కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ బాధ్యత మళ్లీ త్రిసభ్య కమిటీకే
Breaking News
‘గద్దలకొండ గణేష్’ మూవీ రివ్యూ
Published on Fri, 09/20/2019 - 12:45
టైటిల్ : గద్దలకొండ గణేష్ (వాల్మీకి)
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్
తారాగణం : వరుణ్ తేజ్, అథర్వా, పూజా హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మాజి, తణికెళ్ల భరణి తదితరులు
సంగీతం : మిక్కీ జే మేయర్
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట
దర్శకత్వం : హరీష్ శంకర్
మెగా హీరో వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ.. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఎఫ్2 చిత్రంతో భారీ హిట్టు కొట్టిన వరుణ్.. మరో సక్సెస్ సాధించి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఓ తమిళ రీమేక్‌తో వచ్చాడు. రీమేక్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్.. తమిళ సినిమా జిగర్తాండను ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వాల్మీకిగా మలిచాడు. అయితే చివరి నిమిషంలో కోర్టు ఆదేశాల మేరకు సినిమా పేరును ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. మరి ఈ చిత్రం వరుణ్‌కు మరో విజయాన్ని అందించిందా? లేదా అన్నది చూద్దాం.
కథ
అభి (అథర్వా) దర్శకుడు కావాలని ప్రయత్నిస్తుంటాడు. రియలిస్టిక్గా ఉండేలా సినిమాను తెరకెక్కించేందుకు.. ప్రస్తుతం ఫామ్లో ఉన్న గ్యాంగ్స్టర్ కోసం వెతుకుంతుంటాడు. ఆ సమయంలో అతనికి గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) గురించి తెలుస్తుంది. అతనిపైనే సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. అయితే అతనికి ఎదురు తిరిగే వారిని, అతని గురించి ఆరా తీసేవారిని గణేష్ చంపుతూ ఉంటాడు. మరి గణేష్‌కు అభి ఎలా దగ్గరయ్యాడు.. అతనితో కలిసి సినిమాను ఎలా తెరకెక్కించాడు.. అందుకోసం అభి పడిన పాట్లు ఏమిటి? ఆ జర్నీలో గద్దలకొండ గణేష్ మారిపోయాడా? అన్నదే మిగతా కథ.
నటీనటులు
గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ జీవించాడు. ఆహార్యం నుంచి భాషపై పట్టువరకు.. ఆ పాత్రకు సరిపోయేట్టు తనను తాను మలుచుకున్నాడు. సినిమా అంతా తన భుజాలపైనే మోశాడు. వన్ మ్యాన్ షోగా స్క్రీన్‌పై నటించాడు. గద్దలకొండ గణేష్‌గా నవ్వించడమే కాదు.. ఏడ్పించేశాడు. నటుడిగా మరో మెట్టు ఎక్కాడని ఈ చిత్రంతో మరోసారి చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా అభి పాత్ర గురించి చెప్పుకోవాలి. తమిళ హీరో ఆ క్యారెక్టర్‌ను పోషించడంతో.. తెలుగు ప్రేక్షకులకు అంతగా అంచనాలు ఉండవు. అయితే అథర్వా అభి పాత్రకు చక్కగా సరిపోయాడు. ఇక మున్ముందు కూడా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తాడేమో చూడాలి. పూజా హెగ్డే ఉన్నంతలో ఆకట్టుకుంది. శ్రీదేవీ పాత్రలో అందంతో అందర్నీ కట్టిపడేసింది. ఇక మృణాళినీ కూడా పర్వాలేదనిపించింది. తణికెళ్ల భరణికి ఉన్నవి రెండు మూడు సీన్లే అయినా.. కంటతడి పెట్టించాడు. బ్రహ్మాజీ, సత్య, ఫిష్ వెంకట్, శత్రు ఇలా మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ
సినిమాకు కథే ముఖ్యం. ఇదే విషయం వాల్మీకితో మరోసారి రుజువైంది. అయితే ఈ కథ ఇక్కడ పుట్టింది కాదు. తమిళ నాట సూపర్ హిట్‌గా నిలిచిన జిగర్తాండ చిత్రానిది ఈ కథ. టైటిల్ క్రెడిట్స్‌లో కథా రచయిత కార్తీక్ సుబ్బరాజు వేయడంతోనే ఈ కథకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. అక్కడి ప్రేక్షకులకు ‘జిగర్తాండ’ నచ్చినట్టే.. ఇక్కడి ప్రేక్షకులకు ‘గద్దలకొండ గణేష్’ నచ్చుతుంది. మన తెలుగు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు తీయడంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.
అయితే అక్కడ బాబీ సింహా పోషించిన పాత్రను.. ఇక్కడ వరుణ్‌తేజ్ పోషించడంతో కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. తెలుగులో వరుణ్‌కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆ మార్పులూ అనివార్యమే. అక్కడ బాబీ సింహా పాత్ర జోకర్‌లా మార్చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఇక్కడ మాత్రం వరుణ్ పాత్రను హైలెట్ చేశారు. గద్దలకొండ గణేష్ హీరోగా తీసిన ‘సీటీమార్’ సినిమాను జనమంతా పగలబడి నవ్వుతున్నారు? కానీ ఎందుకు అని వాల్మీకి చూసిన సగటు ప్రేక్షకుడికి తెలియదు. గద్దలకొండ గణేష్ బయోపిక్‌గా తెరకెక్కిస్తే అది గొడవలతో నిండి ఉండాలి కానీ.. కామెడీ ఎంటర్‌టైనర్ ఎలా అయిందనే అనుమానాలు రాక మానవు. ఇవే హరీష్ శంకర్ వదిలేసిన సన్నివేశాలు. ఇక్కడే ఇంకాస్త ఆలోచిస్తే.. సినిమాలో ఇంకా వినోదాన్ని పెంచే అవకాశం ఉండేది. అయితే తమిళ సినిమాను చూసిన ప్రేక్షకులకు మాత్రమే అలాంటి ఫీలింగ్ కలిగే అవకాశముంది.
అయితే సినిమాను ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన హరీష్.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నట్లే కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తర్వాత చెప్పుకోవల్సింది మిక్కీ జే మేయర్. పాటలే కాదు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. గద్దలకొండ గణేష్ పాత్ర అంతగా పండిందంటే.. మిక్కీ అందించిన నేపథ్య సంగీతం కూడా అందుకు ఓ కారణం. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ
వరుణ్ తేజ్
సంగీతం
మైనస్ పాయింట్స్
కథలో చేసిన మార్పులు
నిడివి
బండ కళ్యాణ్, సాక్షి వెబ్ డెస్క్.
Tags