చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..? | Whats Behind Rise in Heart Attacks Among Young People | Sakshi
Sakshi News home page

చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?

Published Thu, Jun 9 2022 9:25 AM | Last Updated on Thu, Jun 9 2022 3:19 PM

Whats Behind Rise in Heart Attacks Among Young People - Sakshi

సంజామల మండలం ముచ్చలపురి గ్రామానికి చెందిన కాశీంబీ(55) గత నెల 24వ తేదీన పూడికతీత పనులు చేస్తూ గుండెపోటుకు గురై మరణించింది.  
ఓర్వకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్‌(46) గుండెపోటుకు గురై గత నెల 21వ తేదీన ప్రాణాలొదిలాడు. 
పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన అబ్దుల్‌ అనీఫ్‌(23) అనే యువకుడు గత నెల 22న హార్ట్‌స్ట్రోక్‌తో మృతి చెందాడు.  
ఇటీవలే కర్నూలు కొత్తబస్టాండ్‌ ప్రాంతంలో ఎరువుల వ్యాపారం చేస్తున్న 40 ఏళ్ల యువకుడు  గుండెపోటుకు గురై హఠాన్మరణం పొందారు.
 
వీరే కాదు ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒకచోట పట్టుమని 50 ఏళ్లు కూడా నిండని వారు అధికంగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఒకప్పుడు హృద్రోగ సమస్యలు 70 ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. ఇప్పుడు పాతికేళ్ల యువకులను సైతం ఈ సమస్య వేధిస్తోంది. ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, బేకరీల్లో లభించే తినుబండారాలు, వారంలో నాలుగైదుసార్లు చికెన్, మటన్‌ లాగించేయడం, ఒకేచోట కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేని జీవితాన్ని గడపడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో నేటి యువతరం గుండె బలహీనమైపోతోంది. 

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో 20 ఏళ్ల క్రితం ఒకరు మాత్రమే కార్డియాలజిస్టు ఉండేవారు. అప్పట్లో గుండె సమస్యలకు సైతం జనరల్‌ ఫిజీషియన్లు చికిత్స చేసేవారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ పాతికేళ్ల క్రితం జనరల్‌ ఫిజీషియన్లే గుండె జబ్బుల విభాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కార్డియాలజిస్టు రావడంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన ఒక్కరే విభాగాన్ని పర్యవేక్షించారు. మధ్యలో ఒకరిద్దరు కార్డియాలజిస్టులు, సీనియర్‌ రెసిడెంట్లు వచ్చినా కొన్నాళ్లకే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐదుగురు కార్డియాలజిస్టులు ఈ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు.

ఇందులో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఓపీకి 200 నుంచి 250 మంది చికిత్స కోసం వస్తుండగా, ఇన్‌ పేషంట్లుగా నెలకు 350 నుంచి 400 మంది వరకు చేరి చికిత్స పొందుతున్నారు. రోజూ 400కి పైగా  ఈసీజీ, 40 నుంచి 50 వరకు 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 11వేల దాకా యాంజియోగ్రామ్‌లు, 2వేలకు పైగా స్టెంట్స్, 60 పేస్‌మేకర్లు వేశారు. దీంతో పాటు కార్డియోథొరాసిక్‌ విభాగంలో సైతం గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు కార్పొరేట్‌ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ విభాగంలో ఇప్పటి వరకు 480కి పైగా ఆపరేషన్లు నిర్వహించారు. గుండె పోటు వచ్చిన వారికి సత్వర వైద్యం అందించేందుకు కర్నూలు పెద్దాసుపత్రితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి.  

 గుండెపోటుకు కారణాలు 
మానసిక ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు 
చిన్న వయస్సులోనే ఊబకాయంతో పాటు బీపీ, షుగర్‌లు రావడం 
ఈ జబ్బులు వచ్చినా వాటిని నియంత్రణలో ఉంచుకోకపోవడం   
ఒకేచోట గంటలకొద్దీ సమయం కూర్చుని పనిచేయడం 
ధూమ, మద్యపానాలతో మరింత చేటు 
విపరీతంగా ఫాస్ట్‌ఫుడ్, మాంసాహారం తినడం 
రాత్రివేళల్లో తగినంత నిద్రలేకపోవడం 

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
బీపీ, షుగర్‌ నియంత్రణలో ఉంచుకోవాలి. ఊబకాయం తగ్గించుకోవాలి.  
రోజూ తగినంత వ్యాయామం చేయాలి.  
ధూమ, మద్యపానాలు మానేయాలి.  
ఒత్తిడి లేని జీవితం కోసం ప్రణాళికతో రోజును ప్రారంభించాలి.  
స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి.   
అధిక కొవ్వు, నూనెలు, ఉప్పు, చక్కెరలకు దూరంగా ఉండాలి.  
రాత్రి త్వరగా నిద్రపోవాలి. తగినంత నిద్రతో గుండెకు అదనపు శక్తి.  

యువతలో హృద్రోగ సమస్యలు పెరిగాయి 
ఇటీవల కాలంలో  18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు సైతం గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి   పలు రకాల మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమితో పాటు దురలవాట్లు, నియంత్రణలేని ఆహారం, కుటుంబ సమస్యలు, వాతావరణ కాలుష్యం  కారణాలుగా భావిస్తున్నాము. జీవనశైలిలో మార్పులు తెచ్చుకుని రోజూ తగినంత వ్యాయామం చేయడం, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం మేలు. బీపీ, షుగర్‌లు ఉంటే వాటిని నియంత్రించుకోవాలి.  –డాక్టర్‌ చైతన్యకుమార్, కార్డియాలజిస్టు, కర్నూలు 

ఉద్గీత ధ్యాన యోగ ఉపకరిస్తుంది 
గుండెపోటు ప్రధానంగా మానసిక ఒత్తిడి అధికం కావడం, నిద్రలేకపోవడంతో వస్తోంది. దీనికితోడు శరీరం సైతం అంతరశుద్ధి లేకపోవడం వల్ల లోపల వాయువులు ఏర్పడి గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. ఇందుకు గాను ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే లీటర్‌ నీటిని తాగి శరీరాన్ని అంతరశుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్గీత ధ్యానయోగ(గట్టిగా ఓంకారం పలకడం)ను 20 సార్లు చేయాలి.  –జి. మురళీకృష్ణ, యోగామాస్టర్, కర్నూలు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement