సాక్షి, న్యూఢిల్లీ : విశాఖలోని రుషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అంటూ పిటిషనర్‌ను నిలదీసింది. రాజీకీయ పరిష్కారాలకు కోర్టుకు ఎందుకు వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
ఈ పిటిషన్‌ను శుక్రవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు పలు ప్రశ్నలు వేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అంటూ సీజేఐ ఘాటుగా స్పందించారు. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. రాజకీయ పరిష్కారాలకు కోర్టు వేదిక కారాదని వ్యాఖ్యానించారు.
రుషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు, జాతీయ హరితట్రిబ్యునల్ ఆదేశాలపై సీజేఐ ఆరా తీశారు. ఈ తరహా కేసులను హైకోర్టు తేల్చగలదని అన్నారు. హైకోర్టు లేదా ఎన్జీటీలకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించారు. హైకోర్టుకు వెళ్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అనంతరం కేసు డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment