వాషింగ్టన్: రెండు సంవత్సరాల క్రితం ఇస్తాంబుల్‌లో జరిగిన దారుణ హత్యకు నష్టపరిహారం కోరుతూ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి కాబోయే భార్య సెంగిజ్ సౌదీ అరేబియా యువరాజు, ఇతర అధికారులపై మంగళవారం అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అమెరికా రచయిత జమాల్ ఖషోగ్గి పలు కథనాలు రాశాడు.దీంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఖషగ్గీని హత్య చేయించాడని అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్ళిన ఖషోగ్గి అక్టోబరు 2, 2018న హత్యకు గురయ్యాడు. అమెరికాకు మిత్రపక్షంగా ఉన్న సౌదీ ఆరేబియా తొలుత ఖషోగ్గి హత్యలో తన ప్రమేయాన్ని నిరాకరించింది. తరువాత పలు పొంతనలేని వ్యాఖ్యలు చేసినా చివరికి ఇస్తాంబుల్‌లోని దౌత్య కార్యాలయంలో సౌదీ ఏజెంట్ల బృందం ఖషోగ్గిని హత్య చేసినట్లు అంగీకరించింది.
దీనిపై విచారణ చేసిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ కూడా మహ్మద్ బిన్ సల్మాన్ ఖషోగ్గి హత్యకు ఆదేశించారని నివేదిక ఇచ్చింది. ఈ హత్యతో తమకు అపార నష్టం వాటిల్లిందని అతనికి కాబోయే భార్య అమెరికా కోర్టులో కేసు వేసింది. ఖషోగ్గి డీఏడబ్ల్యూఎన్ అనే సంస్థను స్థాపించాడని అతను మరణించిన కారణంగా దాని కార్యకలాపాలు దెబ్బతిన్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె కోర్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఖషోగ్గిని క్రూరంగా హింసించి హత్య చేశారని ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని షాక్‌కు గురిచేసిందని దావాలో తెలిపారు. అరబ్‌లో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఖషోగ్గి ప్రయత్నించారని, ప్లాన్ ప్రకారమే ఆయనను హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని వారు కోర్టుకు తెలిపారు.
చదవండి: మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా
Comments
Please login to add a commentAdd a comment