సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: గోదారోళ్ల కితకితలు పేరుతో ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్ గ్రూప్ ఆదివారం నిర్వహించిన నాలుగో ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు ఏడు వేల మంది హాజరవడంతో భారత్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు సుబ్బరాజు తోటలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్ చీఫ్ ఎడిటర్ కె.అన్నపూర్ణ.. గ్రూప్ అడ్మిన్ ఈవీవీ సత్యనారాయణకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
సుబ్బరాజుగారితోటలో...
‘గోదారోళ్ల కితకితలు’ ఫేస్‌బుక్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బొమ్మూరు జీపీఆర్ రోడ్డులోని సుబ్బరాజుగారితోటలో ఉత్సాహంగా జరిగింది. వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు ఏడువేల మంది ఈ కార్యక్రమానికి తరలిచ్చారు. బొమ్మూరు గ్రామానికి చెందిన ఈవీవీ సత్యనారాయణ 2015లో ఈ ఫేస్‌బుక్ గ్రూపును ప్రారంభించారు. మగవారు పట్టుపంచె, కండువా, ఆడవారు పట్టుచీరలు ధరించి హాజరయ్యారు. గోదావరి జిల్లాల ప్రత్యేకమైన తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకు, పెనుగొండ గజ్జికాయ, వివిధ రకాల పిండి వంటకాలను తయారీ చేసి గ్రూపు సభ్యులకు అందుబాటులో ఉంచారు. చిన్నారుల ఆడుకునేందుకు వివిధ రకాల ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్ మిత్రులు ఫొటోలు దిగేందుకు పూలతో వివిధ రకాల ఆకృతులను అందంగా అలంకరించారు. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నాం భోజనం వరకు గోదావరి రుచులను ఆత్మీయతతో కొసరి కొసరి వడ్డించారు. వివిధ రకాల తెలుగు వంటకాలను ఫేసుబుక్ మిత్రులకు రుచి చూపించారు.
ఇది నాలుగో సమ్మేళనం
గోదారోళ్ల కితకితలు నాలుగో ఆత్మీయ సమ్మేళనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గోదావరి ప్రాంత, యాస, హాస్యంతో బాబోయ్ ఇంక నవ్వలేం అన్నట్టుగా సాగింది. కితకితల సభ్యుల కలయిక. కేవలం ఫేస్‌బుక్‌లో మాత్రమే పోస్టింగులు చేసుకునే వీరంతా ప్రత్యక్షంగా కలవడంతో ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. గోదారోళ్ల కితకితలుపై వెటర్నరీ డాక్టర్ కోటి కాపుగంటి రాసిన పాటల సీడీని తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మొదట సీడీని ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజుకు అందజేశారు.
గ్రూపు సభ్యురాలికి సీమంతం
గ్రూపులోని సభ్యురాలైన రావులపాలెంనకు చెందిన గర్భిణి కల్యాణికి సీమంతం నిర్వహించారు. ముందుగా ఈవీవీ సత్యనారాయణ దంపతులు, అనంతరం గ్రూపుసభ్యులు అక్షింతలు వేసి ఆశీర్వాదించారు. సారి పెట్టి శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనూహ్య స్పందన
గోదారోళ్ల కితకితలు ఫేస్‌బుక్ గ్రూప్ సభ్యుల ఆత్మీయ కలయికకు సభ్యుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మన యాసపై ఉన్న మమకారంతో 2015లో గ్రూపును ప్రారంభించాను. ఇప్పటికి 1,16,127 మంది సభ్యులున్నారు. నాలుగోసారి నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం భారత్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు కావడం చాలా ఆనందంగా ఉంది.
– ఈవీవీ సత్యనారాయణ, గ్రూప్ క్రియేటర్, బొమ్మూరు
కలయిక అపూర్వం
సోషల్ మీడియా ద్వారా ఇందరు ఒకే చోట కలవడం అపూర్వం. గోదావరి హాస్యానికి, యాసకు పెద్దపీట వేస్తూ గ్రూపు ముందుకు సాగడం అభినందనీయం. గ్రూపులో సభ్యుడిని కావడం ఆనందంగా ఉంది.
– ఇరవ వెంకటసుబ్రహ్మణ్యం, హైదరాబాద్
తప్పకుండా వస్తాం
గోదారోళ్ల కితకితలు ఫేస్‌బుక్‌లో నేను కూడా ఓ అడ్మిన్. బంధువుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు వీలులేకపోతే మానేస్తాం గానీ, ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాత్రం రాకుండా ఉండం. ముందు నుంచే ఇంటిలో వారికి నచ్చచెప్పి వచ్చి సొంతి ఇంటిలో పండగలా నిర్వహిస్తాం. బంధువులు కంటే ఈ ఫేస్‌బుక్‌లోనే మిత్రులు ఆత్మీయులుగా ఉంటాం.
– బోయపాటి పద్మ, హనుమాన్ జంక్షన్
బంధాలు పెరుగుతాయి
ఆత్మీయ కలయిక ద్వారా బంధాలు పెరుగుతాయి. వేలాదిమంది తరలిరావడమే ఇందుకు నిదర్శనం. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తాం. అక్కా, బావ.. పిలుపులే మా గ్రూపులో వినిపిస్తాయి. దేశవ్యాప్తంగా మా గ్రూపులో వేల మంది సభ్యులున్నారు.
– అన్నందేవుల దేవీలక్ష్మీ, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment