పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే! | Actor Suresh Gopi Tragedy and Victory in June Month | Sakshi
Sakshi News home page

జూన్‌ నెల అంటేనే నరకం.. 32 ఏళ్లుగా నటుడి క్షోభ.. ఈసారి మాత్రం..

Published Thu, Jun 6 2024 7:36 PM | Last Updated on Thu, Jun 6 2024 8:12 PM

Actor Suresh Gopi Tragedy and Victory in June Month

గెలుపోటములు సాధారణం.. కానీ కొన్ని విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి.. చరిత్రనే తిరగరాస్తాయి. అలా తన సక్సెస్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు నటుడు సురేశ్‌ గోపి. అవును మరి! 1952లో లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి కూడా కేరళలో బీజేపీ గెలిచిందే లేదు. ఇంతకాలంగా అసాధ్యమనుకున్న కమలం విజయాన్ని తన గెలుపుతో సుసాధ్యం చేసి చూపించాడు.

ప్రాణం కాపాడు
ఈ సక్సెస్‌తో సురేశ్‌ గోపీ గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో! కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్తయినా తగ్గుతుందేమో! 1992 జూన్‌ 6న భార్యాబిడ్డతో ప్రయాణిస్తున్న అతడి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. స్పృహలోకి వచ్చేసరికి ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్నాడు. కళ్లు తెరుస్తూనే కంటతడి పెట్టుకున్నాడు. నా ప్రాణం కాపాడు స్వామీ అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. ఇక్కడ తన ప్రాణం అంటే ఆయన కూతురు లక్ష్మి. 

గుండెలో గూడు కట్టుకున్న బాధ
గాయాలు బాధిస్తున్నా ఎలాగోలా సత్తువ కూడదీసుకుని ఏడాదిన్నర వయసున్న కూతురిని చూసేందుకు ఐసీయూలోకి వెళ్లాడు. కొనప్రాణంతో కూతుర్ని చూసి తల్లడిల్లిపోయాడు. అతడి కన్నీరు చూసి భగవంతుడు చలించలేదు. ఆమెను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అందుకే జూన్‌ మాసం అంటేనే ఆయనకు భయం, అయిష్టత! ఈ నెలలో వర్షాలు పడి వాతావరణం మారే సమయంలో తన గాయాలు సైతం నొప్పులు లేస్తాయట!

జూన్‌ నెలలోనే..
అయినా ఆ నొప్పి భరించడం తనకిష్టమేనంటాడు. అదే తన కూతురితో ఉన్న చివరి జ్ఞాపకాలని జీవం లేని నవ్వు విసురుతాడు. నలుగురు పిల్లలున్నా సరే లక్ష్మి లేని లోటును ఎవరూ పూడ్చలేడంటాడు. విధి ఎంత విచిత్రమో కదా! జూన్‌ నెలలో అతడి కూతుర్ని తీసుకెళ్లిపోయింది. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత ఇదే నెలలో అతడికి ఊహించని విజయాన్ని అందించింది.

రాజకీయ నేపథ్యం..
సురేశ్‌ గోపి 2016లో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్‌ అయ్యాడు. తర్వాత బీజేపీలో చేరాడు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. 2021 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేసినా విజయం వరించలేదు. నిరాశతో వెనుదిరగలేదు. ముచ్చటగా మూడోసారి పోటీ చేసి త్రిసూర్‌ ఎంపీగా గెలిచాడు. నటుడిగా వందల సినిమాలు చేసిన సురేశ్‌ గోపి తెలుగులో అంతిమ తీర్పు, ఆ ఒక్కడు, ఐ వంటి చిత్రాలతో మెప్పించాడు.

చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్‌గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement