సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా విద్యుత్ కోతలు విధించే అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయన్న ప్రచారం నేపథ్యంలో సీఎం గురువారం సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ప్రభుత్వం ఎలాంటి విద్యుత్ కోతలు విధించాలని ఆదేశించలేదని.. అనవసరంగా కోతలు పెట్టి రైతులను, ప్రజలను ఇబ్బందిపెడితే క్షమించేది లేదని హెచ్చ రించారు. అవసరానికి సరిపడా విద్యుత్ ఉందని, గతంతో పోలిస్తే సరఫరా పెరిగిందన్నారు. అయినా కూడా కోతలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని సీఎం పేర్కొన్నారు. ఇటీవల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపేసిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వ సిబ్బంది అత్యుత్సాహంతో..
ఇటీవల రాష్ట్రంలో మూడు సబ్‌స్టేషన్ల పరిధిలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని.. మిగతాచోట్ల ఎలాంటి ఇబ్బందీ లేదని ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీ ఈ సమీక్షలో వివరించారు. ఆయాచోట్ల సరఫరా లోపానికి కారణాలేమిటని సీఎం ప్రశ్నించగా.. సబ్‌స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సరిచూడాలని, అలా చేయకపోవడంతో సమస్య తలెత్తిందని సీఎండీ వివరించారు. దీంతో ఇలా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, ప్రకృతిపరమైన కారణాలు మినహా విద్యుత్ సరఫరాలో కోతలు ఉండొద్దని స్పష్టం చేశారు.
విద్యుత్ కోతలు విధించే పక్షంలో ముందుగా ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో కోతలు విధిస్తున్నట్టు తన దృష్టికి వచి్చందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సరిపడా విద్యుత్ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు సగటున 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామని.. గతేడాది ఇదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్ల సరఫరానే ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment