నిపుణన్ సక్సెస్ మీట్
తమిళసినిమా: దక్షిణాదిలో యాక్షన్ కింగ్‌గా ముద్ర వేసుకుని కథానాయకుడిగా 150 చిత్రాల మైలురాయి చేరుకున్న నటుడు అర్జున్. నటుడిగానే కాకుండా, నిర్మాత, దర్శకుడిగానూ సత్తా చాటుకున్న ఈయన తాజాగా నటించిన నిపుణన్ చిత్రం 150వ చిత్రంగా నమోదు చేసుకుంది. ఇందులో అర్జున్‌తో పాటు ప్రసన్న, నటి వరలక్ష్మీశరత్‌కుమార్, వైభవ్, కృష్ట వంటి యువ నటీనటులు నటించారు. అరుణ్‌వైద్యనాథన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం గతవారం తెరపైకి వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్‌వైద్యనాథన్ మాట్లాడుతూ నిపుణన్ చిత్ర కథను తయారు చేసుకున్నప్పుడే మంచి చిత్రం అవుతుందనే నమ్మకం కలిగిందన్నారు. నటుడు అర్జున్ 150వ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తనతో పనిచేసిన కళాకారులు, సాంకేతిక వర్గం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాత ఉమేష్ మాట్లాడుతూ చిత్రం చూసిన పత్రికల వారి అభిప్రాయం, ప్రేక్షకుల అభిప్రాయం ఒకటే కావడంతోనే ఈ నిపుణన్ ఇంత విజయం సాధించిందని పేర్కొన్నారు.
చిత్ర హీరో అర్జున్ మాట్లాడుతూ నిపుణన్ చిత్ర సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు అరుణ్‌వైద్యనాథన్ నిపుణన్ చిత్ర స్క్రిప్ట్‌ను చెప్పిన విధంగానే తెరకెక్కించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రంలో తనతో పనిచేసిన కథాకారులకు, అదే విధంగా తన 150 చిత్రాలకు పనిచేసిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.
ఇకపై కూడా నటుడిగా కొనసాగాలనుకుంటున్నానని, నిపుణన్ లాంటి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నానని అర్జున్ పేర్కొన్నారు. అదే విధంగా దర్శకుడిగా ప్రముఖ హీరోలతో పనిచేయాలని కోరుకుంటున్నానని, అలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. కాగా ప్రస్తుతం ఈయన తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా సొల్లివిడవా అనే పేరుతో ఒక యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో తాను ఒక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు అర్జున్ వెల్లడించారు.