Sakshi Guest Column On BJP Govt Common Civil Code - Sakshi
Sakshi News home page

BJP Uniform Civil Code: అసలు కావలిసింది ‘ఉమ్మడి ఆర్థిక స్మృతి!’

Published Thu, Jul 13 2023 12:12 AM | Last Updated on Thu, Jul 13 2023 9:46 AM

Sakshi Guest Column On BJP Govt common civil code

దేశ పౌరుల్లో కొందరికి భారీ ఆస్తులున్నాయి! కొందరికి రెక్కల కష్టం తప్ప వేరే మార్గం లేదు. దేశంలో భూములు ఎన్ని? అవి ఉమ్మడిగానే ఉంటున్నాయా? దేశంలో, ఉత్పత్తి రాసుల్ని కురిపించే పరిశ్రమల్లో పౌరులందరూ సమానులేనా? సమస్త రవాణా సాధనాలనూ నిర్మించడానికీ, నడపడానికీ, కోట్ల కోట్ల డబ్బు రాసుల రాబడులకూ కారకులు ఎవరు? వాటి యాజమాన్యాలు ఎవరివి? ఆస్తి హక్కులకు కారణాలు ఏమిటి? పాకీ దొడ్లు తుడిచే అట్టడుగు కులాల శ్రామికులకు దేని మీద యాజమాన్యం ఉంది? దేశంలో, నిత్యం 24 గంటలూ ఉత్పత్తుల కార్యాలలో మునిగి బ్రతికే శ్రామికులకు సుఖ శాంతుల్లో ఉమ్మడితనం ఉందా? ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది నిజంగా ఎప్పుడు సాధ్యం? ‘ఉమ్మడి ఆర్థిక స్మృతి’ అనేది ఉన్నప్పుడు మాత్రమే! 

‘ఒకే ఇంట్లో వున్న ఇద్దరు వ్యక్తులకు రెండు వేరు వేరు చట్టాలు వుంటే, ఆ కుటుంబం సవ్యంగా సాగుతుందా, చెప్పండి?’ అని ప్రధాని మోదీ, బీజేపీ కార్యకర్తల్ని అడిగిన వార్త, పది రోజులుగా ఒక చర్చనీయాంశం అయింది! అన్ని మతాల వారినీ ఒకే రకపు పౌరులుగా చేయాలనే ప్రయత్నంతో, ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనే విధానం ఎంత అవసరమో చెప్పడానికి మోదీ తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఉపన్యాసం అది! దేశంలో, ఐదు రాష్ట్రాలలో, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, అన్న బోధనగా ఆ మాటల్ని అర్ధం చేసుకోవచ్చు.

ముస్లిం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఎలానూ రావని ఆ పార్టీకి తెలుసు. కాబట్టి, హిందూ ఓటర్లలో అత్యధికుల్ని తన వైపు తిప్పుకోవడానికే బీజేపీ చేసే ప్రయత్నం అది. ఆ విధంగా భారత దేశ ప్రజలందర్నీ పౌరులుగా కాక, హిందువులుగా, ముస్లిములుగా, విభజించడానికే మోదీ వేసిన ఎత్తుగడ అది– అని కొన్ని ప్రతిపక్షాలు సరిగానే విమర్శిస్తున్నాయి.

‘ఉమ్మడి పౌర స్మృతి’ అనే విధానపు మంచి చెడ్డల గురించి చెప్పుకోవాలంటే, ముందు అది ఏమిటో కనీసంగా తెలియాలి. ఒక దేశంలోనే కాదు, ప్రపంచం లోనే వున్న ఆడా, మగా పౌరులందరికీ, మతం, కులం, ప్రాంతం వంటి తేడాలు లేకుండా, పౌరుల వ్యక్తిగత జీవితాల్నీ, కుటుంబ జీవితాల్నీ శాసించే, ఒకే రకమైన చట్టం (‘స్మృతి’) ఉండవలిసిందే! ఎందుకంటే, ఉదాహరణకి, ఒకటి రెండు మతాల్లో, పురుషులకు ఎక్కువ మంది స్త్రీలతో పెళ్ళిళ్ళు! ఇంకో మతంలో, పెళ్ళయిన వాళ్ళు విడిపోవడంలో స్త్రీలకే కాదు, పురుషులకు కూడా అసాధ్యమైనంత కష్టం! మతాల్లో, ఆస్తి హక్కులు ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ వేరు వేరుగా! మొగవాడి దృష్టిలో ఆడది తక్కువ! ఆడదాని దృష్టిలో మొగవాడు ఎక్కువ! ఈ విధంగా, పెళ్ళీ, విడాకులూ, దత్తతా, ఆస్తి హక్కూ, వంటి విషయాల్లో, వేరు వేరు మతస్తుల ఆచారాలూ, నియమాలూ, వేరు వేరే! ఎందుకూ? భారత్‌లో, మతాల గురించీ, కులాల గురించీ, సమానత్వాల బోధనలతో మాట్లాడే వాళ్ళు, అసలు బ్రతుకు తెరువుకి పునాది కారణం అయిన ఆదాయాల్లో తేడాల గురించి ఎందుకు ఎత్తరు? 

‘ఉమ్మడి పౌర స్మృతి’ కోసం ప్రయత్నించాలని, భారత రాజ్యాంగంలో కూడా ఒక చోట చెప్పారని తెలుస్తుంది! కానీ, దాన్ని సాధించడానికి సరైన పునాదిగా ఏ పరిస్థితులు ఏర్పడాలో భారత రాజ్యాంగం చెప్పదు! ఎవరి మతాచారాల్ని వారు ఆచరించే హక్కులు ఉండవచ్చని ఒక వేపు చెపుతూనే, ‘మతాలతో నిమిత్తం లేకుండా’ పౌరులందరికీ, వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు సంబంధించి ఒకే చట్టం ఉండాలని ఇంకో పక్క సూచిస్తుంది. ఎంత గడుసు రాజ్యాంగం! ఒకటి ‘ప్రాధమికమైన హక్కూ’! రెండోది కేవలం ‘సూచన’! సూచన, నిబంధనగా ఎప్పటికీ అవదు. ఉమ్మడి పౌర స్మృతి కూడా నిజానికి సూచన వంటిదే! కానీ, దాన్ని చట్టంగా నిలబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు.

మోదీని, బీజేపీ కార్యకర్తలు ఈ తర్కంతో అడగాలి: అయ్యా! తమరు ఉమ్మడి పౌర స్మృతి పేరుతో పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలంటున్నారు! ఆ స్మృతి, కేవలం వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు మాత్రమే కదా? మరి, పౌరులందరూ ఆర్ధికంగా ఒకే స్తితిలో లేరు! ‘ఆర్ధికంగా’ అంటే, ‘రూపాయి నోట్ల’ పరంగా కాదు, శ్రమలు చేయడాల పరంగా, ఉత్పత్తి కార్యాల పరంగా! దేశ పౌరుల్లో, కొందరికి భారీ భారీ ఆస్తులున్నాయి! కొందరికి రెక్కల కష్టం తప్ప వేరే మార్గం లేదు.

దేశంలో భూములు ఎన్ని? అవి ఉమ్మడిగానే వుంటున్నాయా? దేశంలో, ఉత్పత్తి రాసుల్ని కురిపించే పరిశ్రమల్లో పౌరులందరూ సమానులేనా? సమస్త రవాణా సాధనాలనూ నిర్మించడానికీ, నడపడానికీ, కోట్ల కోట్ల డబ్బు రాసుల రాబడులకూ కారకులు ఎవరు? వాటి యాజమాన్యాలు ఎవరివి? ఆస్తి హక్కులకు కారణాలు ఏమిటి? పాకీ దొడ్లు తుడిచే అట్టడుగు కులాల శ్రామికులకు దేనిమీద యాజమాన్యం వుంది? దేశంలో, నిత్యం, 24 గంటలూ, ఉత్పత్తుల కార్యాలలో మునిగి బ్రతికే శ్రామికులకు, సుఖ శాంతుల్లో ఉమ్మడితనం వుందా? ఆడవాళ్ళ గృహ కార్యాలలో, పిల్లల పెంపకాల్లో, వృద్ధుల సంరక్షణల్లో, పురుషుల ఉమ్మడి పాత్ర వుందా? శ్రామిక జనంలో, మేధా శ్రామికులు వేరూ, శారీరక శ్రమల వారు వేరూ! శ్రమలు చేయడాల్లో ఉమ్మడితనం లేకపోతే, పౌరులుగా సమానులా?

ఈ రకంగా ఆర్ధిక అసమానతల గురించి స్పష్టంగా గ్రహిస్తూ, మోదీ వంటి నాయకుల్ని అడగవలిసిన ప్రశ్న ఏమిటి? వ్యవసాయంలో, పరిశ్రమల్లో, రవాణాల్లో, సమస్త శ్రమల్లోనూ కాదా; ఏ ఒక్క శ్రమలో అయినా వేలు పెట్టని పౌరులకూ, రాత్రింబవళ్ళూ డ్యూటీలతో సతమతమయ్యే పౌరులకూ మధ్య ఉమ్మడితనం ఉన్నట్టా? ఇది వుందో లేదో ప్రశ్న లేకుండా, పెళ్ళికో, విడాకులకో, దత్తతకో, దీనికో, దానికో ఉమ్మడి చట్టాలా? హక్కులే సమానంగా, ఉమ్మడిగా లేనప్పుడు, ఉమ్మడి పౌర çస్మృతి గురించి ఉపన్యాసం ఇస్తున్నారేమీ మహాశయా?– అని మోదీని ప్రజలందరూ ప్రశ్నించలేరా? ఎన్నికల ముచ్చట్లలోనూ, నాయకుల ఆరాధనల్లోనూ మునిగిపోయిన ఏ పార్టీ ప్రజలకైనా, ఏ ప్రశ్నలూ రావు.  

‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది నిజంగా ఎప్పుడు సాధ్యం? 
‘ఉమ్మడి ఆర్ధిక స్మృతి’ అనేది ఉన్నప్పుడు! ఉమ్మడి ఆర్ధిక స్మృతి అంటే: మానవుల మనుగడకు ఆధారమైన భూములూ, గనులూ, అడవులూ, పరిశ్రమలూ, రవాణా సాధనాలూ వంటి ఉత్పత్తి సాధనాలు, పౌరులందరి ఉమ్మడి ఆస్తిగా, అంటే, ‘సమాజపు ఆస్తి’ గా ఉన్నప్పుడు! అలా ఉంచే చట్టమే ఉమ్మడి ఆర్ధిక స్మృతి! చిన్న పిల్లలూ, వృద్ధులూ, అనారోగ్యంతో వున్నవారూ తప్ప, ఇతర స్త్రీ–పురుషులందరూ, వేరు వేరు విలువలు కలిగిన, ఉత్పత్తి కార్యాలలో బాధ్యతలు కలిగి వుండే విధానమే ఉమ్మడి ఆర్ధిక స్మృతి! ఆ విధానమే ఉమ్మడి పౌర స్మృతికి దారితీయగలదు!

శ్రమ దోపిడీని అనుమతించే వర్గ భేదాల రాజ్యాంగ పాలన వున్న చోట, తర్క రహిత మతాచారాలు జీవితాల్ని శాసిస్తూ వుంటాయి. సమానత్వం లేని శ్రమ విభజన వల్ల తలెత్తిన కుల వ్యవస్త ఉన్నంతవరకూ, కుల కట్టుబాట్లూ, కులాచారాలూ, సమస్త కులాల పౌరుల్నీ ఎంతగానో లొంగదీస్తాయి! ఉమ్మడి ఆర్ధిక వ్యవస్త లేని సమాజంలో, దుర్భరమైన దారిద్య్రం కారణంగా, స్త్రీలని భోగ్య వస్తువులుగా కొనడాలూ, అమ్మడాలూ వంటి ‘వృత్తులు’ పుట్టుకొచ్చి సాగుతున్నాయి.

కేవలం ఉమ్మడి పౌర çస్మృతి వల్ల, మతం గానీ, కులం గానీ, వ్యభిచారం వంటి ‘వృత్తులు’ గానీ మాయం అవుతాయా? ఉన్న అసమానతల మీద సంస్కరణలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. నిజమే! కానీ, మౌలికమైన మార్పులు అత్యవసరమైన సమాజంలో, చిట్టి పొట్టి సంస్కరణలు స్తిరపడతాయా?

‘ఉమ్మడి పౌర స్మృతి’ని వ్యతిరేకించే వారు, ముస్లిం ఆడకూతుర్లకూ (‘ముసల్మాన్‌ బేటియా’), ముస్లింలలో వెనకబడ్డ ‘పాస్మండా’ కులాలకూ ద్రోహం చేస్తున్నారు– అని వాపోయింది ప్రధాని కరుణా హృదయం! మరి, మొన్న బిల్కిస్‌ బానోనీ, ఇతర ముస్లిం స్త్రీలనీ అత్యాచారాలకు గురిచేసిన నేరస్తుల్ని, బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడం ‘ముస్లిం బేటీయా’లకు ద్రోహం చేయడం అవలేదా?
రంగనాయకమ్మ   
వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement