సాక్షి, అమరావతి: దేశసగటు కన్నా రాష్ట్రంలోనే వేతన పురుషులు, మహిళల శాతం ఎక్కువగా ఉంది. ఈ విషయం కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాలశాఖ నిర్వహించిన 2021–22 లేబర్ ఫోర్స్ సర్వేలో వెల్లడైంది. వేతన మహిళలు దేశంలో సగటున 16.5 శాతం ఉండగా, రాష్ట్రంలో 17.2 శాతం ఉన్నారు. వేతన పురుషులు దేశంలో సగటున 23.6 శాతం ఉండగా, రాష్ట్రంలో 27.6 శాతం ఉన్నారు.
రాష్ట్రంలో పట్టణాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా వేతనాలపై జీవిస్తున్నారు. పట్టణాల్లో 48.8శాతం వేతన పురుషులుండగా, 47.8శాతం వేతన మహిళలున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రంలో 15.7 శాతం వేతన పురుషులు ఉండగా, 9.7శాతం వేతన మహిళలున్నారు. కోవిడ్ ప్రభావం నేపథ్యంలో లేబర్ ఫోర్స్ సర్వేలో జాప్యం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేతన పురుషులు, మహిళలు, స్వయం ఉపాధిపై ఆధారపడినవారు, సాధారణ కూలీల శాతంపై సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో 44 శాతం పురుషులు, 42.4 శాతం మహిళలు స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో సాధారణ కూలీలుగా 40.4 శాతం మహిళలు, 28.4 శాతం పురుషులు ఉపాధి పొందుతున్నారు.
ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో వేతన మహిళలు అత్యధికం
ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో వేతన పురుషుల కన్నా వేతన మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఢిల్లీలో వేతన మహిళలు 83 శాతం కాగా వేతన పురుషులు 63.3 శాతమే. చండీగఢ్‌లో వేతన మహిళలు 67.7 శాతం కాగా వేతన పురుషులు 61.5 శాతం, కేరళలో వేతన మహిళలు 37.3 శాతం, వేతన పురుషులు 27.5 శాతం ఉన్నారు. బిహార్‌లో అత్యల్పంగా వేతన పురుషులు 9.9 శాతం ఉండగా వేతన మహిళలు 10.7 శాతం ఉన్నారు. వేతన మహిళల్లో జార్ఖండ్‌లో అత్యల్పంగా 6.3 శాతం, ఆ తరువాత మధ్యప్రదేశ్‌లో 7.7 శాతం, రాజస్థాన్‌లో 7.6 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 6.7 శాతం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment