, అధికారాన్ని అనుభవించడానికి హిందూ ధర్మాన్ని వాడుకోవడం ఆక్షేపనీయం అన్నారు. ప్రజల్లో కుల, మత విభజనకు చేస్తున్న కుట్రలను ఐక్యంగా ప్రతిఘటించాలంటూ పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉపన్యసించడం దురదృష్టకరం అన్నారు. మణిపూర్ ఘర్షణల్లో మహిళను నగ్నంగా ఊరేగించిన రోజున పవన్‌కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు హరికుమార్, భారతీయ అంబేడ్కర్ సేన రాష్ట్ర కార్యదర్శి పల్లం తాతయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సాంబశివ, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపు క్రిష్ణప్ప, గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథనాయక్, పౌరహక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రవిశంకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్, కదిరయ్య, రామాంజనేయులు, రంగారెడ్డి, సుమిత్రమ్మ, కోటి, తదితరులు పాల్గొన్నారు. -
బాబాయిని కత్తితో పొడిచిన అబ్బాయి
పీలేరు : పిల్లల ఆలనా పాలనా చూసుకోవాల్సిన బాబాయి.. మద్యం తాగి రోజూ వేధిస్తుండడంతో ఆయన అన్న కుమారుడు కత్తితో పొడిచి చంపిన సంఘటన పోమవారం రాత్రి అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో చోటుచేసుకుంది. పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రవి, రమేష్ అన్నదమ్ములు. రవి, అతడి భార్య షర్మిల బెంగళూరులో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. రవి కుమారుడు (14) వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బాబాయ్ రమేష్(35)తో కలిసి ఇంటి వద్ద నివసిస్తున్నాడు. రమేష్ కూలి పనులకు వెళ్తూ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి వచ్చి మైనర్ బాలుడిని నిత్యం కొడుతూ వేధింపులకు గురిచేసేవాడు. సోమవారం రాత్రి మరోసారి గొడవకు దిగి వేధిస్తుండడంతో మైనర్ బాలుడు ఆగ్రహంతో ఇంట్లో కూరగాయలు తరిగే కత్తితో అతడిని పొడిచేశాడు. రమేష్ రక్తపు మడుగులో పడి ఉండటం స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. 108 అక్కడికి చేరుకునే సమయానికి రమేష్ మృతి చెందాడు. వాల్మీకిపురం సీఐ ప్రసాద్‌బాబు, ఎస్ఐ చంద్రశేఖర్ లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. -
ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
గుర్రంకొండ : గుర్రంకొండ సమీపంలోని శ్రీవోనీ ఆంజనేయస్వామి ఆలయంలో దుండగులు చొరబడి స్వామికి అలంకరించిన ప్రభవలను ధ్వంసం చేశారు. లక్ష రూపాయల విలువ చేసే వస్తువులను దోచుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి సమీపంలోని గుర్రంకొండ–సంగసముద్రం మార్గంలో పురాతన వోనీ ఆంజనేయస్వామి ఉంది. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి ఆలయం గేట్లు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామికి అలంకరించిన ప్రభవను రాడ్లతో ధ్వంసం చేశారు. గంట, హారతి, ఇతర పూజా సామగ్రి, వస్తువులు బయటికి తెచ్చి ధ్వంసం చేశారు. కార్యాలయ గది తాళాలు పగలగొట్టి.. అందులోని బీరువాలో ఉన్న రూ.20 వేల నగదు దోచుకెళ్లారు. ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. పక్కనే వ్యవసాయం చేసుకొంటున్న రైతులు ఆలయంలో అలికిడి విని కేకలు వేయగా దుండుగులు ఆ వస్తువులు పడేసి పరారయ్యారు. గత పది రోజుల్లోనే రెండు ఆంజనేయస్వామి ఆలయాలను దుండుగులు ధ్వంసం చేయడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ మధురామచంద్రుడు, సిబ్బంది చేరుకుని చోరీ జరిగిన ప్రాంతం, ధ్వంసమైన వస్తువులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇరు వర్గాల మధ్య భూ వివాదం
గాలివీడు : భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంఘటన మంగళవారం గాలివీడులో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని గేట్ నాలుగు రోడ్ల కూడలి వద్ద ఇటీవల రహదారి విస్తరణకు అక్రమ నిర్మాణాలు తొలగించారు. అనంతరం సర్వే నెంబర్–2266లో 1.50 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి అప్పగించింది. ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి విస్తరణ పనులు జరుగుతుండగా, స్థానికులు కొందరు ఆర్అండ్బీ స్థలం ఆక్రమించి రేకుల షెడ్లు ఏర్పాటుచేశారు. ఆ రేకుల షెడ్ల వెనుక భాగం తమ ఆనుభవంలో ఉందని కొందరు ముస్లింలు కొంత స్థలం చుట్టూ రేకులువేశారు. ఇదిలా ఉంటే అది తమ పట్టా భూమి అంటూ ఇంకో వర్గం వారు రేకులను తొలగించారు. అన్ని వర్గాల వారు మంగళవారం ఒక చోట చేరి వివాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నాయకుల అండతో తమ పట్టా భూమిలో షెడ్లు వేశారని భూ యజమాని, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దారు భాగ్యలత వివరణ కోరగా ఆర్అండ్బీ అధికారులతో కలిసి సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగిస్తామని, హద్దులు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఆర్అండ్బీ డీఈ వెంకటసుబ్బయ్య వివరణ ఇస్తూ ఆక్రమణలో ఉన్న రేకుల షెడ్లను స్వచ్ఛందంగా తొలగించాలని తెలిపారు. నాలుగురోడ్ల కూడలిలోని సర్వే నెంబర్ 2266లో ఆర్అండ్బీ స్థలంలో సర్వే చేశామని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ స్థలం ఆక్రమణకు గురైందో గుర్తించి స్వాధీనం చేసుకుంటామని, ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. -
మత్తుకు బానిసలు కావద్దు
రాయచోటి : ఉన్నత భవిష్యత్తు కల్గిన యువత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 20 కిలోల గంజాయితో పట్టుబడిన నిందితుడితో ఎస్పీ మంగళవారం వీడియో సమావేశం నిర్వహించారు. పీలేరులో ఐదు రోజుల క్రిందట ఇంటర్ చదివే ఇద్దరు యువకులు గంజాయి మత్తులో ఉండి రైలు క్రిందపడి ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని గంజాయి విక్రయదారులపై ప్రత్యేక పోలీసు బృందంతో దాడులు నిర్వహించామన్నారు. చనిపోయిన యువకులు వాడిన గంజాయి ఎక్కడెక్కడ లభించిందనే విషయంపై ఆరా తీశామన్నారు. కొందరు గ్యాంగ్‌గా ఏర్పడి స్థానికంగా గంజాయి అమ్ముతున్న వివరాల ఆధారంగా షేక్ మహబూబ్ బాషా(45)ను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించగా 20 కిలోల గంజాయి దొరికిందన్నారు. మహబూబ్ బాషా 20 మందికి పైగా పీలేరు టౌన్లో యువతకు గంజాయి అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇద్దరు విద్యార్థులు గంజాయిని పీల్చి చనిపోవడానికి అతడు కారణమయ్యారన్నారు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఎస్పీ వివరించారు. త్వరలో మిగిలిన వారిని అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, పీలేరు సిఐ యుగంధర్‌లు పాల్గొన్నారు.బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలుసంబేపల్లె : మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన బాలాజీ ద్విచక్ర వాహనంలో దేవపట్ల నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. వడ్డిపల్లె క్రాస్ సమీపంలోకి రాగానే రాయచోటి నుంచి ద్విచక్ర వాహనంలో జావెద్ వస్తున్నారు. ఇరువురూ చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై రెడ్డివారిపల్లె సమీపంలో పరస్పరం ఢీకొన్నారు. ప్రమాదంలో ఇరువురికీ గాయాలవడంతో 108 సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ
గుర్రంకొండ : రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో గుర్రంకొండ తెలుగు జెడ్పీహైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో రెండు రోజులుగా రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు జరిగాయి. అండర్–17 ఫెన్సింగ్ పోటీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టులో పాల్గొన్న కె.ప్రసన్నకుమార్ కాంస్య పతకం సాధించారు. అండర్–14 పోటీల్లో హరినాథ్, ముజాహిద్ కాంస్య పతకాలు సాధించారు. మంగళవారం జరిగిన అభినందన సభలో హెడ్మాస్టర్ అహ్మద్‌బాషా, పీడీ చింతిర్ల రమేష్, తదితరులు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. రవీంద్ర, హర్షవర్ధన్‌రెడ్డి, త్రినాథ్, రెడ్డిమోహన్, మదన్మోహన్, ఉషారాణి, ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిపై రాయితో దాడిమదనపల్లె : వ్యక్తిపై రాయితో దాడి చేసిన సంఘటన కురబలకోట మండలంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు...నందిరెడ్డిగారిపల్లె పంచాయతీ బండపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి (54) ఇంటి సమీపంలో ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించారు. రోడ్డు వేసేందుకు దారి స్థలాన్ని చదును చేస్తుండగా శ్రీనివాసులురెడ్డి అక్కడే ఉన్నాడు. చదువు చేసిన మట్టి పక్కనున్న సిద్దల చిన్నపరెడ్డి స్థలంలో పడటంతో, అప్పటికే రోడ్డు నిర్మాణంపై వ్యతిరేకతతో ఉన్న చిన్నపరెడ్డి ఆవేశానికి లోనై రాయితో శ్రీనివాసులురెడ్డిపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో శ్రీనివాసులురెడ్డి తలకు తీవ్రంగా గాయం కాగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. స్నేహితుడిని కలవడానికి వచ్చి మృత్యు ఒడిలోకి...!!కురబలకోట : మూర్ఛ వ్యాధి ఓ యువకుడి నిండు ప్రాణాన్ని తీసింది. అనంతపురం పట్టణానికి చెందిన హరి (21)మంగళవారం అంగళ్లులో ఆకస్మికంగా మృతి చెందినట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. అంగళ్లులో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న స్నేహితుడిని కలవడానికి మంగళవారం వచ్చాడు. అనంతరం అతను అంగళ్లులో బస్టాపు వద్ద నిలబడి ఉండగా మూర్చ (ఫిట్స్) వచ్చింది. ఒక్కసారిగా కుప్ప కూలాడు. హుటా హుటిన అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబీకులు శోకతప్తులయ్యారు. విద్యార్థులు చదువులో రాణించాలిరాయచోటి : పోలీసుల పిల్లలు, విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభిప్రాయపడ్డారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఎస్పీ ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందజేశారు. రాయచోటిలోని పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
హరిత దీపావళి.. ఆనందాల కేళి
రాజంపేట టౌన్ : దీపావళి వెలుగుల పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనం. చీకటిని పారద్రోలి, జ్ఞానాన్ని పంచి జీవితంపై ఆశలు కల్పించే కాంతుల సందడి. అయితే అనేక మంది దీపావళిన పండగను కాలుష్య కారకంగా మార్చేస్తున్నారు. చెవులు బద్ధలయ్యే శబ్దాలు, ఊపిరితిత్తులు భరించలేని పొగలను విడుదల చేసే బాణ సంచాలను కాల్చడంతో తమ ఇబ్బందులను తామే కొని తెచ్చుకుంటున్నారు. దీపావళి రోజున టపాసులకు దూరంగా ఉండి కొన్నింటిని పాటిస్తే పర్యావరణ హితంగా జరుపుకోవచ్చని పలువురు చెబుతున్నారు. బాణ సంచాలతో ఆరోగ్యానికి హానికరం రకరకాల రసాయనాల మిశ్రమాలతో తయారుచేస్తున్న బాణ సంచాలు అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి. కాపర్, కాడ్మియం, లెడ్, అమ్మోనియం, నైట్రోజన్ ఆకై ్సడ్, సల్ఫర్ డయాకై ్సడ్, సోడియం మిశ్రమాలు, మెర్క్యురీ, లిథియం, పొటాషియం లోహ మిశ్రమాలను బాణ సంచాల తయారీలో వినియోగిస్తారు. వీటిని కాల్చడంతో ఊపిరితిత్తులు, చర్మం, కళ్లకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. శబ్దాలు, ఘాటు వాసనలతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా జరుపుకొందాం దీపావళి రోజున తల్లిదండ్రులు తమ పిల్లలకు టపాసులకు బదులు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలి. టపాసులు కాల్చితే కలిగే నష్టాలను వివరించి అవకాశం ఉన్న చోట ఒక మొక్క నాటించి దానిని పెంచి పెద్దచేసేలా తల్లిదండ్రులు పిల్లలను సమాయత్తం చేయాలి. దీపావళికి రెండు, మూడు రోజుల ముందు నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులను బృందాలుగా ఏర్పాటు చేసి హరిత దీపావళిపై అవగాహన కల్పించి వారిలో చైతన్యం నింపాలి. అలాగే దీపావళికి ముందురోజు కొంత మంది విద్యార్థులను జట్టుగా చేసి వారిచే పాఠశాల ఆవరణలో మొక్క నాటించి వాటిని సంరక్షించే బాధ్యతను ఆ విద్యార్థులకే అప్పజెప్పాలి. ప్రతి ఏడాది దీనిని ఓ సంప్రదాయంగా చేపట్టేలా విద్యార్థుల్లో స్ఫూర్తిన నింపాలి. ఎట్టి పరిస్థితుల్లో టపాసులు కాల్చకూడదని, దీపాలు వెలిగించి, మొక్కలు నాటి దీపావళి జరుపుకొనేలా విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేసినప్పుడే హరిత దీపావళి సాధ్యం కాగలదని విద్యావంతులు చెబుతున్నారు. పండగ వేళ జరభద్రం..!మదనపల్లె సిటీ : కుటుంబంమంతా సందడిగా జరుపుకొనే పండగ వేళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మదనపల్లె ఫైర్ ఆఫీసర్ శివప్ప కోరారు. అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే 101 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. ప్రమాదాలు జరిగిన వెంటనే సమీప ఫైర్ స్టేషన్లకు సంబంధించిన కింది నెంబర్లకు ఫోన్ చేయవచ్చునన్నారు. మా వాటా మాకివ్వాల్సిందే! గాలివీడు: తమ వాటా ఇవ్వాల్సిందేనని అధికారులు ఒత్తిడిచేయడంతో టపాసుల దుకాణదారులు తలలు పట్టుకొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రెండు రకాల పన్నులు చెల్లించి దుకాణదారులు బాణ సంచా తీసుకువస్తున్నారు. దీనికి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పంచాయతీ శాఖ అధికారులు అనుమతులు తీసుకోవాలి. ఇందుకు లైసెన్స్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. వివిధ శాఖల అధికారులు ప్రతి దుకాణం నుంచి రూ.5 వేలు ఇవ్వాలని పట్టు పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇతర శాఖలతో మాకు సంభంధం లేదు.. మా సార్ చెప్పారు టపాసుల ప్యాకేజీ ఇవ్వాల్సిందేనంటూ చెప్పి దొరికినన్ని పట్టుకెళ్లడం పరిపాటిగా మారిపోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు చొరవచూపి బలవంతపు వసూళ్లను కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని దుకాణదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.పండగలన్నీ ప్రస్తుతం ట్రెండ్లీగా మారిపోయాయి. దీపావళి పండగ అంటేనే పర్యావరణానికి హాని చేసేదిగా మారిపోయింది. పెద్ద శబ్దాలతో క్రాకర్స్ కాల్చడం.. ఘాటైన రసాయన పదార్ధాలతో తయారు చేసిన టపాసులను కాల్చడంతో పర్యావరణానికి తీరని నష్టం కలగడమేగాక, శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యం పెరిగిపోతోంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రకృతి హితంగా దీపావళి జరుపుకొందాం.. మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. టపాసుల బదులు మొక్కను నాటుదామంటున్న విద్యావంతులు పాఠశాలల్లో అవగాహన కల్పించాలని కోరుతున్న తల్లిదండ్రులు