హైదరాబాద్: ఓ అధికారికి లేదా సిబ్బందికి ఉన్నతాధికారులు ఒక పోలీసుస్టేషన్‌లో పోస్టింగ్ ఇస్తారు. సర్దుబాట్లు, అప్పటి అవసరాల్లో భాగంగా ఆయన/వాళ్ళు మరో చోట పని చేస్తుంటారు. తాత్కాలిక ప్రాతిపదికన పని చేయాల్సిన వీళ్ళు నెలలు, ఏళ్ళ తరబడి అక్కడే ఉండిపోతున్నారు. ఫలితంగా వీరికి పోస్టింగ్ ఇచ్చిన ఠాణాలో సిబ్బంది కొరతో పని తీరు మందగిస్తోంది. సాంతికేంగా అటాచ్‌మెంట్‌గా పిలిచే ఈ విధానానికి నగర కొత్వాల్ సీవీ ఆనంద్ స్వస్తి పలికారు. దీనికి తోడు సిబ్బందికి కచ్చితంగా మూడు షిఫ్టుల విధానం అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.
నగర పోలీసు విభాగంగాలో పోలీసుస్టేషన్లను పరిధి, ప్రాధాన్యత తదితరాల ప్రాతిపదికన ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తారు. కేటగిరీని బట్టే అందులో సిబ్బంది సంఖ్య ఆధారపడి ఉంటుంది. అటాచ్‌మెంట్ల కారణంగా పోలీసుస్టేషన్లలో పోస్టింగ్ ఇచ్చిన వాస్తవ సిబ్బందికి, అక్కడ పని చేస్తున్న వారికి మధ్య పొంతన లేకుండా ఉంటోంది. ఈ ప్రభావం ఆ ఠాణాల పనితీరుపై పడి ఉన్న సిబ్బందిపై పని భారం తీవ్రంగా పెరుగుతోంది.
ఏళ్ళుగా ఈ విధానం అమలులో ఉన్నా... ఇప్పటి వరకు ఉన్నతాధికారుల దృష్టికి రాలేదు. ఇటీవల జరిగిన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణతో మ్యాన్‌పవర్ ఆడిట్ నిర్వహించిన అధికారుల దృష్టికి ఈ సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలోనే దాదాపు వంది మందికి పైగా సిబ్బంది అటాచ్‌మెంట్లపై వివిధ విభాగాలు, కార్యాలయాల్లో పని చేస్తున్నట్లు గుర్తించి వారిని వెనక్కు రప్పించారు.
కచ్చితంగా ప్రతి రోజూ అదనపు సిబ్బంది అవసరమైన చోట ఉన్న సివిల్ కానిస్టేబుళ్ళకు బదులు ఏఆర్ సిబ్బందిని మోహరిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ అనుమతి లేకుండా శాంతిభద్రతల విభాగం నుంచి ఒక్కరిని కూడా అటాచ్‌మెంట్‌పై పంపకూడదని స్పష్టం చేశారు. మరోపక్క క్షేత్రస్థాయి సిబ్బందికి కచ్చితంగా మూడు షిఫ్టుల విధానం అమలు పైనా కొత్వాల్ ఆనంద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment