ప్రతీకాత్మక చిత్రం
ఆయా రాజకీయ పార్టీలనుంచి భారీ ఎత్తున చేరికలు జరిగాక అధికార టీఆర్‌ఎస్ కలగూర గంపలా తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు గ్రూపులు తయారయ్యాయి. దీంతో ఎవరికి వారు వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు కొన్నిచోట్ల పొసగడం లేదు. మరికొన్నిచోట్ల ఇన్‌చార్జ్, ఇతర నాయకులు కలిసి పనిచేయలేకపోతున్నారు. ఈ పరిణామాలతో కిందిస్థాయి కార్యకర్తల్లో అయోమయం నెలకొందని పేర్కొంటున్నారు.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా పరిధిలోని నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కేవలం నకిరేకల్, మునుగోడులను మాత్రమే దక్కించుకుంది. మిగిలిన నల్లగొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, దేవరకొండలో కాంగ్రెస్‌తో పొత్తుతో సీపీఐ విజయం సాధించాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఉన్న ఐదు నియోజకవర్గాల్లో చూడబోతే నాలుగు నియోజకవర్గాలు టీఆర్‌ఎస్ చేతిలో ఉండడంతో ఆ పార్టీ బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, ఆ ఐదు నియోజకవర్గాల్లో గ్రూపుల లొల్లి జరుగుతోంది.
కలవని మనసులు
పాత–కొత్త నాయకులు కలిసిపోయి పనిచేయాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పదే పదే చేస్తున్న సూచనలను పార్టీ నాయకులు చెవికి ఎక్కించుకోవడం లేదని టీఆర్‌ఎస్‌లోని తటస్థవర్గీయులు పేర్కొంటున్నారు. అంతా ఒక పార్టీ గొడుగుకింద ఉన్నట్లు కనిపిస్తున్నా, ఎవరికి గుంపును వారు వెనకేసుకుని సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు ఎమ్మెల్యేలు, ఇటు ఇన్‌చార్జులను కూడా లెక్కచేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నల్లగొండ : గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దుబ్బాక నర్సింహారెడ్డి నాలుగైదు నెలల కిందటి దాకా నల్లగొండ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. గతేడాది అక్టోబరులో టీడీపీనుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కంచర్ల భూపాల్‌రెడ్డికి ఇన్‌చార్జ్ పోస్టు ఇవ్వడంతో అంతర్గత పోరు మొదలైంది. వాస్తవానికి నల్లగొండలో కాంగ్రెస్‌నుంచి పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకు ముందు కొందరు టీడీపీ నేతలు సైతం గులాబీ కండువాలు కప్పుకున్నారు. వీరంతా దుబ్బాకతో కలిసి సర్దుకుపోయారు. కంచర్ల రాకతో సమస్య మొదలైందని, కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కౌన్సిలర్లు కంచర్లకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.
మిర్యాలగూడ : కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే భాస్కర్ రావుకు, అక్కడ పోటీచేసి ఓడిపోయిన ఇన్‌చార్జ్ అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి మధ్య చేతులు కలవలేదు. దీంతో పాత టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి వచ్చిన చేరిన నేతలు వేర్వేరుగానే కొనసాగుతున్నారు.
నాగార్జున సాగర్ : ఇక్కడ పార్టీ చేతిలో ఎమ్మెల్యే పదవి లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నోముల నర్సింహయ్య ఇన్‌చార్జిగా ఉన్నారు. కానీ, ఇదే నియోజకవర్గంలో ఎంసీ కోటిరెడ్డి అనే నాయకుడు అదే స్థాయిలో పార్టీలో బలంగా ఉన్నారు. వీరద్దరి గ్రూపులు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన రామ్‌చందర్ నాయక్‌కు జిల్లా రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్‌గా పదవి దక్కింది. ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు కానీ, నియోజకవర్గ ఇన్‌చార్జి గైర్హాజరయ్యారు.
దేవరకొండ : జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో గ్రూపుల గొడవ షురూ అయ్యింది. ఇప్పటికీ ఈ రెండు గ్రూపులు కలవడం లేదు. కార్యక్రమాలూ వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. పదవుల పంపకంలో వీరి గ్రూపులు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి.
మునుగోడు : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ల గ్రూపులు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. బయటకు అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా సంస్థాగతంగా అంత సవ్యంగా లేదని పేర్కొంటున్నారు. పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో నష్టం జరుగుతుందన్న ఆందోళన.. ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment