మాస్టర్ కార్డ్ కు భారీ షాక్
లండన్ : బ్రిటన్ లో దాదాపు 46 మిలియన్ల పౌరులకు డెబిట్, క్రెడిట్ సేవలు అందిస్తున్న మాస్టర్ కార్డ్ సంస్థకు ఊహించని పరిణామం ఎదురైంది. గత 16 సంవత్సరాలుగా వినియోగదారులనుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై లండన్ లోని కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. బ్రిటన్‌కు చెందిన న్యాయ సంస్థ క్విన్ ఇమాన్యుయేల్ ఈ దావా వేసింది. ఖాతాదారులకు అందించే సేవలపై అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపిస్తూ, దాదాపు రూ.1.30 లక్షల కోట్లు (19 బిలియన్ డాలర్లు) చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ తాజా వివాదంతో మాస్టార్ కార్డ్ మరోసారి ఇబ్బందుల్లో పడింది.
1992-2007 మధ్య వినియోగదారులనుంచి చట్టవిరుద్ధమైన అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ దాదాపు 600 పేజీల డాక్యుమెంట్ ను కాంపిటీషన్ అప్పీల్ ట్రైబ్యునల్ కు సమర్పించింది. పెరిగిన రుసుముల భారాన్ని కూడా అంతిమంగా వినియోగదారులపైనే వేసినట్టు ఆరోపిస్తూ క్విన్ ఇమాన్యుయేల్‌కు చెందిన న్యాయవాది, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ స్వతంత్ర న్యాయాధికారి వాల్టర్ మెరిక్స్ బీబీసీ కి తెలిపారు. దుకాణాదారులు యూజర్ల డెబిట్, క్రెబిట్ కార్డులు స్వైప్ చేసినపుడు చట్ట విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇది బ్రిటన్ వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్న ఒక అదృశ్యమైన పన్ను లాంటిదని వ్యాఖ్యానించారు .అయితే ఈ వాదనలను మాస్టర్ కార్డ్ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని తెలిపింది. మరోవైపు బ్రిటన్ చరిత్రలో మాస్టర్‌కార్డ్‌పై ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద దావా అని విశ్లేషకులు చెబుతున్నారు.