దంపతుల మధ్య కలతల నేపథ్యంలో గ్రామంలో పంచాయితీ
చెల్లెలికి సర్దిచెప్పేందుకు కామారెడ్డి నుంచి వచ్చిన సోదరి
చూస్తుండగానే కాలువలోకి దూకిన చెల్లెలు... కాపాడేందుకు అక్క కూడా..
కమ్మర్‌పల్లి (నిజామాబాద్): వరద కాలువలో చెల్లెల్ని కాపాడబోయి అక్క నీట మునిగి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని గాం«దీనగర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గాం«దీనగర్‌కు చెందిన చిత్తారి రాజు, మంజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కాలనీకి చెందిన పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీకి కామారెడ్డి నుంచి మంజుల తండ్రితోపాటు ఆమె సోదరి పానేటి శ్యామల కూడా వచ్చారు.
పంచాయితీ జరుగుతున్న సమయంలో మంజుల ‘నేను చనిపోతా’అంటూ పరుగెత్తికెళ్లి కాలనీకి పక్కనే గల కాలువ వద్దకు వెళ్లి అందులో దూకింది. చెల్లెల్ని కాపాడేందుకు శ్యామల, కాలనీ వాసులు కూడా కాలువ వద్దకు వెళ్లారు. శ్యామల ధైర్యం చేసి కాలువలోకి దూకింది. కాలనీ వాసులు చీరను విసరగా మంజుల దాన్ని పట్టుకొని పైకి వచ్చింది. కానీ శ్యామల ప్రమాదవశాత్తు కాలువలో మునిగిపోయి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శ్యామల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment