జకార్తా: భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి.. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ భారత ద్వయం.. వరల్డ్ ఛాంపియన్స్ ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీపై వరుస సెట్లలో (21-17, 21-18) విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకున్నారు.
ఇండోనేసియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇది తొలి టైటిల్. సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గిన నెల రోజుల అనంతరం ఇండోనేసియా ఓపెన్ టైటిల్‌ను కూడా చేజిక్కించుకోవడం విశేషం. కాగా, సాత్విక్-చిరాగ్ జోడీ.. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే,ప్రస్తుత సీజన్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ.. స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా.. మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ వరకు చేరింది. ఈ జోడీ ఇటీవలికాలంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, థామస్ కప్ స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. అలాగే సూపర్ 300 (సయ్యద్ మోదీ), సూపర్ 500 (థాయ్‌లాండ్, ఇండియా ఓపెన్), సూపర్ 750 (ఫ్రెంచ్ ఓపెన్) టైటిళ్లు సాధించారు.
సాత్విక్ జోడీని అభినందించిన సీఎం జగన్
ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీని సీఎం జగన్ అభినందించారు. భవిష్యత్తులో ఈ జోడీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు సీఎం జగన్.
Comments
Please login to add a commentAdd a comment