మృతుడు గోకుల్‌రాజ్, ప్రధాన నిందితుడు యువరాజ్ (ఫైల్)
సాక్షి, చెన్నై: సేలం జిల్లా ఓమలూరు ఇంజినీరింగ్ విద్యార్ధి గోకుల్ రాజ్ పరువు హత్య కేసులో మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఓ సామాజిక వర్గానికి చెందిన యువజన నేత యువరాజ్, ఆయన డ్రైవర్ అరుణ్ కుమార్‌కు మరణించే వరకు జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి సంపత్‌కుమార్ తీర్పు చెప్పారు. వివరాలు.. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్‌రాజ్ 2015లో పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఈ కేసు విచారణ సమయంలో డీఎస్పీ విష్ణు ప్రియ బలన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు దారి తీసింది. దీంతో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఈకేసులో ప్రధాన నిందితుడిగా అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన యువజన నేత యువరాజ్‌ను గుర్తించారు. అతడి డ్రైవర్ అరుణ్‌కుమార్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. దీంతో కేసును నామక్కల్ నుంచి మదురై ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఏడేళ్ల పాటు జరిగిన విచారణ గత వారం ముగిసింది.
తీర్పుపై ఉత్కంఠ..
ఈ కేసు తీర్పును మంగళవారం మధ్యాహ్నం న్యాయమూర్తి సంపత్‌కుమార్ వెలువరించారు. యువరాజ్‌కు మూడు యావజ్జీవ శిక్షతో పాటుగా మరణించే వరకు జైలు శిక్షను విధించారు. అరుణ్‌కుమార్‌కు రెండు యావజ్జీవాలు, మరణించే వరకు జైలు శిక్ష ఇస్తూ తీర్పు చెప్పారు. అలాగే, ఈ కేసులో నిందితులుగా ఉన్న కుమార్, సతీష్, రఘు, రంజిత్, సెల్వరాజ్ , చంద్రశేఖర్ , ప్రభు, శ్రీథర్, గిరిధర్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది.
ఇక, శిక్ష పడ్డ వారందరికీ తీర్పు పునః పరిశీలనకు గానీ, క్షమాభిక్షకు గానీ అవకాశం లేకుండా తీర్పులో ప్రత్యేక అంశాలు పేర్కొన్నారు. అలాగే, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా జరిమానా విధించారు. అయితే, అప్పీలుకు వెళ్లే అవకాశం మాత్రం ఉండటం గమనార్హం. అయితే, ఈ కేసులో ఐదుగురు తప్పించుకున్నారని వారికి కూడా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని గోకుల్ రాజ్ తల్లి చిత్ర విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పు సమయంలో కోర్టు ఆవరణలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment