ముంబై: దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు ఇటీవల కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)లవైపు దృష్టి సారిస్తున్నాయి. తమ ప్లాంట్లు కార్యాలయాల్లో ఉద్యోగుల రవాణాకు ఇవి అనుకూలమని భావిస్తున్నాయి. దీంతో మెటల్ దిగ్గజాలు టాటా స్టీల్, హిందాల్కోతోపాటు ఐటీ బ్లూచిప్ కంపెనీలు క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, గ్లోబల్ బ్యాంకింగ్ సంస్థలు బార్‌క్లేస్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్, అలియంజ్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ వాహన పాలసీలకు తెరతీస్తున్నాయి. తద్వారా ఉద్యోగులను ఈవీలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీల అమ్మకాలు ఊపందుకున్న నేపథ్యంలో పలు కార్పొరేట్ల తాజా ప్రణాళికలు పరిశ్రమకు జోష్‌నిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరిన్ని సంస్థలు రెడీ
బ్యాటరీ ఆధారంగా నడిచే ఈవీలు కొంతకాలంగా భారీగా విక్రయమవుతున్నాయి. మారియట్, నోవాటెల్ తదితర ఆతిథ్య రంగ కంపెనీలు సైతం ఈవీలను కొనుగోలు చేస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ సంస్థల బాటలో హోటల్ చైన్ కంపెనీలు ఈవీలను మాత్రమే వినియోగించవలసిందిగా విక్రేతలు(వెండార్ల)కు సూచిస్తున్నాయి. ఇక మరోపక్క ఎన్‌ఎంసీలు తమ కార్యకలాపాలలో ఈవీల వినియోగ ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈవీల వినియోగానికి మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశాయి. పర్యావరణ పరిరక్షణ బాటలో ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాయి.
డిసెంబర్‌లో డీలా
రూ. 1,100 కోట్ల సబ్సిడీ పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో గత నెల(డిసెంబర్)లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు క్షీణించాయి. 2022 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో 20 శాతం నీరసించాయి. రోడ్, రవాణా, జాతీయ రహదారుల శాఖ వాహన పోర్టల్ గణాంకాల ప్రకారం స్థానిక మార్కెట్లో నవంబర్‌లో 76,162 వాహనాలు అమ్ముడుపోగా.. డిసెంబర్‌లో ఇవి 59,554 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈవీలను ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన ఫేమ్–2 విధానాలలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. అయితే 2022 ఏప్రిల్ నుంచి సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక విలువ జోడింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. హీరో ఎలక్ట్రిక్, ఓకినావా ఆటోటెక్, రివోల్ట్, యాంపియర్ తదితర 6 కంపెనీలకు సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ అంశాలపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టగా.. మరోపక్క సబ్సిడీలు ఆగిపోవడంతో క్యాష్ ఫ్లోలపై ఒత్తిడి పడుతున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలియజేశారు. సమస్య త్వరగా పరిష్కారంకాకుంటే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు.
ప్రోత్సాహకాలు ఇలా
ప్రభుత్వం ద్విచక్ర ఈవీలకు కిలోవాట్‌కు రూ. 15,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. అయితే మొత్తం వాహన వ్యయంలో 40 శాతం మించకుండా పరిమితి విధించింది. ఇందుకు స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ విలువ జోడింపును చేపట్టవలసి ఉంటుంది. ఈ విషయంలో వాహన విక్రయం తదుపరి కంపెనీలు సంబంధిత ఆధారాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఆపై 45–90 రోజుల్లోగా వాహనం రిటైల్ ధరపై ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేస్తుంది. ఈవీ కంపెనీలకు ప్రభుత్వం అవాంతరాలు సృష్టించబోదని, దేశీయంగా పరిశ్రమలో సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తుందని అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి.
2023లో రెట్టింపునకు
ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎలక్ట్రిక్ వాహన రిటైల్ విక్రయాలు రెట్టింపునకు జంప్‌చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి 2.2 మిలియన్ యూనిట్లకు తాకనున్నట్లు అంచనా. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీల సొసైటీ(ఎస్‌ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022లో ఈవీ రిటైల్ అమ్మకాలు మిలియన్ యూనిట్లకు చేరాయి. కాగా.. గత నెలలోనే వేదాంతా గ్రూప్ ఉద్యోగులకు ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. నెట్ జీరో కర్బన విధానాలకు అనుగుణంగా తాజా పాలసీకి తెరతీసింది.
ఈవీలపై దేశీ కార్పొరేట్ల దృష్టి
Published Tue, Jan 3 2023 6:26 AM | Last Updated on Tue, Jan 3 2023 6:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment