దేశంలో ఫర్నిచర్ ధరలు వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్లైవుడ్ తయారీదారులందరికీ ఐఎస్‌ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తా సంస్థ ‘మింట్’ నివేదించింది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్‌గా ప్రచారం చేసే ప్లైవుడ్‌కు ఆ మేరకు ఐఎస్‌ఐ సర్టిఫికేషన్ కూడా అవసరముంటుందని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.
ఫర్నిచర్, ఇతర వస్తువుల్లో ఉపయోగించే ప్లైవుడ్ నాణ్యత, మన్నికను మెరుగుపరచడం, సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా అవి ఎక్కువ కాలం ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, నేపాల్ నుంచి నాసిరకం ప్లైవుడ్ దిగుమతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ప్లైవుడ్ తయారీదారులు అన్ని గ్రేడ్ల ప్లైవుడ్‌కు ఫంగల్ నిరోధకత కోసం మైకోలాజికల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఈ నిబంధనపై ప్లైవుడ్ మేకర్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త ప్రమాణాలు ప్లైవుడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయని, వినియోగదారులతో పాటు తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.
అయితే ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ప్లైవుడ్ ధరలు 15 శాతం పెరుగుతాయని ఆల్ ఇండియా ప్లైవుడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ తివారీ తెలిపారు. నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తుల దిగుమతిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్లైవుడ్ తయారీదారులందరూ బీఐఎస్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా దీనిపై అటు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గానీ, బీఐఎస్ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు.
Comments
Please login to add a commentAdd a comment