గతంలో పురస్కారం పొందిన నందిగామ గ్రామ పంచాయతీ ఏరియల్ వ్యూ
సత్తెనపల్లి: ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ ఇదీ.. జాతిపిత మహాత్మాగాంధీ మాట. దీనిని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. గ్రామం పంచాయతీలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. దీనిలో భాగంగానే గ్రామ పాలనలో ఉత్తమంగా నిలిచిన పంచాయతీలకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏటా జాతీయ స్థాయిలో పురస్కారాలు అందజేస్తోంది. ఈసారి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 9 అంశాల్లో అక్టోబరు 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది.
9 అంశాలివే..
- పేదరిక నిర్మూలనకు మెరుగైన జీవనోపాధి
- ఆరోగ్యవంతమైన గ్రామం
- పిల్లల స్నేహపూర్వక పంచాయతీ
- తాగునీటి లభ్యత
- హరిత, స్వచ్ఛ గ్రామం
- స్వయం సమృద్ధి,
- మౌలిక సదుపాయాలు
- సామాజిక భద్రత, సుపరిపాలన
- మహిళా స్నేహపూర్వక పంచాయతీ
ప్రత్యేక పోర్టల్
ఈ అంశాల్లో చేపట్టిన అభివృద్ధి వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. దీనికోసం పంచాయతీవార్డ్.జీవోవీ.ఇన్ పోర్టల్ అందుబాటులో ఉంచారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల వారీగా పనులను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఒక్కో అంశానికి సంబంధించి ప్రతిబింబించే ఫొటోలు, వీడియోలు, కేస్ స్టడీస్‌తో దరఖాస్తు చేయాలి. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైతే వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున అవార్డును ప్రదానం చేస్తారు. అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో చూపించే ఆదర్శ పంచాయతీలకు ఇది సదవకాశం. పరిశుభ్రత, పచ్చదనం, తాగునీరు, ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో జిల్లాలోని చాలా గ్రామాలు ప్రగతిని చూపుతున్నాయి. పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో 366 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
మంచి అవకాశం
జాతీయ స్థాయిలో పురస్కారం అందుకునేందుకు ఇది మంచి అవకాశం. చేపట్టిన అభివృద్ధి తదితర వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఎంపికైతే పురస్కారం ద్వారా లభించే నజరానాతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
– జీవీ సత్యనారాయణ, ఎంపీడీవో, సత్తెనపల్లి
Comments
Please login to add a commentAdd a comment