రాష్ట్రంలో పంటల సాగు రికార్డులు బద్దలు కొడుతోంది. తెలంగాణ చరిత్రలోనే ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో పంటల సాగు కొత్త రికార్డులు నమోదు చేసింది. కొన్నేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, విస్తారంగా కురిసిన వానలతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలన్నీ నిండిపోవడం, భూగర్భ జలమట్టాలు పెరగడంతో.. ప్రస్తుత యాసంగి మొత్తం పంటల సాగులో, వరి సాగులో ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేసింది.
ఇంతకుముందు యాసంగి సీజన్‌కు సంబంధించి అత్యధికంగా 2020–21లో 68.17 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి యాసంగిలో 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని బుధవారం విడుదల చేసిన నివేదికలో వ్యవసాయశాఖ వెల్లడించింది. 2014–15 యాసంగిలో 28.18 లక్షల ఎకరాల్లోనే పంటలు పండించగా.. మరో 40.35 లక్షల ఎకరాల సాగు పెరగడం గమనార్హం.
వరి కూడా ఆల్‌టైమ్ రికార్డే...
మొత్తం పంటల సాగుతో మాత్రమేకాకుండా.. వరి సాగు విషయంలోనూ ఈ యాసంగి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ప్రస్తుత యా సంగిలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఏకంగా 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నాట్లు వేయడానికి మరో పదిరోజుల పాటు సమయం ఉండటంతో.. వరి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా వానాకాలం సీజన్‌తో పోటీపడే స్థాయిలో యాసంగిలో వరి సాగు నమోదవుతోందని అంటున్నారు.
2014–15 యాసంగిలో 12.23 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ప్రస్తుతం ఏకంగా 53.08 లక్షల ఎకరాలకు పెరగడం గమనార్హం. అంటే గత తొమ్మిదేళ్లలో యాసంగిలో వరిసాగు 40.85 లక్షల ఎకరాలు పెరిగింది. 2015–16 యాసంగిలో కేవలం 7.35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగింది. ఆ తర్వాతి నుంచి పెరుగుతూ వచ్చింది. వాస్తవానికి ప్రస్తుత వ్యవసాయ సీజన్ (2022–23)లోని వానాకాలంలో కూడా వరిసాగు ఆల్‌టైం రికార్డు నమోదైంది. ఇటీవలి వానాకాలంలో 64.54 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయడం గమనార్హం. ఇంతకుముందు అత్యధికంగా 2021 వానాకాలంలో 61.94 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2013 వానాకాలంలో ఇక్కడ 29.16 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ఇప్పుడది రెండింతలు దాటిపోవడం గమనార్హం. మొత్తంగా ఈసారి వానాకాలం, యాసంగి సీజన్లలో వరిసాగు ఆల్‌టైం రికార్డులను నమోదు చేసుకుంది.
ప్రభుత్వ నిర్ణయాలతోనే భారీగా సాగు
వానాకాలంలో చెరువులు నిండి పంటలు పండుతాయి. అలాంటిది యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో పంటలు, వరి నాట్లు పడటం విశేషం. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరోవైపు రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ బోర్లకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. ఉచిత కరెంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే భారీగా సాగు సాధ్యమైంది. రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. రికార్డు స్థాయిలో పంటలు పండించిన రైతులకు అభినందనలు తెలుపుతున్నాను.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు
కొన్నేళ్లుగా మొత్తం యాసంగి సాగు తీరు (లక్షల ఎకరాల్లో)
ఏడాది సాగు విస్తీర్ణం
2014–15 28.18
2015–16 19.92
2016–17 39.20
2017–18 38.09
2018–19 31.49
2019–20 53.82
2020–21 68.17
2021–22 54.42
2022–23 68.53
కొన్నేళ్లుగా యాసంగి వరిసాగు తీరు (లక్షల ఎకరాల్లో)
ఏడాది సాగు విస్తీర్ణం
2014–15 12.23
2015–16 7.35
2016–17 23.20
2017–18 22.61
2018–19 18.34
2019–20 39.31
2020–21 52.80
2021–22 35.84
2022–23 53.08
Comments
Please login to add a commentAdd a comment