న్యూఢిల్లీ: ఈ వారం(18–22) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ సంకేతాలపై ఆధారపడి కదలనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై మరిన్ని కంపెనీలు ఆర్థిక పనితీరును వెల్లడించనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ తదితర ఐటీ బ్లూచిప్ కంపెనీలతోపాటు ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ బాటలో ఫలితాల సీజన్ మరింత వేడెక్కనున్నట్లు నిపుణులు తెలియజేశారు.
క్యూ2 జాబితా ఇలా
ఈ వారం రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న దిగ్గజాల జాబితాలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీతోపాటు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఇవేకాకుండా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హిందుస్తాన్ జింక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ సైతం క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇక మరోవైపు చైనా క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెపె్టంబర్ నెలకు యూఎస్‌పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి.
సెంటిమెంటుపై ఎఫెక్ట్
ఈ వారం దలాల్ స్ట్రీట్‌లో త్రైమాసిక ఫలితాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. తదుపరి కాలానికి కంపెనీలు ప్రకటించే ఆదాయ అంచనాలు(గైడెన్స్) తదితరాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆయా కంపెనీలు విడుదల చేసే ప్రోత్సాహకర లేదా నిరుత్సాహకర ఫలితాల ఆధారంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని శామ్‌కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. వారాంతాన ఫలితాలు వెలువడిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కౌంటర్లలో నేడు(సోమవారం) అధిక యాక్టివిటీ నమోదుకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటితోపాటు ఈ వారం ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్ దిగ్గజాలుసహా ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర ఫలితాలు మార్కెట్లను నడిపించే వీలున్నట్లు అంచనా వేశారు.
కరెక్షన్ తదుపరి
కొద్ది రోజుల దిద్దుబాటు తదుపరి ఈ వారం గ్లోబల్ మార్కెట్లు జోరందుకునే వీలున్నట్లు సంతోష్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఫలితాలకు ఇవి జత కలిసే అవకాశమున్నట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగం కీలకంగా నిలవనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు క్యూ2 పనితీరు వెల్లడించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ ఆర్జనల్లో పటిష్ట రికవరీపట్ల పెరుగుతున్న అంచనాలు మార్కెట్లలో బుల్ రన్ కొనసాగేందుకు దోహదపడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్ అంచనాలు విఫలమైతే ఆయా రంగాలలో స్వల్పకాలానికి దిద్దుబాటు జరగవచ్చని అంచనా వేశారు.
మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ఇటీవల జోరు చూపుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు తదితర అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. కాగా.. గత గురువారం ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,247 పాయింట్లు(2 శాతం) పుంజుకోవడం ద్వారా మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో నిఫ్టీ 18,000 పాయింట్ల మార్క్ ఎగువన నిలిచింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గత శుక్రవారం మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది.
రుణ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు
అక్టోబర్‌లో నికరంగా వెనకడుగు
అక్టోబర్‌లో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా నిలిచారు. గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు విరుద్ధంగా ఎఫ్‌పీఐలు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు రూపాయి మారకపు విలువ పతనం, ప్రపంచ పరిణామాలు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 1,472 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా రుణ(డెట్) మార్కెట్లో అమ్మకాల ట్రెండ్ నమోదైంది. ఫలితంగా రూ. 1,698 కోట్లు విలువైన సెక్యూరిటీలను విక్రయించారు. ఇదేసమయంలో మరోపక్క రూ. 226 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment