సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు గణనీయ సంఖ్యలో సీట్లు కొల్లగొట్టారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా సక్సెస్ రేటును పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణ టాప్–5 రాష్ట్రాల్లో ఉండటం విశేషం. భర్తీ అయిన మొత్తం 16,635 సీట్లలో 18.5 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. సక్సెస్ రేటులో ముందు వరుసలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచాయి. కాగా మొదటి స్థానంలో రాజస్థాన్, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉండగా నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. భర్తీ అయిన మొత్తం సీట్లలో సగానికి పైగా ఈ ఐదు రాష్ట్రాల విద్యార్థులకే దక్కడం విశేషం.
అగ్రస్థానంలో రాజస్థాన్..
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఐటీల్లో సీట్లను కైవసం చేసుకున్న విద్యార్థుల్లో 15 శాతం సక్సెస్ రేట్‌తో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన 13,801 మందిలో 2,184 మంది ఐఐటీల్లో చేరారు. రాజస్థాన్ తర్వాత సక్సెస్ రేటులో మహారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి 16,341 మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరు కాగా 1,747 మంది (సక్సెస్ రేటు 10.69) ఐఐటీల్లో సీట్లు సాధించారు.
సక్సెస్ రేటులో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. ఏపీ నుంచి 14,364 మంది పరీక్షరాయగా 1,428 మంది ఐఐటీల్లో ప్రవేశం పొందారు. సక్సెస్ రేటు పరంగా నాలుగో స్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ నుంచి 22,807 మంది పరీక్ష రాయగా 2,131 మంది ఐఐటీల్లో చేరారు. ఐదో స్థానంలో నిలిచిన తెలంగాణ నుంచి 17,891 మంది హాజరు కాగా 1,644 మందికి (సక్సెస్ రేటు 9.18) సీట్లు లభించాయి.
ఐఐటీలన్నీ హౌస్‌ఫుల్..
కాగా ఈ ఏడాది ఐఐటీల్లో దాదాపు అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. కొన్ని కొత్త ఐఐటీలు మినహా ప్రముఖ ఐఐటీలన్నింటిలో సీట్లు పూర్తిగా నిండాయి. ప్రముఖ ఐఐటీల్లో అయితే మొత్తం సీట్ల కంటే అదనంగా సీట్లను కేటాయించడం విశేషం. తమ సంస్థల్లో చేరడానికి వచ్చే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైతే అదనంగా సీట్లు కేటాయించుకునేలా ఆయా ఐఐటీలకు స్వయంప్రతిపత్తి ఉంది. దీంతో పలు సంస్థలు అదనపు ప్రవేశాలు కల్పించాయి.
2022–23 విద్యాసంవత్సరానికి ఐఐటీల్లో 16,598 సీట్లు ఉన్నట్టు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్‌కు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో 1,567 సీట్లు మహిళల కోసం సూపర్ న్యూమరరీ కోటాలో కేటాయించారు. కాగా ఆరు విడతల కౌన్సెలింగ్ తర్వాత మొత్తం సీట్లు 16,598 మించి ప్రవేశాలు ఉండడం విశేషం. ఐఐటీ బాంబే విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మొత్తం 16,635 సీట్లు భర్తీ అయ్యాయి. మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా కింద కేటాయించిన సీట్లు 1,567తోపాటు ఇతర కేటగిరీల్లో ప్రతిభ ఆధారంగా మరో 1,743 సీట్లు దక్కాయి.
ప్రముఖ ఐఐటీల్లో అదనంగా సీట్ల కేటాయింపు..
విద్యార్థులు మొదటి ప్రాధాన్యం ఇచ్చే ఐఐటీ బాంబేలో 1,360 సీట్లుండగా ఆ సంస్థ 1,371 మందికి ప్రవేశాలు కల్పించింది. అలాగే ఐఐటీ ఢిల్లీలో మొత్తం సీట్లు 1,209 కాగా 1,215 మందిని చేర్చుకుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 1,869 సీట్లు ఉండగా 1,875 సీట్లు కేటాయించింది. వీటితోపాటు ఐఐటీ మద్రాస్, కాన్పూర్, హైదరాబాద్, రూర్కీ, తిరుపతి, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, ఇండోర్ వంటి చోట్ల కూడా మొత్తం సీట్లకు మించి భర్తీ చేశారు. అలాగే డ్యూయెల్ డిగ్రీలకు సంబంధించి 102 సీట్లు కూడా భర్తీ అయినట్టు ఐఐటీ బాంబే గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐఐటీ జోధ్‌పూర్, రోపార్, ధార్వాడ్, జమ్మూ, వారణాసి, ధన్‌బాద్‌ల్లో మాత్రమే స్వల్పంగా సీట్లు మిగిలాయి.
ఐఐటీ బాంబే వైపే టాపర్ల మొగ్గు..
కాగా ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ 1,000 ర్యాంకులు సాధించినవారిలో ఏకంగా 246 మంది ఐఐటీ బాంబేను ఎంచుకోవడం విశేషం. ఆ తర్వాత 210 మంది అభ్యర్థులతో ఐఐటీ ఢిల్లీ నిలిచింది.
ఐఐటీల ప్రవేశాల్లో తెలుగు విద్యార్థులు భేష్!
Published Fri, Nov 25 2022 4:55 AM | Last Updated on Fri, Nov 25 2022 2:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment