సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో భూముల సర్వే జోరుగా జరుగుతున్న నేపథ్యంలో పట్టణాల్లో కూడా వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో 15 లక్షల ఎకరాలను సర్వే చేయాల్సి ఉందని సబ్ కమిటీ పేర్కొంది పట్టణ ప్రాంతాల్లో 5.5 లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి కాగా మిగిలిన 9.44 లక్షల ఎకరాలు పట్టణ ప్రాంతంగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి 38.19 లక్షల ఆస్తుల సర్వేను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించింది.
జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం అమలుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై సమీక్షించింది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలిదశలో 2 వేల గ్రామాల్లో మే 20వ తేదీలోగా సర్వే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ స్పష్టం చేసింది.
డ్రోన్ సర్వే, మ్యాపింగ్, గ్రౌండ్ ట్రూతింగ్, రికార్డుల వివాదాల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటివరకు సిద్ధమైన 1,94,571 భూహక్కు పత్రాలను ఈ కేవైసీ ద్వారా వివాదాలకు తావు లేకుండా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ యజమానుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.
10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి
ఈ నెలాఖరు నాటికి 10,409 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి కానుంది. 7,158 గ్రామాల్లో డ్రోన్ ఫొటోలు తీసుకుని 3,758 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 2,611 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, 2,391 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల పరిశీలన ముగిసిందని చెప్పారు. సర్వే ప్రక్రియలో జాప్యం లేకుండా ముందుగానే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నామని, 4 లక్షలకు పైగా రికార్డులకు మ్యుటేషన్ అవసరమని గుర్తించినట్లు వెల్లడించారు. జూన్ నాటికి రాష్ట్రంలో డ్రోన్ ఫ్లై ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు.
25.8 లక్షల సర్వే రాళ్లు
సర్వే పూర్తయిన గ్రామాల కోసం 25.8 లక్షల సర్వే రాళ్లు సిద్ధంగా ఉన్నట్లు మైనింగ్ అధికారులు తెలిపారు. 18.9 లక్షల సర్వే రాళ్లను ఇప్పటికే సరఫరా చేయగా మరో 12.3 లక్షల రాళ్లు ఆయా గ్రామాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రోజుకు 50 వేల సర్వే రాళ్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సర్వే ముగిసిన గ్రామాల్లో రాళ్లను పాతే ప్రక్రియ మే 20వ తేదీలోగా పూర్తవుతుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 30.11 లక్షల ఆస్తులను వెరిఫై చేశామని, అందులో 36.32 లక్షల నిర్మాణాలు ఉన్నట్లు పురపాలక శాఖ అధికారులు పేర్కొన్నారు.
సర్వే కోసం మాస్టర్ ట్రైనర్ల ద్వారా అన్ని జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. సమావేశంలో సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, సర్వే అండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్థజైన్, ఎంఏయూడీ కమిషనర్ కోటేశ్వరరావు, డీఎంజీ వి.జి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment