బాలీవుడ్ హీరోల భార్యలకు లేఖలు
బాలీవుడ్ నటుల భార్యలకు ఢిల్లీ ప్రభుత్వం లేఖలు రాస్తోంది. షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, అర్బాజ్ ఖాన్, గోవిందా.. వీళ్లందరి భార్యలకు లేఖలు రాసిన ఢిల్లీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ.. వాళ్లను పాన్ మసాలా ఉత్పత్తుల ప్రకటనలలో నటించొద్దని కోరాలని అడుగుతోంది. ఈ ఉత్పత్తుల వల్ల కేన్సర్ వస్తుందని, అందువల్ల ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా వాళ్లను ఆ ప్రకటనలలో నటించొద్దని కోరాలని ఆ లేఖలలో పేర్కొన్నారు. షారుక్ భార్య గౌరీఖాన్‌కు ఈ మేరకు ఓ లేఖ వెళ్లింది. ఆమెతోపాటు ఇతర హీరోల భార్యలకు కూడా ఈ తరహా లేఖలు వెళ్లాయి. ఇంతకుముందు షారుక్ ఖాన్‌కు కూడా ఈ ప్రకటనలలో నటించొద్దంటూ ఓ లేఖ రాశామని, కానీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, అందుకే ఇప్పుడు మీకు లేఖ రాయాల్సి వచ్చిందని గౌరికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
పొగాకు లేదా నికోటిన్ లేని పాన్ మసాలాలో కూడా తప్పనిసరిగా సుపారీ ఉంటుందని, దానివల్ల కూడా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇంతకుముందు బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌కు కూడా పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్రకటనలలో నటించొద్దని కోరుతూ ఇలాంటి లేఖనే రాశారు.