సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు ఉన్న తరహాలోనే ఈ ప్రత్యేక న్యాయస్థానం ఉంటుందని వెల్లడించారు. మత్తు పదార్థాలతో విద్యార్థులు, యువత నిర్విర్యం అవుతున్నారని, వారిని దీని నుంచి రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్‌నాబ్)ను పటిష్టం చేస్తున్నామన్నారు.
మత్తుపదార్థాలు ఎవరికీ అందుబాటులో లేకుండా సమూలంగా నిర్మూలిస్తామని చెప్పారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేతో చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రంలో మత్తుపదార్థాలు పండించడం కంటే వినియోగం ఎక్కువగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు.
గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీలు ఏ విధంగా అయితే మావోయిస్టులను అణచివేశాయో, అదేవిధంగా మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. టీఎస్ నాబ్ కోసం అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్యను నియమించామని, మరో 301 మంది అధికారులతో దీనిని బలోపేతం చేస్తామని సీఎం చెప్పారు. వీరికి గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీలో పనిచేస్తున్న వారికి ఇస్తున్న మాదిరిగా అలవెన్సు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
డ్రగ్స్ సరఫరాకు సంబంధించి పూర్తిస్థాయిలో ఇన్‌ఫార్మర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి..డ్రగ్స్ అనే పదం వినపడకుండా చేయాలన్నది ప్రభుత్వ కృతనిశ్చయం అని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలతోపాటు ఇతరత్రా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు. సినీతారల డ్రగ్స్ కేసు పురోగతిలో ఉందన్నారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ మేరకు రెండుఫోర్లు టీఎస్‌నాబ్‌కు కేటాయించామని తెలిపారు. ఏఓబీతోపాటు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపుతామని, ఇందుకు టీఎస్ నాబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
విదేశీయుల కోసం డీఅడిక్షన్ కేంద్రం
చర్లపల్లి జైలులో రెండు ఎకరాల స్థలంలో డీఅడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సీఎం చెప్పారు. నైజీరియా, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారు వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ, మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారని, అలాంటి వారికోసం ఈ డీఅడిక్షన్ కేంద్రం పనిచేస్తుందన్నారు.
విభాగాల అధిపతుల నియామకం వరకే నా పని
ఆయా విభాగాల అధిపతులను నియమించడంవరకే తన పని అని, ఆ తర్వాత వారికి కింద ఎవరు కావాలన్నది వారి నిర్ణయానికి వదిలేస్తున్నట్టు చె ప్పారు. తాను అడిగిన ఫలితాలు రాకపోతే, సంబంధిత విభాగ అధిపతి సమాధానం చెప్పాల్సిందేనని సీఎం వ్యాఖ్యానించారు. మూడు కమిషనరేట్లకు కమిషనర్లను నియమించినా వారికీ అవసరమైన మ్యాన్‌పవర్‌ను వారే పిక్ చేసుకుంటారన్నారు.
రాష్ట్ర సలహా మండలి..
రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేస్తామని దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు అయ్యే మహాత్మా జ్యోతిబా పూలే ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్, రీసెర్చ్ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్’లా ఈ సలహామండలి పనిచేస్తుందన్నారు. ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వర్‌తో పాటు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్, ఆకునూ రి మురళి లాంటి మేధావులతో ఇది ఉంటుందన్నారు.
అన్నిరకాల గురుకుల విద్యాలయాలు, మండలస్థాయిలో ఏర్పాటు చేసే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఈ సంస్థ పర్యవేక్షణలో ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం గురుకు లాలు ఏర్పాటు చేసినా, మౌలిక సదుపాయాలు కల్పించలేదని, అగ్గిపెట్టెల్లాంటి అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సమస్య 100 రోజుల్లో పరిష్కారం
జర్నలిస్టుల సమస్యలను వందరోజుల్లో పరిష్కరిస్తామని, ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను సంక్రాంతిలోగా నియమిస్తామన్నారు. ఇళ్ల స్థలాల అంశం మరోసారి రాకుండా పూర్తిస్థాయిలో జర్నలిస్టుల సమస్యను ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామని అందరికీ ఇళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment