15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్‌గా నిలిచే అవకాశం ఆసియా కప్ ద్వారా ఉపఖండంలో ఉన్న జట్లకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్నో అంచనాల మధ్య ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4 దశలోనే వెనుదిరిగింది. ప్రభావం చూపిస్తుందనుకున్న బంగ్లాదేశ్.. పసికూన హాంకాంగ్ కంటే దారుణంగా ఆడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఇక ఫైనల్ పోరు సెప్టెంబర్ 11న(ఆదివారం) పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరగనుంది. ఇక ఆసియా కప్‌ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్స్ అందుకున్నాయి. మరి 15వ ఎడిషన్ ఆసియాకప్‌ను శ్రీలంక, పాకిస్తాన్‌లలో ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ఈసారి ఆసియా కప్‌ను లంకకు అందివ్వాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ముందుగానే నిర్ణయం తీసుకుందా అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మొదట ఆసియా కప్‌ను నిర్వహించాల్సింది శ్రీలంకలోనే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ఆసియా కప్‌ను నిర్వహించలేమని చెప్పేసింది. దీంతో ఆఖరి నిమిషంలో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చారు.
ఇక గత కొన్ని నెలలుగా శ్రీలంక ఎంతో ఆర్థిక సంక్షోభానికి గురయ్యింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స వ్యవహారంపై లంక ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు కొన్ని నెలలపాటు దర్నాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే లంక టూరిజం బాగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభ సమస్య మరింత ముదిరిపోయింది. ముదిరి పాకాన పడడంతో మరో దిక్కులేక దేశం విడిచి పారిపోయిన రాజపక్స తన రాజీనామాను సమర్పించారు. ఆ తర్వాత అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే లంక ఆర్థిక పరిస్థితి గాడినపడ్డట్లు కనిపిస్తోంది.
ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీసీ.. లంకను ఆసియాకప్ గెలిచేలా ప్రోత్సహించిందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి శ్రీలంక ఆసియాకప్‌ను కైవసం చేసుకుంటే లంక బోర్డుకు పెద్ద మొత్తంలో అందనున్నట్లు సమాచారం. కాగా లంక క్రికెట్ బోర్డు ఈ మొత్తాన్ని దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని భావిస్తునట్లు సమాచారం.
కాగా ఆసియాకప్‌ను లంక గెలిచినా.. గెలవకపోయినా ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) లంక బోర్డుకు ప్రత్యేక నగదు బహుమతిని అందించాలని ముందే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆసియా కప్‌ను లంక గెలిచినా.. గెలవకపోయినా.. క్రికెట్ ఫ్యాన్స్ మనసులు మాత్రం గెలుచుకోవడం ఖాయం అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరొక విషయమేంటంటే.. ఎలాగు టీమిండియా సూపర్-4 దశలో వెనుదిరగడంతో.. భారత్ అభిమానుల మద్దతు కూడా శ్రీలంకకే ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆట పరంగా ఆసియా కప్‌లో శ్రీలంక ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. లీగ్ దశలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణ ఓటమి చవిచూసిన శ్రీలంక.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించి సూపర్-4లో అడుగుపెట్టింది. ఇక సూపర్-4లో మొదట అఫ్గన్‌పై విజయంతో ప్రతీకారం తీర్చుకున్న లంక.. భారత్‌కు షాక్ ఇచ్చింది. ఇక చివరగా పాకిస్తాన్‌తో జరిగిన పోరులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి శ్రీలంక మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక తుదిపోరులోనూ పాకిస్తాన్‌ను మట్టి కరిపించి శ్రీలంక ఆరోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా సూపర్-4 ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవడమే గాక మూడోసారి ఆసియాకప్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది.
చదవండి: Kane Williamson: గమ్మత్తుగా కేన్ మామ వ్యవహారం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment