తొలి తెలుగు శాసనం లభించిన కల్లమలలోని చెన్నకేశవస్వామి ఆలయం (ఇన్‌సెట్లో శాసనం)
కడప కల్చరల్: ఇక కనిపించదనుకున్న తొలి తెలుగు శాసనం బండను పరిశోధకులు కనుగొన్నారు. కళ్లెదుటే కనిపిస్తున్నా బండపై అక్షరాల అస్పష్టత కారణంగా ఇప్పటివరకు దాన్ని గుర్తించలేకపోయారు. అయినా.. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించి తెలుగు వారి కలలను సాకారం చేశారు. తెలుగుభాష ప్రాచీనతను స్పష్టం చేసే ఆధారం లభించడంతో వైఎస్సార్ జిల్లా వాసులు సంబరాలు చేసుకుంటుండగా.. ప్రపంచంలోని తెలుగు భాషాభిమానులంతా ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు.
మూల శాసనం లభ్యమైంది
క్రీ.శ. 575లో వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కల్లమలలో రేనాటి పాలకుడైన ధనుంజయుడు వేయించిన తొలి తెలుగు శాసనం ఉన్నట్టు చరిత్ర పరిశోధకులు ఎప్పుడో స్పష్టం చేశారు. కానీ.. దాని నకలు (ఎస్టామ్ పేజ్) మాత్రమే లభ్యమైంది తప్ప దానికి మూలమైన శాసనం గల బండ మాత్రం కనిపించ లేదు. నకలు తీసిన సమయంలోనే ఆ రాతిని చెన్నైలోని పురావస్తు మ్యూజియానికి చేర్చారనే ప్రచారం సాగింది. తెలుగు భాషాభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావుల బృందాలు ఆ మ్యూజియానికి వెళ్లి శాసనం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శాసనం బండ దొరక్కపోవడంతో నకలుతోనే సరిపెట్టుకుంటూ వచ్చారు.
బయట పడిందిలా..
కొన్నేళ్ల క్రితం భారత పురావస్తు శాఖ ఎపీగ్రఫీ విభాగం డైరెక్టర్ చెవుకుల అనంత పద్మనాభశాస్త్రి తొలి తెలుగు శాసనాన్ని కల్లమలలో తాను 1975 ప్రాంతంలో చూశానని, దాన్ని ధ్రువీకరించుకుని జాగ్రత్త చేయాలని సూచించారు. నాటినుంచి పరిశోధకులు శోధన ప్రారంభించారు. శాస్త్రీయంగా ముందుకు సాగారు. శాసనాన్ని గుర్తించినా అప్పటికే ఆ బండపై గల అక్షరాలు కనిపించని స్థాయిలో ఉన్నాయి. భక్తులు, యోగులు ఆ బండ విలువ తెలియక దానిపై కూర్చోవడం, పచ్చడి నూరుకోవడంతో అక్షరాలు అరిగిపోయి అస్పష్టంగా మారాయి. దీంతో అది తొలి తెలుగు శాసనం కాదని అంతా కొట్టిపడేశారు.
ఆ బండ ఎప్పుడో చెన్నై మ్యూజియానికి చేరిందని గట్టిగా వాదించారు. వాస్తవానికి అంతవరకు తొలి తెలుగు శాసనంగా భావించిన ఎర్రగుడిపాడు శాసనాన్ని బ్రిటిషర్లు చెన్నై మ్యూజియానికి చేర్చారు. కానీ.. ఆ తర్వాత కల్లమల శాసనమే తొలి తెలుగు శాసనమేనని స్పష్టమైనా అది చెన్నైకి చేరిందన్న ప్రచారం మాత్రం ఆగలేదు. రెండిటికీ తొలి తెలుగు శాసనంగా గుర్తింపు ఉన్నా శాస్త్రీయ పరిశోధనల్లో ఆ తర్వాత కల్లమల శాసనమే మొదటిదని స్పష్టమైంది. కాగా, కల్లమలలోని తొలి తెలుగు శాసనం అక్కడి చెన్నకేశవస్వామి ఆలయంలోనే ఉందని శాసన పరిశోధకులు డాక్టర్ అవధానం ఉమామహేశ్వరశాస్త్రి ద్వారా తెలుసుకున్న తెలుగు వీరాభిమాని, రాష్ట్ర ఉపాధ్యాయ ఐక్యవేదిక అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి ఆ శాసనం బండకు రక్షణ కల్పించేలా మంటపం కట్టించాలని భావించారు.
పరిశోధకులు ఉమామహేశ్వరశాస్త్రి, శ్రీనివాసులురెడ్డి, ప్రొఫెసర్ సాంబశివారెడ్డి, మరికొందరు భాషాభిమానులు, పరిశోధకులతో కలిసి శనివారం కల్లమల వెళ్లి మరోసారి అక్షరాలను పోల్చుకుని అవి కాల ప్రభావంతో అస్పష్టంగా మారినా శాస్త్రీయంగా అదే తొలి తెలుగు శాసనమని మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయం మరునాటికి విస్తృతంగా ప్రచారమైంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిలో ఆనందం వెల్లివిరిసింది. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాహిత్యం, చరిత్రపరంగా ఉన్న ఎన్నో సందేహాలకు సమాధానం ఇవ్వనుంది.
ప్రబలమైన సాక్ష్యం లభించింది
ఎర్రగుడిపాడు శాసనం తొలి తెలుగు శాసనమని కొన్నాళ్లపాటు ప్రచారం జరగ్గా.. అది అప్పట్లోనే చెన్నై మ్యూజియానికి చేరింది. కొన్నేళ్ల తర్వాత కల్లమల శాసనమే తొలిదని స్పష్టమైంది. దీంతో చెన్నైకి చేరింది కల్లమల శాసనమని అందరూ పొరపాటుపడ్డారు. దశాబ్దకాలంగా నేను ఆ బండ కలమలలోనే ఉందని చెబుతూ వచ్చినా నమ్మేవారు కరువయ్యారు. ఇప్పుడు శాస్త్రీయంగా మరోమారు చెప్పడంతో విస్తృతంగా ప్రచారం జరిగి ఈ విషయంలో స్పష్టత వచ్చింది.
– అవధానం ఉమామహేశ్వరశాస్త్రి
సంతోషంగా ఉంది
తొలి తెలుగు శాసనం బండ కల్లమలలో లేదని తెలిసి భాషాభిమానిగా మొదట్లో ఎంతో బాధపడ్డాను. కానీ పరిశోధకులు ఉమామహేశ్వరశాస్త్రి ఆ బండ కల్లమలలోనే ఉందని మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్ర అధికారి వాడ్రేవు చినవీరభద్రుడు ఇటీవల కల్లమల శాసనాన్ని పరిశీలించి దాన్ని పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయాలని సూచించారు. దీంతో ఆ శాసన బండ గురించి స్పష్టత ఇవ్వాలని పరిశోధకులను కోరారు. స్థానిక భాషాభిమానుల సహకారంతో వారితో కలిసి కల్లమల వెళ్లి ఆ బండను గుర్తించడంతో సంతోషం కలిగింది.
– ఒంటేరు శ్రీనివాసులురెడ్డి
Comments
Please login to add a commentAdd a comment