స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ | Sakshi
Sakshi News home page

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌

Published Fri, Dec 15 2023 5:08 AM

Gaddam Prasadkumar as speaker - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ప్రసాద్‌కుమార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష సభ్యులు అభినందనలు తెలిపారు.

అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తదితరులు స్పీకర్‌ను గౌరవ పూర్వకంగా తోడ్కొని వెళ్లి ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌ చైర్‌ వద్దకు వచ్చి ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.  

మంచి సాంప్రదాయానికి అందరి మద్దతు: సీఎం 
స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని, భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గొప్ప వ్యక్తి స్పీకర్‌ అయ్యారని కొనియాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారన్నారు. ప్రసాద్‌కుమార్‌ తన సొంత జిల్లా నేత అని గుర్తు చేశారు. వికారాబాద్‌ అభివృద్ధిలో ప్రసాద్‌కుమార్‌ది చెరగని ముద్ర అని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఆయనకు బాగా తెలుసన్నారు.

ఆయనకు 8 మంది సోదరీమణులు ఉన్నారని, చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో వారందరి బాధ్యత తానే తీసుకున్నారన్నారు. ఈ అసెంబ్లీ కూడా ఒక కుటుంబమేనని, ఆ కుటుంబంలో మనమంతా సభ్యులమని పేర్కొన్నారు. ప్రతిపక్ష, పాలకపక్షం అందరూ కుటుంబ సభ్యులేనన్నారు. మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరని, సభలో అందరి హక్కులను కాపాడగలరని, ఆదర్శవంతమైన అసెంబ్లీగా దీన్ని తీర్చిదిద్దుతారనే పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

సమాజంలో ఎన్నో రుగ్మతలకు ప్రసాద్‌కుమార్‌ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆయన పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి అని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.  

సంపూర్ణ మద్దతుకు కేసీఆర్‌ ఆదేశం: కేటీఆర్‌ 
స్పీకర్‌ ఎన్నిక విషయంలో మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశించారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. స్పీకర్‌ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నానన్నారు. సామాన్య ప్రజల సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు.

శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ..ప్రసాద్‌కుమార్‌ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్పీకర్‌గా ఎన్నికయ్యారంటూ అభినందనలు తెలిపారు. తన తండ్రి శ్రీపాదరావు ఇదే శాసనసభలో చైర్‌కు ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. స్పీకర్‌కు మద్దతు తెలిపినందుకు విపక్ష పా ర్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రసాద్‌కుమార్‌ ఇక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి కాదని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

పిల్లలకు తండ్రి లాంటి పాత్ర ఆయన సభలో పోషించాలని ఆకాక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, కడియం శ్రీహరి, యెన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు.
 
బీజేపీ సభ్యుల ప్రమాణ స్వీకారం 
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు మొదటి రోజు అసెంబ్లీకి గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారానికి సైతం దూరంగా ఉన్న వారు గురువారం అసెంబ్లీకి హాజరయ్యారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, పాయల్‌ శంకర్, పవార్‌ రామారావు పాటిల్, టి.రాజాసింగ్‌ వీరిలో ఉన్నారు.

పార్టీల బలాలను బట్టి సమయం: స్పీకర్‌ 
తనను స్పీకర్‌గా ఎంపిక చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రసాద్‌కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. ఏకగీవ్రంగా ఎన్నుకున్నందుకు అన్ని పా ర్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. 57 మంది కొత్త సభ్యులు ఉన్నారంటూ..పా ర్టీల బలాలను బట్టి సమయం కేటాయిస్తానని చెప్పారు. స్పీకర్‌ స్థానం ఉన్నతమైనదే కాదు సంక్లిష్టమైనదని పేర్కొన్నారు. అంతకుముందు సభ మొదలైన వెంటనే గతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయని వారి చేత ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్‌ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వీరిలో ఉన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement