బాహాబాహీకి దిగిన టీడీపీ–జనసేన నేతలు
పింఛన్ల పంపిణీ విషయంలో పైడిచింతపాడులో కొట్టుకున్న ఇరువర్గాలు
నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ నేతల సమావేశం
పిఠాపురంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ.. ఎక్కడికక్కడ ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరు
సాక్షి, అమరావతి/పిఠాపురం: పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం రెండు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహించిన ఎన్డీఏ పార్టీల విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు తలపడ్డారు. టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ, జనసేన ఇన్‌ఛార్జి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ సమక్షంలోనే ఇరుపార్టీల నేతలు ఒకరినొకరు తోసుకుని గందరగోళం సృష్టించడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి ఎవరికి వారు వెళ్లిపోయారు.
అలాగే, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవికి వ్యతిరేకంగా ‘క్విట్ నెల్లిమర్ల’ అంటూ టీడీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇక ఏలూరు జిల్లా పైడిచింతపాడులో పింఛన్ల పంపిణీపై టీడీపీ, జనసేన నేతలు ఘర్షణపడి కొట్టుకున్నారు. చివరికి.. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోగా, జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గందరగోళంగా మారింది. ఇలా రెండు పార్టీల నేతలు తమదే పైచేయి కావాలని వివిధ నియోజకవర్గాల్లో పోటీపడుతూ.. ఘర్షణలకు దిగుతూ రభస సృష్టిస్తున్నారు.
పైడిచింతపాడులో దాడికి దిగిన తెలుగు తమ్ముళ్ళు, జనసేన కార్యకర్తలు
పిఠాపురంలో కండువాలు, ఫొటోల గోల..
పిఠాపురంలో శుక్రవారం కూటమి బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పరిచయ సమావేశం కూటమి నేతల బాహాబాహీకి వేదికగా మారిపోయింది. వేదికపై వేసిన ఫ్లెక్సీలో టీడీపీ నేత వర్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌లవి పెద్ద ఫొటోలు వేసుకుని జనసేన ఇన్‌చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌ది చిన్నఫొటో వేయడంపై జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. సమావేశంలో కురుమళ్ల మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థి మూడు పార్టీల కండువాలు వేసుకున్నారుగానీ వచ్చిన టీడీపీ నేతలు కేవలం వారివారి పార్టీ జెండాలే వేసుకున్నారన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరూ ఇకే మాటపై ఉంటుంటే ఇక్కడ మాత్రం టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తూ జనసేనను తొక్కేయాలని చూస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జనసేన పనిచేస్తోందా?.. మరి పిఠాపురంలో టీడీపీ ఎందుకు జనసేన, పవన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ కురుమళ్ల ప్రశ్నించడంతో గందరగోళం మొదలైంది. దీంతో టీడీపీ నేతలు అరుపులు, కేకలతో వేదికపైకి దూసుకురావడంతో రెండు పార్టీల నేతల కార్యకర్తల మధ్య తోపులాట, తన్నులాట చోటుచేసుకుంది. రెండు పార్టీల నేతలు తమ కార్యకర్తలను అదుపుచేసేందుకు ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వర్మ, రాజశేఖర్, మర్రెడ్డి శ్రీనివాస్ అక్కడ నుంచి నిష్క్రమించారు.
పింఛన్ల పంపిణీ కోసం డిష్యూం డిష్యూం..
మరోవైపు.. పింఛన్ల పంపిణీ కోసం గురువారం దెందులూరు నియోజకవర్గం, కొల్లేరు గ్రామం పైడిచింతపాడు టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్లాటకు దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అనంతరం.. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరి పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వాస్తవానికి.. గ్రామ టీడీపీ నాయకుడు సైదు సత్యనారాయణ వర్గీయులు దీపావళి రోజున వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్ధపడగా విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, గ్రామ సర్పంచ్ ముంగర తిమోతీ, మోరు సుబ్బారావు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు తదితరులు సచివాలయానికి చేరుకున్నారు. తాములేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
పెద్దలు సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జనసేన నాయకుడు ముంగర వెంకటేశ్వరరావు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇందులో గాయపడిన జనసేన కార్యకర్తలు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఎంఎల్‌సీ (మెడికో లీగల్ కేసు) కట్టాలని పోలీసులను కోరారు. అదే సమయంలో టీడీపీ వారు సైతం ఆస్పత్రికి చేరుకుని, తమకు గాయాలయ్యాయని, ఎంఎల్‌సీ కట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు టీడీపీ నాయకులకే వత్తాసు పలికి వారి ఫిర్యాదు మేరకు ఎంఎల్‌సీ కట్టారు. దీంతో జనసేన నేతలు విజయవాడ వెళ్లి అక్కడ ప్రభుత్వాస్పత్రిలో చేరి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ నేతల చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏలూరు రూరల్ పోలీసులు జనసేన నేతలను అదుపులో తీసుకున్నారు.
నెల్లిమర్ల ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ నేతలు
ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి.. టీడీపీ నేత, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఆమెకు వ్యతిరేకంగా బంగర్రాజు శుక్రవారం టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి ఆమె నియోజకవర్గాన్ని విడిచి వెళ్లిపోవాలని హడావుడి చేశారు. ఆమె తీరుతో నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత లేకుండాపోయిందని వాపోతున్నారు. నిజానికి.. రెండ్రోజుల క్రితం నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి, బంగర్రాజు మధ్య హాట్‌హాట్‌గా వాగ్వివాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment