న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక సమయంలో బ్యాలెట్ పత్రాలను పాడుచేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు గాను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. అనిల్ మసీహ్‌ను ప్రశ్నించడం ద్వారా, రిటర్నింగ్ అధికారిని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ క్రాస్ ఎగ్జామినేట్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా భావిస్తున్నారు.
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చండీగఢ్ మేయర్‌గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజీనామా, ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు ఆదివారం బీజేపీ పంచన చేరినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. తాజాగా ఎన్నికలు జరపటానికి బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణంలో మరోసారి ఓట్లను లెక్కించడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించాకే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
నిజాయతీగా సమాధానమివ్వండి
సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్‌ను కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. నిజాయతీగా సమాధానాలు చెప్పకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం. ఆ ఫుటేజీ చూశాం. మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు?’ అని అడిగారు. ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కు పెట్టింది నిజమేనని మసీహ్ అంగీకరించారు.
అవి అప్పటికే పాడైపోయి ఉన్నందున, వేరు చేసేందుకే అలా చేశాన’ని చెప్పారు. ‘బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాలి. అలాంటప్పుడు వాటినెందుకు పాడు చేశారు? బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత్రా మార్కులు వేయొచ్చని ఏ నిబంధనల్లో ఉంది?’అని సీజేఐ అడిగారు. ఎన్నికల ప్రక్రియలో కలుగ జేసుకున్నందుకు మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చండీగఢ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానుద్దేశించి సీజేఐ పేర్కొన్నారు. మంగళవారం జరిగే విచారణకు కూడా హాజరుకావాలని అనిల్ మసీహ్‌ను ఆదేశించారు. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు.
బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ వీడియో పరిశీలిస్తాం
బ్యాలెట్ పత్రాలతోపాటు ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజీని తమకు పంపించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. రికార్డులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక న్యాయాధికారికి బాధ్యతలు అప్పగించాలని, పటిష్ట బందోబస్తు నడుమ ఆయన్ను ఢిల్లీకి పంపాలని స్పష్టం చేసింది.
ఏం జరిగిందంటే..?
జనవరి 30వ తేదీన మేయర్ ఎన్నికలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించడం, బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకార్ చేతిలో ఆప్–కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలవడం తెలిసిందే. బీజేపీ మైనారిటీ సెల్‌కు చెందిన అనిల్ మసీహ్ కావాలనే ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆప్ ఆరోపించింది. కెమెరా వైపు చూసుకుంటూ ఆప్ కౌన్సిలర్లకు చెందిన బ్యాలెట్ పేపర్లపై మసీహ్ ‘ఎక్స్’ మార్కువేస్తున్న ఫుటేజీని ఆప్ కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment