న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. శుక్రవారం ఉదయం ‘తీవ్రమైన ప్లస్’ కేటగిరీకి చేరిందని అధికారులు వర్గాలు వెల్లడించాయి. మితిమీరిన కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం ఢిల్లీలో 346గా ఉన్న వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) సాయంత్రం కల్లా 418కు చేరిందని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది.
శుక్రవారం ఉదయం ఏకంగా 450గా నమోదైందని తెలియజేసింది. లోధీ రోడ్, జహంగీర్‌పురి, ఆర్కే పురం, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో వాయు నాణ్యత సూచి 438, 491, 486, 473గా ఉన్నట్లు పేర్కొంది. నగరాన్ని పొగ మంచు కమ్మేసిన డ్రోన్ దృశ్యాలను వార్తా సంస్థ ఏఎన్‌ఐ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు.
పొరుగు రాష్ట్రాల్లోనూ కాలుష్య భూతం
కాలుష్యం కేవలం ఢిల్లీకే పరిమితం కావడం లేదు. రాజస్తాన్‌లోని హనుమాన్‌గఢ్, భివాడీ, శ్రీగంగానగర్, హరియాణాలోని హిసార్, ఫతేబాద్, జింద్, రోహ్‌తక్, బహదూర్‌గఢ్, సోనేపట్, కురుక్షేత్ర, కర్నాల్, ఖైతాల్, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, బాఘ్‌పట్, మీరట్, నోయిడా, గ్రేటర్ నోయిడా తదితర ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత దిగజారింది.
Comments
Please login to add a commentAdd a comment