కమ్మని కళాఖండాలు | Great Artifacts | Sakshi
Sakshi News home page

కమ్మని కళాఖండాలు

Published Fri, Apr 27 2018 2:01 PM | Last Updated on Fri, Apr 27 2018 2:01 PM

Great Artifacts - Sakshi

జగన్నాథునికి తాటాకులతో తయారైన కిరీటాలు

ఎండాకాలం వస్తే.. విసనకర్రలతో విసురుకునేవారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేవారు. ఇవన్నీ ఒకనాటి రోజులు.. ఫ్యాన్లు, ఏసీలు వచ్చాక విసనకర్రలు అదృశ్యమయ్యాయి. ఇప్పుడవే తాటి కమ్మలతో దేవతామూర్తుల కిరీటాలు తయారవుతున్నాయి. సంప్రదాయ బొమ్మలు రూపొందుతున్నాయి. వాటికి అవసరమైన బొమ్మ కమ్మలు కొత్తవలస మండలం నుంచే ఎగుమతి అవుతున్నాయి. వియ్యంపేట పంచాయతీ కొటానవాని పాలెంకి చెందిన కొమ్మాది సూరిబాబు కుటుంబం బొమ్మ కమ్మల తయారీతో ఉపాధి పొందుతోంది. 

 కొత్తవలస రూరల్‌ : కొమ్మాది సూరిబాబు కుటుంబం ఇరవయ్యేళ్లుగా బొమ్మ కమ్మలను తయారు చేస్తూ కోల్‌కత్తా, చెన్నై నగరాలకు ఎగుమతి చేస్తోంది. సూరిబాబు మంచి క్రికెట్, కబడ్డీ క్రీడాకారుడు కూడా. విశాఖ జిల్లా కండిపల్లి, రాజాగూడెం, విజయనగరం జిల్లా కొటానివానిపాలెం, బల్లంకి, శ్రీకాకుళం జిల్లా దొడ్డిపల్లి, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తదితర ప్రాంతాలు బొమ్మ కమ్మల తయారీకి ప్రసిద్ధి చెందాయి. వీటిని కోల్‌కత్తా, చెన్నై నగరాల్లో సంప్రదాయ బొమ్మల తయారీలో వినియోగిస్తారు. దేవతామూర్తుల కిరీటాలను తయారు చేస్తారు.

దళారుల బెడద

గిరాకీ ఉన్న బొమ్మ కమ్మల తయారీలో భార్యాబిడ్డలతో సహా శ్రమిస్తున్నా గిట్టుబాటు రావడం లేదు. మధ్యవర్తులే లాభాలు దోచుకుంటున్నారు. మొదటి నుంచి ఇదే పని నమ్ముకోవటంతో వదల్లేక అరటి మట్టలు, ఉపాధి పనులు చేసుకుంటున్నాం. వేసవిలో కమ్మ దొరక్కపోతే ఉపాధి పనులు, మామిడి పండ్ల విక్రయంతో కాలక్షేపం చేస్తున్నాం. అరటి తొండాలను కూడా తెచ్చి ఎండబెట్టి ఎగుమతి చేస్తుంటాం. – సూరిబాబు

బొమ్మ కమ్మలు ఎలా చేస్తారంటే..

మెక్క తాటిచెట్ల నుంచి లేత తాటాకుల్ని స్థానికులు కొట్టి తెచ్చి వీరికి అమ్ముతారు. ఒక్కొక్క మోపులో వెయ్యి ఆకులుంటాయి. వీటిని సూరిబాబు కుటుంబం రూ.400కు కొంటుంది. వీటిని ఒకటి లేదా రెండు రోజులు ఆరబెడతారు. వాటిని ఇద్దరు బొమ్మ కమ్మలుగా కత్తిరిస్తారు. వాటిని మర్నాడు వంగిపోకుండా మడతబెడతారు. వెయ్యికమ్మలు ఒక మూటగా కట్టి విశాఖ జిల్లా వేపగుంట సమీపంలోని సింహాద్రినగర్‌ వ్యాపారి లారీల్లో లోడ్‌ చేస్తారు. అక్కడి నుంచి కోల్‌కత్తా, చెన్నై తదితర ప్రాంతాలకు రవాణా చేస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement