సెంట్రల్‌ ఢిల్లీలో డ్రోన్‌ కలకలం | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ ఢిల్లీలో డ్రోన్‌ కలకలం

Published Sun, Sep 10 2023 5:03 AM

G20 Summit: Delhi Police Books Photographer For Flying Drone During Birthday Party - Sakshi

న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్రం జరుగుతున్న సెంట్రల్‌ ఢిల్లీ ప్రాంతంలో ఓ డ్రోన్‌ ఎగరడంతో పోలీస్‌ అధికారులను చెమటలు పట్టించింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బర్త్‌డే పార్టీని షూట్‌ చేసేందుకు వాడిన డ్రోన్‌ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని సంబంధీకుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జీ20 సదస్సు నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తగా ఆగస్ట్‌ 29 నుంచి ఈ నెల 12 వరకు పలు భద్రతా చర్యలు ప్రకటించారు.

పారా గ్లైడర్లు, బెలూన్లు, డ్రోన్‌ల వంటివి ఎగరేయడంపై నిషేధం కూడా అందులో ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా సెంట్రల్‌ ఢిల్లీలోని షాది ఖాంపూర్‌కు చెందిన హర్మన్‌జీత్‌ సింగ్‌(29) బంధువు పుట్టిన రోజు వేడుకను తన నివాసం టెర్రస్‌పై ఏర్పాటు చేశాడు. దీనిని షూట్‌ చేసేందుకు డ్రోన్‌ను వాడాడు. జీ20 శిఖరాగ్రం జరుగుతున్న ప్రాంతంలో ఇది ఆకాశంలో ఎగురుతుండటం గమనించిన కంట్రోల్‌ స్టేషన్‌ అధికారులు, అక్కడి పోలీసులను అలర్ట్‌ చేశారు. వారు వెంటనే డ్రోన్‌ను వినియోగిస్తున్న హర్మన్‌జీత్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్‌లోని ఫుటేజీని పరిశీలించడగా అది బర్త్‌డే పార్టీకి సంబంధించిందేనని తేలింది. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement