ఐదేళ్లు వివక్ష లేకుండా అందించిన పెన్షన్లకు రాజకీయ రంగులు
పేరుకు మాత్రమే సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ
కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే అంతా.. ఆధిపత్యం చాటుకునేందుకు టీడీపీ – జనసేన ఆరాటం
ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలంటూ టీడీపీ పట్టు
తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని ఆదేశం
సాక్షి, అమరావతి/విజయనగరం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్‌గా, పారదర్శకంగా అందించిన పెన్షన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పెన్షన్ పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇదే సమయంలో కూటమి కార్యకర్తల్లో ఆధిపత్య పోరు కూడా కనిపించింది.
కాగా, పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూటమి నేతల్లో చిచ్చు రాజేసింది. రాష్ట్రంలో ఏ కార్యక్రమమైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేస్తున్నారు. తోక పార్టీ నాయకులు పెన్షన్లు పంపిణీ చేయడానికి వీల్లేదంటూ జనసేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, పెన్షన్ల పంపిణీ సందర్భంగా విజయనగరం జిల్లాలో కూటమి నేతల్లో ఆధిపత్య పోరు బహిర్గతమైంది.
గత ఐదు సంవత్సరాలు ఎటువంటి రాజకీయ రంగు అంటని పెన్షన్ల కార్యక్రమం..
నేడు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పైచేయు కోసం టీడీపీ మరియు జనసేన నాయకుల ముష్టి ఘాతాలు
జనసేన వీర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులు.
#AndhraPradesh #YSRCP #YSJagan pic.twitter.com/qiVmB5Nvzy— Jagananna Connects (@JaganannaCNCTS) July 1, 2024
టీడీపీ, జనసేన నాయకులు ఆధిపత్యం రుజువు చేసుకునేందుకు యత్నించడంతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని కొన్నివార్డుల్లో పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది. పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి అందించాల్సి ఉండగా కూటమి నాయకులు ఒకచోట కూర్చొని పంపిణీ చేపట్టారు. వైఎస్సార్ నగర్‌లోని కొన్ని వీధుల్లో జనసేన, మరికొన్ని చోట్ల టీడీపీ నాయకులు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇక్కడ జనసేన నాయకులు పంపిణీ చేస్తున్న పెన్షన్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
ఏదైనా తమ ఆధ్వర్యంలోనే జరగాలని, తోక పార్టీ నాయకులు పంపిణీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వారిని ప్రశ్నించిన జనసేన మహిళా కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడిచేశారు. ఈ ఘటనతో పింఛనుదారులు భయాందోళనలకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం రావడంలో జనసేనదే ముఖ్యపాత్రని, తమను అడ్డుకోవడమేంటని కొందరు జనసేన నాయకులు ప్రశ్నించడంతో వివాదం నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, ఉదయం ఐదు గంటలకే వలంటీర్లు ఇంటిగుమ్మం వద్దకు వచ్చి పెన్షన్లు అందించారని లబ్ధిదారులు గుర్తు చేసుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment