సాక్షి, హైదరాబాద్: రోజుకో అబద్ధం, నిమిషానికో పేదవాడికి అన్యాయం చేస్తూ ప్రజాధనాన్ని దిగమింగుతూ సీఎం చంద్రబాబునాయుడు మోసపూరిత పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాంధీ జయంతి రోజున చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ తూ.చ. తప్పకుండా పాటిస్తుంటే ఆరోజున కూడా అబద్ధాల్లో అంతులేకుండా మాట్లాడి చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుకెక్కుతున్నారని ఎద్దేవా చేశారు. నోటికి వచ్చిన మాటల్ని చంద్రబాబు మాట్లాడటంపై ఆమె అశ్చర్యం వ్యక్తంచేశారు.
వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలని చంద్రబాబు చెప్పడాన్ని దుయ్యబట్టారు. తన సొంత ఐదారు నివాసాలకు, గెస్ట్ హౌస్‌లకు మరమ్మతుల పేరుతో వందలకోట్ల ప్రభుత్వ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప బాబు పేదవాడికి ఒక్క ఇళ్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. చంద్రబాబు ఇంటికి ప్రజాధనంతో వందల కోట్లు ఖర్చుపెట్టి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని.. మీడియాను కూడా ఆ ఇంట్లోకి అనుమతించలేదన్నారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించారని.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోనే 27 లక్షల వరకు నిర్మించారని పద్మజ గుర్తుచేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని లక్షల ఇళ్లు కట్టించలేదన్నారు. ఏడాదికి 10వేల ఇళ్లు కూడా కట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న చంద్రబాబు.. రాబోయే ఏడాదిలో 17లక్షల ఇళ్లు కడతానని చెప్పడం పచ్చి మోసం, దగాయేనని చెప్పారు. ఎన్నికల కోసం బాబు మళ్లీ అబద్ధాలు మొదలుపెట్టాడన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? ఎందుకు పదే పదే అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 3సెంట్ల భూమిలో లక్షన్నర ఇళ్లు కట్టిస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా దాని ఊసేలేకపోగా.. నిర్మాణంలో ఉన్న వాటిని కూడా అపేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.
నాలుగు బడ్జెట్‌లలో ఇళ్ల నిర్మాణానికి ఏ మాత్రం కేటాయింపులు జరపుకుండా, 2014వరకు జరిగిన ఇళ్ల నిర్మాణాలు కూడా నిలిపేయాలని ఆదేశాలిచ్చిన సీఎం ఒక్క చంద్రబాబు మాత్రమేనని ఆమె మండిపడ్డారు. ఏడాదిలోగా ఎప్పుడైనా ఎన్నికలొచ్చే అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వమే భూములిచ్చి లక్షన్నరతో ఇళ్లు కట్టిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చెప్పి నాలుగేళ్లు అవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. మరోవైపు నిర్మాణదశలో ఉన్న ఇళ్లను కూడా ఆపేసిన చంద్రబాబు.. గాంధీ జయంతి రోజున అబద్ధాలు వల్లె వేయటంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్ష గృహప్రవేశాలు చేశాను, మరో 17లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
కుమారుడు లోకేశ్‌కి మంత్రి పదవి ఇవ్వటంలో చూపిన శ్రద్ధ బాబుకు పేదలపై లేదని పద్మజ విమర్శించారు. సొంత ఆస్తుల మరమ్మతులకు వందల కోట్లు ఖర్చుచేసి.. ఆ ఇంట్లో కుటుంబాన్ని ఉంచకుండా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ప్రభుత్వ ధనంతో అద్దెలు కడుతూ దుర్వినియోగం చేస్తున్నారని పద్మజ నిప్పులు చెరిగారు. పేదల పట్ల చంద్రబాబుకు మొదటి నుంచి చిత్తశుద్దే లేదన్నారు. ఏడాదికి 5లక్షల పైచిలుకు పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ పాలనకు, కేవలం 10వేల ఇళ్లు కూడా చేపట్టని బాబు పాలనకు వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.
గ్రాఫిక్స్‌లో రాజధానిని చూపించినట్టే, రాబోయే ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు బాబు మళ్లీ పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు విజయవాడలో కృష్ణానది ఒడ్డున అక్రమ నిర్మాణంలో నివాసముంటూ నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లాంఘించారని పేర్కొన్నారు. కోర్టు నోటీసులు అందుకున్నాక సమాధానం దాటవేశారన్నారు. బాబు ఇళ్లపై, ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేపడితే ఆయన బండారం బయటపడుతుందన్నారు. ఏ ఇంట్లో ఉండేందుకు చంద్రబాబు అర్హుడు కాదని, జైలులే ఉండేందుకే ఆయన అర్హుడని పద్మజ విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని పద్మజ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment