ఢిల్లీ: జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు శాఖ సర్వేకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సర్వే కొనసాగించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించింది జ్ఞానవాపి మసీదు కమిటీ. ఒకవైపు సర్వే ఇవాళ మొదలుకాగా.. మరోవైపు మసీద్ కమిటీకి సుప్రీంలో చుక్కెదురుకావడం గమనార్హం.
అయితే శుక్రవారం ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ సర్వే ద్వారా చరిత్ర పునరావృతం అవుతుందని.. గాయాలు తిరిగి తెరపైకి వస్తాయని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వాదనలు వినిపించింది. అయితే.. ఈ వాదనలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించలేదు. మనం ఇప్పుడు గతంలోకి వెళ్లొద్దు అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది.
ASI Survey నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వలేమంటూ పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. అయితే అదే సమయంలో జ్ఞానవాపిలో చేసే సర్వే నాన్-ఇన్వాసివ్ మెథడ్(పరికరాల్లాంటివేం ఉపయోగించకుండా) చేయాలని, ఎలాంటి డ్యామేజ్ జరగొద్దంటూ పురావస్తు శాఖను ఆదేశించింది సుప్రీం. అందుకు ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ అంగీకరించారు.
జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించి.. ఆ నివేదికను నాలుగు వారాల్లోగా అందజేయాలంటూ జులై 21వ తేదీన వారణాసి(యూపీ) జిల్లా కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI)ను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు జూలై 24న తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై విచారణ జరిపి, తగిన తీర్పు వెల్లడించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు గురువారం తీర్పు చెప్తూ, సైంటిఫిక్ సర్వేను నిర్వహించాలని ఆదేశించింది. న్యాయం కోసం ఇక్కడ సైంటిఫిక్ సర్వే నిర్వహించడం అవసరమని, దీనివల్ల ఇరు పక్షాలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడింది.
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఈ సర్వే జరుగుతోంది. సర్వే కోసం ఏఎస్‌ఐకి నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment