కొండాపూర్‌లో మ్యూజియాన్ని మూడేళ్లుగా మూసి పెట్టిన కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ), అంతకంటే పెద్ద ఘనకార్యాన్నే చేసింది. పన్నెండేళ్ల క్రితం తవ్వకాల్లో వెలుగు చూసిన వస్తువులను సంబంధిత ఉన్నతాధికారి ఇప్పటివరకు వాటిని మ్యూజియంకు హ్యాండోవర్ చేయలేదు. ఆ తవ్వకాల్లో ఏయే వస్తువులు లభించాయో నివేదికనూ అందజేయలేదు. తవ్వకాల్లో దొరికిన వస్తువులెన్ని? అవి ఎక్కడున్నాయి? వాటిల్లో అన్నీ ఉన్నాయా? లేదా? వంటి విషయాలేవీ బయటి ప్రపంచానికి చెప్పలేదు. నివేదిక ఇవ్వకున్నా ఏఎస్‌ఐ పన్నెండేళ్లుగా చేష్టలుడిగి చూస్తుండటం విడ్డూరం. పుష్కర కాలం కిందట ఆ తవ్వకాలకు నేతృత్వం వహించిన అధికారి, ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో తవ్వకాల్లో దొరికిన చారిత్రక సంపద విషయం గందరగోళంగా మారింది.
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డికి చేరువలో ఉన్న కొండాపూర్ అద్భుత శాతవాహన కేంద్రం. క్రీ.పూ.2వ శతాబ్దం–క్రీ.శ.2వ శతాబ్దం మధ్య ఇది వ్యాపార, ఆధ్యాత్మి క పట్టణం. 19వ శతాబ్ద ప్రారంభం, 1940, 1970ల్లో పలుమార్లు ఇక్కడ తవ్వకాలు జరిగాయి. చరిత్రపరిశోధకులు గొప్పవిగా భావించే అనేక ఆధారాలు వెలుగు చూశాయి. రోమన్లు వచ్చి ఇక్కడ స్థిరపడి అంతర్జాతీయస్థాయిలో వాణిజ్యాన్ని నిర్వహించినట్టు తేలింది. అగస్టస్ కాలం నాటి బంగారు నాణేలూ ఇక్కడ దొరి కాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న చైనా పోర్సలీస్ బొమ్మలను తలదన్నే బొమ్మలు అక్కడ 2 వేల ఏళ్ల నాడే మనుగడలో ఉన్నట్టు తేలింది.
నాటి బంగారు ఆభరణాలు, మణులు, వైఢూర్యాలు, కెంపులు, పచ్చల లాంటివెన్నో వెలుగు చూశాయి. ఓ పట్టణానికి సంబంధించిన అవశేషాలు కనిపించాయి. దీంతో అక్కడ 86 ఎకరాల స్థలాన్ని ఏఎస్‌ఐ తన ఆధీనంలోకి తీసుకుని ఓ మ్యూజియంను నిర్మించింది. తవ్వకాల్లో వెలుగు చూసిన వాటిల్లోంచి కొన్నింటిని ప్రదర్శనకు ఉంచింది. మరోసారి తవ్వకాలు.. 2009 నుంచి 2011 వరకు ఏఎస్‌ఐ మరోసారి తవ్వకాలు జరిపింది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తవ్వకాల విభాగం (4) సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు మహేశ్వరి ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. అందులోనూ వేల సంఖ్యలో విలువైన వస్తువులు, శాతవాహన కాలం నాటి నాణేలు భారీ గా వెలుగు చూశాయి.
అయితే.. ఏయే వస్తువులు దొరికాయి? వాటి ప్రత్యేకతలేంటి? అనే నివేదికను మాత్రం ఏఎస్‌ఐ బహిర్గతం చేయలేదు. ఎంతోమంది అడిగినా స్పందించలేదు. ఈలోపు అధికారి మహే శ్వరి వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఆమె నివేదిక పోవడం, లభించిన వస్తువులను ఇక్కడి అధికారులకు హ్యాండోవర్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాటిని పెట్టిన గది తాళంచెవులు కూడా అప్పగించలేదు. దీంతో తవ్వి తీసినా కూడా అవి అజ్ఞాతంలోనే ఉండిపోయాయి. పరిశోధనలకు ఆస్కారమే లేక.. కర్ణాటకలోకి మస్కిలో తవ్వకాలు జరిపినప్పు డు 33 బంగారు నాణేలు వెలుగు చూశాయి.
మస్కి తవ్వకాల్లో లభించిన 33 ఫనమ్ బంగారు నాణేల్లో కేవలం ఒకటి మాత్రమే హోయసల రాజ్యానిదని, మిగతావన్నీ అంతకు చాలా ముందుగా ఉన్న విష్ణుకుండినులు సహా ఇతర పాలకులు అని వాటిని పరిశోధించిన ప్రముఖ నాణేల నిపుణుడు డాక్టర్ రాజారెడ్డి తేల్చారు. అలాంటి కొత్త విషయాలు కొండాపూర్‌లో 2009లో జరిపిన తవ్వకాల్లో దొరికిన నాణేల్లోనూ ఉంటాయన్న ఉద్దేశంతో వాటి పరిశోధనకు కేంద్రప్రభుత్వం నుంచి 2015లో అనుమతి పొందారు. అయితే.. నాటి అధికారి వాటిని హ్యాండోవర్ చేయకపోవటంతో పరిశోధనకు కేటాయించలేమని అధికారులు చెప్పారు. అలా పరిశోధనలేవీ జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment