ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది భారీగా వేసవి తాపం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఇంట్లో తీవ్ర ఉక్కపోత మొదలైంది. ఫ్యానులు, కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ యాప్‌లు, రిటైల్ స్టోర్ల్లో వీటి అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఐసెర్ రేటింగ్
కొందరు సరైన అవగాహన లేక పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలు కొనుగోలు చేస్తారు. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 150-190 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్ (ఐఎస్‌ఈఈఆర్) రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్ రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్ రేట్ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్‌లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుంది.
ఇన్వర్టర్‌తో మేలు
చాలా ఇళ్లల్లో నిత్యం ఏసీని ఉపయోగించే వారు ఇన్వర్టర్‌తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకోవాలి. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్, ఆఫ్ మాత్రమే ఉంటాయి. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. మార్కెట్‌లో చాలా వరకు కన్వర్ట్‌బుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల అవుట్‌డోర్ యూనిట్‌లోని ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది.
ఇదీ చదవండి: 8.8 కి.మీ క్యాబ్ రైడ్ ధర చూసి షాక్.. చివరికి ఏమైందంటే..
ధరల మధ్య వ్యత్యాసం
ఏసీ కొనుగోలు చేసేప్పుడే తప్పకుండా స్టెబిలైజర్ కొనాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. ఈ-కామర్స్ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment