రణబీర్ కపూర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌పై పుణె సివిల్ కోర్టులో దావా దాఖలైంది. కల్యాణి నగర్‌లోని ట్రంప్ టవర్‌లో గల రణబీర్ కపూర్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న సూర్యవంశీ అనే మహిళ రణబీర్‌పై 50 లక్షల రూపాయలకు దావా వేశారు. రెంటల్ అగ్రిమెంట్ నియమాలను రణబీర్ ఉల్లంఘించాడంటూ సదరు మహిళ ఈ దావా వేశారు. అగ్రిమెంట్ వ్యవధి కంటే ముందే తనను ఇల్లు ఖాళీ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నట్టుండి తన కుంటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించడంతో తీవ్ర ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని వాపోయారు.
వివరాలు: 2016 అక్టోబర్‌లో ‘లీవ్ అండ్ లైసెన్స్’ ప్రాతిపదికన రణబీర్ తన అపార్ట్‌మెంట్‌ను సూర్యవంశీకి నెలకు 4 లక్షల రూపాయల చొప్పున 24 నెలల కాలానికి అద్దెకు ఇచ్చారు. కానీ, అనుకోకుండా 11 నెలలు కాగానే ఇల్లు ఖాళీ చేయాలని రణబీర్ పట్టుబట్టాడని ఆమె వెల్లడించారు. చివరికి 2017 అక్టోబర్‌లో బలవంతంగా అపార్ట్‌మెంట్ ఖాళీ చేయించారని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్ ఖాళీ చేయండని రణబీర్ వాళ్లు మాతో అమర్యాదగా ప్రవర్తించారని సూర్యవంశీ కోర్టుకు విన్నవించారు. కాగా, మెయిల్ ద్వారా కోర్టు నోటీసులు అందుకున్న రణబీర్ స్పందిస్తూ.. తాను రెంటల్ అగ్రిమెంట్ నియమాలను ఉల్లంఘించలేదని అన్నారు. ఇష్టపూర్వకంగానే సూర్యవంశీ ఇల్లు ఖాళీ చేశారని ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. కోర్టులో తన వాదనలు వినిపిస్తానని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment