రాకుమారుడు ఉన్నాడు | Sakshi
Sakshi News home page

రాకుమారుడు ఉన్నాడు

Published Thu, Sep 12 2019 1:22 AM

Taapsee Pannu opens up on relationships - Sakshi

ఒక కప్పను ఓ యువరాణి ముద్దాడితే ఆ కప్ప అందాల రాకుమారుడిగా మారిపోయింది. పట్టరానంత సంతోషంతో రాణి మైమరచిపోయింది. ఇది కథ అని చాలామందికి తెలుసు. అప్పటినుంచి కూడా ‘ఒక రాకుమారుడిని పొందాలంటే ఎన్నో కప్పలను ముద్దాడాలి’ అనేది వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే మాటను తాప్సీ చెబుతున్నారు. ‘‘నా రాకుమారుడు దొరకడానికి నేను ఎన్నో కప్పలను ముద్దాడాను’’ అంటూ తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టారీ బ్యూటీ.

అయితే ఆ రాకుమారుడి పేరు మాత్రం చెప్పలేదు. దాదాపు నాలుగైదేళ్లుగా డెన్మార్క్‌కి చెందిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో తాప్సీ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పిన తాప్సీ, ‘‘చాలామంది ఊహిస్తున్నట్లు అతను ఆ వృత్తి (ఓ క్రికెటర్‌తో తాప్సీ లవ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది)కి సంబంధించినవాడు కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో ఎవరున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంది. అతను నటుడు కాదు.. క్రికెటర్‌ కాదు. అసలు ఇక్కడివాడు కాదు’’ అన్నారు తాప్సీ.

‘‘నాకు పిల్లలు కావాలనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అయితే ఘనంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఒకే రోజులో పెళ్లి వేడుక ముగించేయాలనుకుంటున్నాను. పెళ్లి పేరుతో రోజుల తరబడి వేడుకలు చేసుకోవడం నాకిష్టం లేదు’’ అని కూడా తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘తప్పాడ్‌’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ‘షూటర్స్‌’ చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌ జీవితాల ఆధారంగా తీసిన ‘సాండ్‌ కీ ఆంఖ్‌’లో ప్రకాశీ పాత్ర చేశారు తాప్సీ. ఈ చిత్రం వచ్చే నెల 25న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement