నన్ను ఇన్వాల్వ్ చేయకండి..
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం అనంతరం మళ్ళీ అధ్యాపక వృత్తిలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. సెప్టెంబర్ 4 తో ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆయన తిరిగి అధ్యాపక వృత్తిలోకి వెడతారని సహచరులతో చెప్పినట్లుగా వచ్చిన వార్తలపై స్పందించారు. బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో అదేవిషయంపై వ్యాఖ్యానించారు. తనను అనవసర విషయాల్లోకి లాగొద్దని, తాను ప్రపంచంలో ఎక్కడైనా ఉంటానని రఘురాం రాజన్ తెలిపారు.
బుధవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన అసోచామ్ సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ రంగ రాజన్ ఆయన భవిష్యత్ జీవితంపై ఎవ్వరూ ఊహా కథనాలు అల్లొద్దని స్పష్టం చేశారు. మరో రెండు నెలలు పదవిలో ఉంటానని, తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా తాను నివసించే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా భారత్ లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. సమావేశం సందర్భంగా మాట్లాడిన ఆయన.. క్రెడిట్ రేటు మందగించడానికి అధిక వడ్డీరేట్లు కారణం కాదన్నారు. బ్యాలెన్స్ షీట్లను పటిష్ఠపరచడం, రుణాలను పెంచడం వంటివి చాలా సున్నితమైన ఆంశాలుగా ఆయన వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకులకు సాయపడుతున్నట్లు తెలిపారు.