IPL 2021: Delhi Capitals Beat Mumbai Indians By Six Wickets - Sakshi
Sakshi News home page

ఢిల్లీకి అమితానందం

Published Wed, Apr 21 2021 2:38 AM | Last Updated on Wed, Apr 21 2021 10:35 AM

Delhi Capitals beat Mumbai Indians by six wickets - Sakshi

అమిత్‌ మిశ్రా, ధావన్‌

గత సీజన్‌ ఫైనలిస్టుల మధ్య జరిగిన పోరు ప్రేక్షకులకు వినోదాన్ని పంచలేదు. ఆసక్తి కలిగించనూ లేదు. కానీ గతేడాది ఫైనల్లో తమను ఓడించి ఐపీఎల్‌లోనే ‘ఫైవ్‌ స్టార్‌ చాంపియన్‌’ జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ షాక్‌ ఇచ్చింది. అమిత్‌ మిశ్రా మాయాజాలం... శిఖర్‌ ధావన్‌ నిలకడ... వెరసి వరుస మ్యాచ్‌ల విజయాలతో జోరు మీదున్న ముంబైని నేలకి దించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో విజయాన్ని నమోదు చేసింది.  

చెన్నై: ఈ మ్యాచ్‌లో స్కోర్లు తక్కువే! ఆటగాళ్ల జోరు తక్కువే! బౌండరీలు, సిక్సర్లు ఇలా అన్నీ తక్కువే! విజయం సులువుగా ఏమీ దక్కలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 20వ ఓవర్‌దాకా పోరాటం చేసింది. చివరకు 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌కు షాక్‌ ఇచ్చి విజయానందాన్ని పొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అమిత్‌ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్‌), స్మిత్‌ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు.  

ఆరంభంలోనే దెబ్బ... 
మూడో ఓవర్లోనే ముంబైకి తొలిదెబ్బ తగిలింది. స్టొయినిస్‌ ఓపెనర్‌ డికాక్‌ (2)ను కీపర్‌ క్యాచ్‌తో పంపించాడు. కానీ రోహిత్‌ ఉన్నాడన్న ధీమా... సూర్యకుమార్‌ యాదవ్‌ జతయ్యాడన్న విశ్వాసం ముంబై అభిమానుల్లో మెండుగా ఉంది. ఇది ఆ తర్వాతి ఓవర్లో కనిపించింది. అశ్విన్‌ బౌలింగ్‌లో సూర్య ఓ బౌండరీ బాదితే, రోహిత్‌ 4, 6 కొట్టాడు. అనంతరం రబడను ఫోర్, సిక్సర్‌తో ఇద్దరూ ఆడుకున్నారు. ఒక్కసారిగా ఇన్నింగ్స్‌కు జోరు తెచ్చిన మురిపెం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టనేలేదు.  

మిశ్రా మాయ... 
ముందుగా సూర్యకుమార్‌ (15 బంతుల్లో 24; 4 ఫోర్లు)ను అవేశ్‌ ఖాన్‌ ఔట్‌ చేస్తే... ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ ముంబై పాలిట శరాఘాతమైంది. స్పిన్నర్‌ మిశ్రా... కెపె్టన్‌ రోహిత్‌ శర్మ, హిట్టర్‌ హార్దిక్‌ పాండ్యా (0)లను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. కృనాల్‌ పాండ్యా (1) వచి్చనా, పొలార్డ్‌ బ్యాటింగ్‌కు దిగినా ముంబైని ఆదుకోలేకపోయారు. కృనాల్‌ను లలిత్‌ యాదవ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేస్తే, ఆ మరుసటి ఓవర్లోనే మిశ్రా పొలార్డ్‌ను ఎల్బీగా దొరకబుచ్చుకున్నాడు. ఉన్నంతలో ఇషాన్‌ కిషన్‌ (28 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్‌), జయంత్‌ యాదవ్‌ (22 బంతుల్లో 23; 1 ఫోర్‌) చేసిన రెండంకెల పరుగులు ముంబైని మూడంకెల స్కోరుదాకా తీసుకొచ్చాయి.  

ధావన్‌ నిలకడ... 
ఆరంభంలోనే ఢిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా (7) నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. జయంత్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అతనికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్‌ ధావన్‌కు స్మిత్‌ జతయ్యాడు. ముంబై బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా ఈ ఇద్దరు కుదురుగా ఆడారు. రెండో వికెట్‌కు 53 పరుగులు జతయ్యాక పొలార్డ్‌ బౌలింగ్‌లో స్మిత్‌ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన లలిత్‌ యాదవ్‌తో కలిసి జట్టు స్కోరును ధావన్‌ లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. రాహుల్‌ చహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో ధావన్‌ వరుసగా 6, 4 బాదాడు. అదే ఊపులో భారీషాట్‌కు యత్నించిన ధావన్‌ లాంగ్‌లెగ్‌లో కృనాల్‌ పాండ్యా చేతికి చిక్కాడు. కాసేపటికే కెపె్టన్‌ పంత్‌ కూడా (7) సింగిల్‌ డిజిట్‌కే చేరడంతో ముంబై గత మ్యాచ్‌ల్లాగే పట్టుబిగించే ప్రయత్నం చేసింది.  

లలిత్‌ పోరాటం... 
స్మిత్‌ ఔటయ్యాక బ్యాటింగ్‌కు దిగిన లలిత్‌ యాదవ్‌ (25 బంతుల్లో 22 నాటౌట్‌; 1 ఫోర్‌) జట్టుకు విలువైన పోరాటం చేశాడు. పంత్‌ ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 115/4. విజయానికి 19 బంతుల్లో 23 పరుగులు కావాలి. ఈ దశలో వచ్చిన హెట్‌మెయిర్‌ (9 బంతుల్లో 14 నాటౌట్‌; 2 ఫోర్లు) దూకుడు, లలిత్‌ యాదవ్‌ నిలకడ ఢిల్లీ జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది. 

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) స్మిత్‌ (బి) మిశ్రా 44; డికాక్‌ (సి) పంత్‌ (బి) స్టొయినిస్‌ 1; సూర్యకుమార్‌ (సి) పంత్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 24; ఇషాన్‌ కిషన్‌ (బి) మిశ్రా 26; హార్దిక్‌ (సి) స్మిత్‌ (బి) మిశ్రా 0; కృనాల్‌ (బి) లలిత్‌ యాదవ్‌ 1; పొలార్డ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మిశ్రా 2; జయంత్‌ (సి అండ్‌ బి) రబడ 23; రాహుల్‌ చహర్‌ (సి) పంత్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 6; బుమ్రా (నాటౌట్‌) 3; బౌల్ట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–9, 2–67, 3–76, 4–77, 5–81, 6–84, 7–123, 8–129, 9–135. బౌలింగ్‌: స్టొయినిస్‌ 3–0–20–1, అశ్విన్‌ 4–0–30–0, రబడ 3–0–25–1, అమిత్‌ మిశ్రా 4–0–24–4, అవేశ్‌ ఖాన్‌ 2–0–15–2, లలిత్‌ యాదవ్‌ 4–0–17–1. 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి అండ్‌ బి) జయంత్‌ 7; ధావన్‌ (సి) కృనాల్‌ (బి) రాహుల్‌ చహర్‌ 45; స్మిత్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) పొలార్డ్‌ 33; లలిత్‌ యాదవ్‌ (నాటౌట్‌) 22; రిషభ్‌ పంత్‌ (సి) కృనాల్‌ (బి) బుమ్రా 7; హెట్‌మెయిర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1–11, 2–64, 3–100, 4–114. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–23–0, జయంత్‌ 4–0–25–1, బుమ్రా 4–0–32–1, కృనాల్‌ 2–0–17–0, రాహుల్‌ చహర్‌ 4–0–29–1, పొలార్డ్‌ 1.1–0–9–1. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement