When Virat Kohli Revealed His sister beat him badly: ‘‘చిన్నపుడు నాకొక అలవాటు ఉండేది. పెద్ద వాళ్లను కూడా ‘నువ్వు’ అంటూ ఏకవచనంతో పిలిచేవాడిని. మా అక్కతో మాట్లాడుతున్నపుడు కూడా ‘నువ్వూ.. నువ్వూ’ అంటూ సంభోదించేవాడిని. అలా ఏకవచనంతో పిలవడం మా అక్కకు నచ్చేది కాదు.
ఓరోజు తనకు బాగా కోపం వచ్చింది. ఇంకోసారి ఇలా మాట్లాడతావా అంటూ నన్ను బాగా కొట్టింది. అప్పటి నుంచి పెద్ద వాళ్లందరినీ .. ‘మీరు’ అని మర్యాదగా సంభోదించడం మొదలుపెట్టాను’’ అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రితో సంభాషణ సందర్భంగా గతంలో కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో తన బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్న కోహ్లి.. చిన్నపుడు తను అల్లరిపిల్లాడిలా ఉండేవాడిని చెప్పుకొచ్చాడు.
రూ. 50 నోటు చూడగానే చించి పడేసి..
‘‘పెళ్లి వేడుకలకు వెళ్లిన సమయంలో చాలా మంది నోట్లు గాల్లోకి ఎగురవేసి డ్యాన్సులు చేయడం చూశాను. అలా అది నా మైండ్‌లో ఉండిపోయింది. ఓరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు.
సరుకులు తెమ్మని మా అమ్మ నాకు 50 రూపాయలు ఇచ్చింది. ఆ నోటు చూడగానే పట్టరాని ఆనందంలో మునిగిపోయాను. ఎగ్జైట్‌మెంట్‌లో ఏం చేస్తున్నానో తెలియకుండానే.. మెట్ల మీదకు వెళ్లి నోటును చించి.. ముక్కలు పైకి ఎగురవేసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను.
ఆ తర్వాత కాసేపటికి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాను’’ అంటూ సరదా సంఘటన గురించి పంచుకున్నాడు. తన అల్లరి కారణంగా.. చాలా మంది తమ్ముళ్లలాగే తాను కూడా అక్క చేతిలో దెబ్బలు తిన్నానని పేర్కొన్నాడు.
సౌతాఫ్రికా పర్యటనలో
కాగా సరోజ్- ప్రేమ్ కోహ్లి దంపతులకు జన్మించిన విరాట్ కోహ్లికి అక్క భావనా కోహ్లి ధింగ్రా, అన్న వికాస్ కోహ్లి ఉన్నారు. ఇక క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని మహరాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లి.. ఇటీవల వరల్డ్‌కప్-2023 సందర్భంగా 50వ వన్డే శతకం బాది.. సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును బద్దలుకొట్టిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం.. కోహ్లి టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఢిల్లీ బ్యాటర్ 38 పరుగులు చేశాడు.
చదవండి: #KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment