235 మందితో అఖిలేశ్ జాబితా
► అనుకూల వర్గం పేర్లతో విడుదల
► ఎస్పీలో మళ్లీ రాజకీయ ముసలం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో చీలిక అనివార్యమైనట్లు కనబడుతోంది. తండ్రి (ములాయం), కుమారుడు (అఖిలేశ్) మధ్య వివాదం మరింత ముదిరింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో తన వర్గానికి ములాయం మొండిచేయి చూపటంపై సీఎం అఖిలేశ్ బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. తన వర్గం నేతలతో కలిసి 235 మంది సభ్యులతో జాబితాను విడుదల చేసి సోషల్ మీడియాలో ఉంచారు. అఖిలేశ్‌కు సన్నిహితంగా ఉన్నందుకు ములాయం జాబితాలో చోటు దక్కించుకోని వారంతా కొత్త లిస్టులో స్థానం సంపాదించారు. అంతకుముందు అఖిలేశ్ తన వర్గం నేతలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తను ప్రత్యేకంగా చెప్పిన వారినీ కావాలని తప్పించటంపై ములాయం వర్గం నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ‘మాకు అఖిలేశ్ ఆశీర్వాదాలు ఉన్నాయి. ములాయం మా నేత. కానీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రజలకు అఖిలేశ్ అవసరం. అతనిపై కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. 2019లో ములాయంను ప్రధానిగా చూడాలనుకుంటున్నాం. మమ్మల్ని ప్రచారం చేసుకోమని అఖిలేశ్ చెప్పారు’అని సీఎం వర్గం నేత చెప్పారు. మొత్తం 403 సీట్లకు గాను 325 స్థానాలకు ములాయం అభ్యర్థులను ప్రకటించగా.. అందులో సీఎం అనుకూల మంత్రులతోపాటు 50 మంది ఎమ్మెల్యేల పేర్లు లేవు.
శివ్‌పాల్ మద్దతుదారుల తొలగింపు
కాగా అఖిలేశ్ తన మద్దతుదార్ల పేర్లు జాబితాలో లేనందుకు ప్రతీకార చర్యగా శివ్‌పాల్ మద్దతుదారులిద్దరిని పదవుల నుంచి తొలగించారు. యూపీ ఆవాస్ వికాస్ పరిషత్ వైస్ చైర్‌పర్సన్ గా ఉన్న సురభి శుక్లా, ఆమె భర్త, రాజకీయ నిర్మాణ నిగమ్ సలహాదారుగా ఉన్న సందీప్ శుక్లాలను ఆయా పదవుల నుంచి తొలగిస్తున్నట్లు సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.