సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వెళ్లిన వర్మ
మాకు చెప్పకుండా మా ఊరు ఎందుకొచ్చావని జనసేన శ్రేణుల నిలదీత
రాళ్లు, కొబ్బరికాయలతో దాడి.. పగిలిన కారు అద్దాలు
జనసేన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టే వరకు వదలం
గొల్లప్రోలు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన వర్మ
కాకినాడ, సాక్షి: పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.
రాళ్లు, కొబ్బరి కాయలతో వర్మ కారుపై దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. వారి నుంచి తప్పించుకుని ఆయన కారులో వేగంగా వెళ్లిపోయారు. వర్మపై దాడి విషయం తెలియడంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా వారు శాంతించలేదు. జనసేన నేతల దాడి నుంచి తప్పించుకుని వచ్చిన వర్మ గొల్లప్రోలు– చేబ్రోలుకు మధ్యలో ఉన్న తన గెస్ట్‌హౌస్‌కు చేరుకోగా పోలీసులు ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేశారు.
నన్ను చంపడానికి ప్రయత్నించారు: వర్మ
ఎన్నికల్లో పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి వెళితే జనసేన శ్రేణులు తనపై దాడి చేశాయని టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ ఆరోపించారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు చిలకపూరి ప్రభాకరరావు పిలుపు మేరకు సర్పంచ్‌లు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేశారన్నారు. దీంతో తాను సర్పంచ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వన్నెపూడి వెళ్లానన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన మాజీ టీడీపీ నేతలు, ప్రస్తుతం అధికారం కోసం జనసేనలోకి వెళ్లిన కొందరు నేతలు తనపై దాడికి దిగారని ఆరోపించారు. తనపై ఇటుకలు, గాజు గ్లాసులు, డ్రింక్ సీసాలు, కంకర రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దాడిలో తనతో పాటు మరికొందరికి గాయాలయ్యాయన్నారు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ప్రయతి్నంచారని ధ్వజమెత్తారు. 9 నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని.. జనసేనకు పనిచేయడం తన ఖర్మ అని వ్యాఖ్యానించారు.
తనపై హత్యాయత్నం వెనుక ఉదయ్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేస్తున్నప్పుడు వన్నెపూడికి చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు 150 మంది తనకు రక్షణ వలయంగా ఉండడంతో తాను బయటపడ్డానన్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ గొల్లప్రోలు పోలీసు స్టేషన్ వద్ద వర్మ టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment