దివికేగిన దిగ్గజం  | Indian spin legend Bishan Singh Bedi passes away | Sakshi
Sakshi News home page

దివికేగిన దిగ్గజం 

Published Wed, Oct 25 2023 2:04 AM | Last Updated on Wed, Oct 25 2023 2:04 AM

Indian spin legend Bishan Singh Bedi passes away - Sakshi

టి20 క్రికెట్‌ మాయలో పడి, సత్తా ఉన్నా... ఐదు రోజుల ఆటకు బైబై చెప్పేసి... జస్ట్‌ నాలుగు ఓవర్లేసే లీగ్‌లకు జైకొట్టే బౌలర్లున్న ఈ రోజుల్లో సంప్రదాయ టెస్టులకే సర్వం ధారపోసిన స్పిన్నర్‌ బిషన్‌సింగ్‌ బేడీ. ఆయన మునివేళ్లతో బంతిని సంధిస్తే వికెట్‌. ఆయన స్పిన్‌ ఉచ్చు బిగిస్తే ప్రత్యర్థి ఆలౌట్‌.

అంతలా... భారత క్రికెట్‌లో తన స్పిన్‌తో వికెట్లను దున్నేసిన దిగ్గజం బేడీ. ఎరాపల్లి ప్రసన్న, భగవత్‌ చంద్రశేఖర్‌లతో కలిసి దుర్బేధ్యమైన స్పిన్‌ త్రయంగా ప్రత్యర్థి జట్లను విలవిలలాడించాడు. ఈ త్రయానికి తర్వాత శ్రీనివాస్‌ వెంకటరాఘవన్‌ జతయ్యాక బ్యాటర్లకు చిక్కులు, చుక్కలే కనిపించేవంటే అతిశయోక్తి కాదు. క్రికెట్‌ జగాన్ని స్పిన్‌ మాయాజాలంతో ఊపేసిన బిషన్‌ సింగ్‌ ఆఖరి శ్వాస విడిచి దివికేగాడు. భారత క్రికెట్‌ను కన్నీట ముంచాడు.  

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో స్పిన్‌కే వన్నెలద్దిన  బౌలింగ్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడీ సోమవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. స్పిన్‌ శకాన్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. గత రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారు. పలు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నెల క్రితం మోకాలు ఆపరేషన్‌ జరిగింది. అనారోగ్యంతో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. మోకాలు శస్త్రచికిత్స అనంతరం సోకిన ఇన్ఫెక్షన్‌ క్రమంగా పెరగడంతోనే మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు.

ఈ పంజాబీ క్రికెట్‌ స్టార్‌ 1946లో సెపె్టంబర్‌ 25న అమృత్‌సర్‌లో జన్మించారు. తదనంతరం క్రికెట్‌లో చెరగని ముద్ర వేసి ఢిల్లీలో సెటిలయ్యారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు అంగద్‌ బేడీ (సినీనటుడు) ఉన్నారు. అంగద్‌ భార్య నేహ ధూపియా బాలీవుడ్‌ హీరోయిన్‌. మొదటి భార్య గ్లెనిత్‌ మైల్స్‌ ద్వారా ఇద్దరు సంతానం కొడుకు గావసిందర్, కుమార్తె గిలిందర్‌ ఉన్నారు.

స్పిన్నర్లు ఉపఖండానికే పరిమితమనే విమర్శల్ని తన స్పిన్‌ మంత్రతో విదేశీ గడ్డపై తిప్పిగొట్టిన ఘనత బిషన్‌ సింగ్‌ది. తన కెరీర్‌ అనంతరం కూడా క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ)కు విశేష సేవలందించారు. విరాట్‌ కోహ్లి సహా ఎంతో మంది కుర్రాళ్లకు ఫిట్‌నెస్‌ గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. కోహ్లి తను ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి బేడీనే కారణమని పలు సందర్భాల్లో చెప్పాడు. 

ఇదీ చరిత్ర... 
సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్, సౌరవ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లి లాంటి బ్యాటర్లు అసలైన క్రికెట్‌ టెస్టు ఫార్మాటేనని ఘంటాపథంగా చెప్పే సంప్రదాయ క్రికెట్‌లో స్పిన్నర్‌గా బేడీ ఓ వెలుగు వెలిగాడు. ఈ తరం క్రికెటర్లు మెరుపుల టి20లకు అలవాటు పడి టెస్టు క్రికెట్‌ను పక్కన బెడుతున్నారు. మరి బిషన్‌ సింగ్‌ ఐదు రోజుల టెస్టుల్లో, నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సుదీర్ఘకాలం దేశానికి, రాష్ట్రానికి సేవలందించాడు. 1967  నుంచి 1979 వరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 67 టెస్టులాడిన స్పిన్‌ లెజెండ్‌ 266 వికెట్లను పడగొట్టాడు. ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 14 సార్లు తీశాడు.

ఉత్తమ ప్రదర్శన 7/98. ఇక 370 ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 1,560 వికెట్లను చేజిక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బిషన్‌ సింగ్‌ పేరిటే ఇంకా రికార్డు ఉండటం విశేషం. ఫస్ట్‌క్లాస్‌ ఫార్మాట్‌లో బిషన్‌ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను ఏకంగా 106 సార్లు పడగొట్టారు. మ్యాచ్‌లో 10 వికెట్లను 20 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/5. వన్డే ఫార్మాట్‌లో తక్కువగా 10 మ్యాచ్‌లే ఆడాడు. 7 వికెట్లు తీశాడు. 1975 తొలి వన్డే వరల్డ్‌కప్‌లో, 1979 రెండో వన్డే వరల్డ్‌కప్‌లో బేడీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

1975 వరల్డ్‌కప్‌లో ఈస్ట్‌ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బిషన్‌ 12 ఓవర్లు వేసి 8 మెయిడెన్లు తీసుకొని కేవలం 6 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశాడు. అంతేకాదు...‘బేడీ సాబ్‌’ విజయవంతమైన సారథి కూడా! 22 టెస్టులకు నాయకత్వం వహించి 6 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. ఇందులో మూడైతే విదేశీ గడ్డపై సాధించిన ఘనవిజయాలున్నాయి.

బేడీ కెప్టెన్సీలోనే భారత జట్టు 1976లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 403 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రికార్డు 27 ఏళ్ల పాటు (2003 వరకు) చరిత్ర పుటల్లో నిలిచింది. 1970లో కేంద్ర ప్రభుత్వంనుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న బిషన్‌ సింగ్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2004లో ‘సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డుతో సత్కరించింది. 

ఇదీ ఘనత... 
ఈ భారత స్లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అంటే అరివీర ఆజానుబాహులైన విండీస్‌ బ్యాటర్లకు వణుకే! ముఖ్యంగా 1970వ దశకంలో ప్రపంచ క్రికెట్‌ను తన స్పిన్‌ తో శాసించాడు. 1969–70 సీజన్‌లో భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరిగిన ముఖాముఖి టెస్టు సిరీస్‌లో 20.57 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 1972– 73 సీజన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో 25.28 సగటుతో 25 వికెట్లు తీశాడు.

ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నమయ్యే వెస్టిండీస్‌ బ్యాటర్లను వారి సొంతగడ్డపై గడగడలాడించిన బౌలర్‌ ఎవరైన ఉన్నారంటే అది బేడీనే! 1975–76 సీజన్‌లో 25.33 సగటుతో 18 వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఆ మరుసటి సీజన్‌లో న్యూజిలాండ్‌ను తిప్పేసి 13.18 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ 1976–77 సీజన్‌లోనే ఇంగ్లండ్‌ మెడకు స్పిన్‌ ఉచ్చు బిగించి 25 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 1977–78 సీజన్‌లో ఈసారి ఆ్రస్టేలియా పనిపట్టాడు. 23.87 సగటులో 31 వికెట్లు తీశాడు.  

అరుణ్‌ జైట్లీ పేరుపెడితే నొచ్చుకున్నారు! 
ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలోని స్టాండ్‌కు బిషన్‌ సింగ్‌ బేడీ పేరు పెట్టారు. అయితే మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్‌ జైట్లీ మృతి అనంతరం ఆ స్టేడియానికి జైట్లీ పేరు పెట్టడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. క్రికెటేతరుడి పేరు పెట్టడాన్ని సహించలేక స్టాండ్‌కు తన పేరు తొలగించాలని బహిరంగంగా డిమాండ్‌ చేశారు.    

భారత క్రికెట్‌పై చెరగని ముద్ర 
బిషన్‌ సింగ్‌ మరణ వార్తను తట్టుకోలేకపోయా. స్పిన్‌పై ఆయనకున్న పట్టు, ఆటపై కనబరిచే పట్టుదల అసాధారణం. భావి క్రికెటర్లకు, భవిష్యత్‌ తరాలకు అతని అంకితభావం స్ఫూర్తిదాయకం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి.  –ప్రధాని నరేంద్ర మోదీ 

బేడీ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.  –ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ అలర్‌డైస్‌ 

స్పిన్‌ బౌలింగ్‌తో క్రికెట్‌ పుటల్లోకెక్కారు. భారత క్రికెట్‌లో స్పిన్‌కు మూలస్తంభంలా ఉన్నారు. అలాంటి దిగ్గజం మనమధ్య లేకపోవడం బాధాకరం.   –బీసీసీఐ కార్యదర్శి జై షా 

బేడీ మార్గదర్శనం వల్లే ఇంగ్లండ్‌లో నా తొలి శతకం సాకారమైంది. అలాంటి లెజెండ్‌ ఇప్పుడు లేకపోవడం బాధాకరం.  –బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ 

స్పిన్నర్లందరికి ఆయనే స్ఫూర్తి. యువతరానికి దిక్సూచి. బిషన్‌సింగ్‌ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా సానుభూతి. –మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే 

బిషన్‌ సింగ్‌ లేరన్న వార్త జీర్జించుకోలేనిది. భారత క్రికెట్‌కోసం ఎంతో చేశారు. ఆయన కుటుంబానికి దేవుడు స్థయిర్యాన్ని ఇవ్వాలి.  –మాజీ ఓపెనర్‌ గంభీర్‌ 

చాలా బాధగా ఉంది. ముమ్మాటికీ బిషన్‌సింగ్‌ గ్రేటెస్ట్‌ క్రికెటర్‌. యువ క్రికెటర్లు ఎదిగేందుకు ఎంతో పాటుపడ్డారు.   –సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 

బేడీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నాను.  –మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌  

అంత్యక్రియలకు హాజరైన కపిల్, సెహ్వాగ్‌ 
‘సర్దార్‌ ఆఫ్‌ స్పిన్‌’ బిషన్‌ సింగ్‌ బేడీ పార్థివ దేహానికి 1983 ప్రపంచకప్‌ కెప్టెన్ , దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్, 2011 ప్రపంచకప్‌ విజేత సభ్యుడు సెహ్వాగ్‌ తదితర మేటి, మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు. స్థానిక లోధి స్మశానవాటికలో మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలకు కీర్తి ఆజాద్, మదన్‌లాల్, నెహ్రా, అజయ్‌ జడేజా, మురళీ కార్తీక్, జహీర్, అజహరుద్దీన్‌ తదితర క్రికెటర్లు హాజరయ్యారు. కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన అభిమానులు, జూనియర్‌ క్రికెటర్ల అశ్రునయనాల మధ్య పంజాబీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement