సినిమాలు... కళాకారులు సమాజంలో మార్పుకి సారథులు | 69th National Film Awards ceremony 2023 | Sakshi
Sakshi News home page

సినిమాలు... కళాకారులు సమాజంలో మార్పుకి సారథులు

Published Wed, Oct 18 2023 12:35 AM | Last Updated on Wed, Oct 18 2023 8:21 PM

69th National Film Awards ceremony 2023 - Sakshi

అనురాగ్‌ ఠాకూర్‌తో అల్లు అర్జున్‌  కరచాలనం

‘‘జాతీయ అవార్డుల ప్రదానం భారతదేశంలోని భిన్నత్వాన్నీ,  అందులో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్నీ సూచిస్తోంది. సినిమా అనేది కేవలం వ్యాపారమో, వినోదమో కాదు... శక్తిమంతమైన మాధ్యమం. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉపయోగ పడుతుంది. సమస్యల పట్ల సున్నితత్వాన్ని పెంచుతుంది. అర్థవంతమైన సినిమాలు సమాజంలోని, దేశంలోని సమస్యలను, విజయాలను ఆవిష్కరిస్తాయి.

ముర్ము నుంచి పురస్కారం అందుకుంటున్న  కీరవాణి

సినిమాలు, కళాకారులు సమాజంలో  మార్పుకు సారథులు. దేశం గురించి సమాచారం అందించడంతో పాటు ప్రజల మధ్య అనుబంధం పెరగడానికి సినిమా కారణం అవుతుంది. సమాజానికి ప్రతిబింబం, మెరుగుపరిచే మాధ్యమం సినిమాయే. ప్రతిభ ఉన్న ఈ దేశంలో సినిమాతో అనుబంధం ఉన్న ప్రతిభావంతులు ప్రపంచ స్థాయిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పి, దేశ అభివృద్ధికి ముఖ్య కారణం అవుతారు’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్  భవన్ లో మంగళవారం జరిగిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అవార్డులు అందించారు.

2021 సంవత్సరానికిగాను దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును నటి వహీదా రెహమాన్, ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్‌ (పుష్ప), ఉత్తమ నటి అవార్డును ఆలియా భట్‌ (గంగూబాయి కతియావాడి), కృతీ సనన్  (మిమి) అందుకున్నారు. ఉత్తమ చిత్రం (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ – హిందీ) అవార్డును దర్శకుడు ఆర్‌. మాధవన్, ఉత్తమ దర్శకుడిగా నిఖిల్‌ మహాజన్  (మరాఠీ ఫిల్మ్‌ – గోదావరి) అవార్డు అందుకున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌

ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘ఉప్పెన’కు దర్శకుడు బుచ్చిబాబు సన, నిర్మాత నవీన్  యెర్నేని పురస్కారాలు స్వీకరించారు. పూర్తి స్థాయి వినోదం అందించిన ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు దాసరి కల్యాణ్, దర్శకుడు రాజమౌళి అవార్డులు అందుకున్నారు. ఇదే చిత్రానికి ఉత్తమ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌కి ఎంఎం కీరవాణి, నేపథ్య గాయకుడుగా ‘కొమురం భీముడో..’ పాటకు కాలభైరవ, యాక్షన్  డైరెక్షన్ కి కింగ్‌ సాల్మన్, కొరియోగ్రఫీకి ప్రేమ్‌ రక్షిత్, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌కి వి. శ్రీనివాస మోహన్‌ పురస్కారాలు అందుకున్నారు. 

చంద్రబోస్‌ 

ఇంకా ఉత్తమ సంగీతదర్శకుడిగా ‘పుష్ప: ది రైజ్‌’కి దేవిశ్రీ ప్రసాద్, ‘కొండ΄పోలం’ చిత్రంలో ‘ధంధం ధం..’ పాటకు గాను ఉత్తమ రచయిత అవార్డును చంద్రబోస్, ఉత్తమ సినీ విమర్శకుడిగా పురుషోత్తమాచార్యులు (తెలుగు), ఇంకా పలు భాషలకు చెందిన కళాకారులు పురస్కారాలను స్వీకరించారు. ఈ వేదికపై వహీదా గురించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ – ‘‘వహీదా చక్కని నటనా నైపుణ్యం, మంచి వ్యక్తిత్వంతో చిత్ర పరిశ్రమలో శిఖరాగ్రానికి చేరుకున్నారు.

ఆలియా భట్‌        

వ్యక్తిగత జీవితంలోనూ ఒక మహిళగా హుందాతనం, ఆత్మవిశ్వాసంతో తనదైన ముద్ర వేసుకున్నారు. మహిళా సాధికారత కోసం మహిళలే చొరవ తీసుకోవాలని సూచించేలా వహీదా ఉదాహరణగా నిలిచారు’’ అన్నారు. ‘‘ప్రపంచంలో మంచి కంటెంట్‌ హబ్‌గా భారత శక్తి సామర్థ్యాలను నిరూపించడానికి ఏవీజీసీ (యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్‌ అండ్‌ కామిక్‌) రంగం ఉపయోగపడుతుంది’’ అన్నారు అనురాగ్‌ ఠాకూర్‌.

కృతీ సనన్‌ 

సినిమా అనేది సమష్టి కృషి  – వహీదా రెహమాన్‌
స్టాండింగ్‌ ఒవేషన్‌ మధ్య ఒకింత భావోద్వేగానికి గురవుతూ పురస్కారం అందుకున్న వహీదా రెహమాన్‌ మాట్లాడుతూ– ‘‘దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. నేనిక్కడ ఉన్నానంటే దానికి కారణం నేను భాగమైన ఈ అద్భుతమైన ఇండస్ట్రీ. అగ్రదర్శకులతో, నిర్మాతలతో, 
సాంకేతిక నిపుణులతో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. మేకప్‌ ఆర్టిస్ట్స్, హెయిర్‌ అండ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్స్, డైలాగ్‌ రైటర్స్‌... ఇలా అందరి గురించి ప్రస్తావించాలి. ఈ అవార్డు తాలూకు ఆనందాన్ని అన్ని సినీ శాఖలవారితో పంచుకోవాలనుకుంటున్నాను. ఏ ఒక్కరో సినిమా మొత్తాన్ని రూ΄పోందించలేరు. సినిమా సమష్టి కృషి. ఇది పరిశ్రమ మొత్తానికి దక్కిన పురస్కారం’’ అన్నారు.

జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కమర్షియల్‌ సినిమా అయిన పుష్పకు అవార్డు దక్కడం మాకు నిజంగా డబుల్‌ అచీవ్‌మెంట్‌.   – అల్లు అర్జున్‌ 



ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీయడం నా మొదటి లక్ష్యం. అలాంటి సినిమాలకు అవార్డులు రావడం బోనస్‌ లాంటిది. ముగ్గురు.. నలుగురు..  ఎంతో మంది టెక్నీషియన్లతో కలిసి చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం... మా సినిమాకు ఆరు అవార్డులు రావడం ఆనందదాయకం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలైన తొలి రోజు ఎంతో ఉత్కంఠతో ఉన్న మాకు ప్రశంసలు రావడం మరచిపోలేని ఘటన.     – దర్శకుడు రాజమౌళి


‘ఉప్పెన’ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నవీన్, రవి, మా గురువు సుకుమార్‌ వల్లే సాధ్యమైంది. వైష్ణవ్, కృతీ, విజయ్‌ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్‌లకు ధన్యవాదాలు.   – దర్శకుడు బుచ్చిబాబు సన

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో పని చేయడం నాకో  మంచి అవకాశం. ఇది దేవుడు ఇచ్చిన బహుమతి. రాజమౌళి నాకు గురువు. నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన ఆయనకు  ధన్యవాదాలు 
స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కింగ్‌ సాల్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement